Savings Account: ఈ పొదుపు పథకాలు మహిళలకు ప్రత్యేకం!

ప్ర‌స్తుతం బ్యాంకులు మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు కూడా ప్ర‌త్యేక పొదుపు ఖాతాల‌ను అందిస్తున్నాయి. 

Updated : 03 Aug 2022 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకింగ్ వ్యవస్థతో తొలి ప‌రిచ‌యం అంటే పొదుపు ఖాతానే అవుతుంది. బ్యాంకులో డ‌బ్బు డిపాజిట్, విత్‌డ్రా, ఇత‌ర లావాదేవీల నిర్వ‌హ‌ణ‌లో పొదుపు ఖాతా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఖాతాలో ఉంచిన పొదుపు మొత్తంపై కొంత వ‌డ్డీని కూడా పొందొచ్చు. బ్యాంకులో పొదుపు ఖాతాల‌ను ఎవరైనా తెర‌వొచ్చు. ప్ర‌స్తుతం బ్యాంకులు మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు కూడా ప్ర‌త్యేక పొదుపు ఖాతాల‌ను అందిస్తున్నాయి. 

మ‌హిళల‌ను ఆర్థికంగా ప్రోత్స‌హించేందుకు బ్యాంకులు అధిక వ‌డ్డీతో కూడిన ఖాతాల‌ను అందించ‌డంతో పాటు, వివిధ ర‌కాల రాయితీలు, ఆఫ‌ర్ల‌తో డెబిట్ కార్డుల‌ను, తక్కువ వ‌డ్డీకే రుణాలను, ఛార్జీల ర‌ద్దుతో డీమ్యాట్ ఖాతాల‌ను అందిస్తున్నాయి. బ్యాంకులు మ‌హిళ‌ల కోసం అందించే ఈ అద‌నపు ఫీచ‌ర్ల‌తో.. డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. త‌ద్వారా ఆర్థిక ప్ర‌ణాళిక‌ను రూపొందించి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల‌ను సైతం ఎదుర్కోవచ్చు.

ఆర్‌బీఎల్ బ్యాంక్ ఉమెన్స్ ఫ‌స్ట్ సేవింగ్స్ అకౌంట్‌: ఈ ఖాతాతో మ‌హిళ‌లు అధిక వ‌డ్డీ రేటుతో పాటు మ‌హిళల కోస‌మే రూపొందించిన ఆర్‌బీఎల్ ఫ‌స్ట్ డెబిట్ కార్డును పొంద‌వ‌చ్చు. ఈ కార్డుతో డైనింగ్‌, హెల్త్‌, లైఫ్‌స్టైల్ వంటి వ‌స్తు,సేవ‌ల కోనుగోలుపై అనేక ఆఫ‌ర్‌ల‌ను బ్యాంక్‌ అందిస్తుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.1 ల‌క్షలోపు డిపాజిట్ల‌పై 4.25 శాతం, రూ. 10 ల‌క్ష‌ల పైన, 5 కోట్ల లోపు డిపాజిట్ల‌పై అత్య‌ధికంగా 6 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది.

ఫీచ‌ర్లు..
*
క‌నీస బ్యాలెన్స్ - రూ.10,000

* పిల్ల‌ల కోసం ఒక జీరో బ్యాలెన్స్ ఖాతాను తెర‌వచ్చు. అయితే ప్ర‌తి నెలా రూ.500 ఖాతాలో డిపాజిట్ చేసేట్టుగా సూచ‌న‌లు ఇవ్వాలి. క‌నీసం ఒక సంవ‌త్స‌ర‌మైనా ఖాతాను కొన‌సాగించాలి.

* ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్ ద్వారా ప‌న్ను చెల్లింపులు, బిల్లు చెల్లింపులు ఉచితంగా చేసే స‌దుపాయం ఉంటుంది.

* లాక‌ర్ అద్దెకు తీసుకుంటే మొద‌టి సంవ‌త్స‌రం అద్దెపై 10 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. 

* ఉమెన్ ఫ‌స్ట్ డెబిట్ కార్డు యాక్టివేష‌న్ స‌మ‌యంలో రూ. 2500 విలువైన ఓచ‌ర్లు ల‌భిస్తాయి. 

* డెబిట్ కార్డుపై కాంప్లిమెంట‌రీగా బీమా ల‌భిస్తుంది. 

ఈక్వీటాస్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌: ఈ బ్యాంక్ మ‌హిళ‌ల‌కు రెండు ర‌కాల పొదుపు ఖాతాల‌ను అందిస్తుంది. ‘ఈవా’, ‘ఈవా ఎలైట్’. ఈ ఖాతాల్లో రూ.1 ల‌క్ష లోపు డిపాజిట్ల‌పై 3.50 శాతం, రూ. 1 ల‌క్ష పైన, రూ. 5 లక్ష‌ల లోపు డిపాజిట్ల‌కు 6 శాతం, రూ.5 ల‌క్ష‌ల‌పైన, రూ. 2 కోట్లలోపు డిపాజిట్ల‌కు అత్య‌ధికంగా 7 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది.
‘ఈవా’ పొదుపు ఖాతా

 * రిలేష‌న్‌షిప్‌ (ఒకే క‌స్ట‌మ‌ర్ ఐడీ కింద‌కి వ‌చ్చే పొదుపు, రిక‌రింగ్‌, ట‌ర్మ్ డిపాజిట్ ఖాతాల బ్యాలెన్స్‌) విలువ మెట్రో, అర్బ‌న్ ప్ర‌దేశాల‌లో రూ.10 వేలు, సెమీ అర్బ‌న్‌, గ్రామీణ ప్రాంతాల‌లో రూ. 5 వేలు ఉండాలి. 
* లాక‌ర్ అద్దెపై 25 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది.
* రిజిస్ట్రేష‌న్ అయిన త‌ర్వాత మూడు నెల‌ల పాటు టెలి హెల్త్ క‌న్స‌ల్టేష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది.
* కుటుంబ బ్యాంకింగ్‌తో అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.
* డెబిట్ కార్డు ఉప‌యోగించి చేసే ఖ‌ర్చుల‌పై రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి.

‘ఈవా’ ఎలైట్  పొదుపు ఖాతా..
* రిలేష‌న్‌షిప్‌ విలువ రూ.2,50,000.
* లాక‌ర్ అద్దెపై 50 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది.
* రిజిస్ట్రేష‌న్ అయిన త‌ర్వాత మూడు నెల‌ల పాటు టెలి హెల్త్ క‌న్స‌ల్టేష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. 
* కుటుంబ బ్యాంకింగ్‌తో అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. 
* డెబిట్ కార్డు ఉప‌యోగించి చేసే ఖ‌ర్చుల‌పై, ల‌క్ష్యం ఆధారిత పొదుపుపై రివార్డు పాయింట్లు ల‌భిస్తాయి. 
కొటాక్ సిల్క్ ఉమెన్ సేవింగ్స్ అకౌంట్‌..
ఈ ఖాతాలో చేసిన డిపాజిట్ల‌పై బ్యాంక్ 3.50 శాతం వ‌డ్డీ అందిస్తుంది. 
* కొటాక్ సిల్క్ డిబిట్ కార్డును ఉప‌యోగించి చేసే లావాదేవీల‌పై క్యాష్ బ్యాక్‌తో పాటు స్పెష‌ల్ ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.
* లాక‌ర్ అద్దెకు తీసుకుంటే మొద‌టి సంవ‌త్స‌రం అద్దెపై 35 శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది. 
* క్యాష్ పిక‌ప్‌, డెలివ‌రీ, చెక్‌/డ్రాఫ్ట్ సేవ‌ల‌ను ఇంటి వ‌ద్ద పొంద‌వ‌చ్చు.
* పిల్ల‌ల పేరుతో జీరో బ్యాలెన్స్ ఖాతాను తెర‌వ‌చ్చు. 

యాక్సిస్ ఉమెన్స్ సేవింగ్స్ ఖాతా..
ఈ బ్యాంక్ మ‌హిళ‌ల పొదుపు ఖాతాపై 3 శాతం వ‌డ్డీ అందిస్తుంది. 
* 17,000 యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంల‌లో 4,400 యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌ల‌లో యాక్సిస్ ల‌భిస్తుంది.
* ఇంట‌ర్నెట్‌, మొబైల్ బ్యాంకింగ్ స‌దుపాయం ల‌భిస్తుంది.
* మెట్రో, అర్బ‌న్ ప్రాంతాల‌లో జారీ చేసే రూపే ప్లాటిన‌మ్ డెబిట్ కార్డుపై రూ.200 జారీ ఫీజు, రూ.200 వార్షిక ఫీజు వ‌ర్తిస్తుంది.
* ఏటీఎం నుంచి గ‌రిష్ఠంగా రూ.40,000, షాపింగ్ లావాదేవీల కోసం రూ.2,00,000 రోజువారీ విత్‌డ్రా ప‌రిమితి ఉంటుంది.
* యాక్సిస్ బ్యాంకు ఏటీఎంల‌లో మొద‌టి 5 లావాదేవీలు ఉచితంగా ల‌భిస్తాయి. 
* ఇత‌ర ఏటీఎంల‌లో మొద‌టి మూడు లావాదేవీలు మాత్ర‌మే ఉచితంగా ల‌భిస్తాయి.
* విద్యా రుణంపై ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, ప్రీక్లోజ్ ఛార్జీలు వ‌ర్తించ‌వు.
* ఈ కార్డుపై రూ.2 లక్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా ల‌భిస్తుంది. అయితే ఇది యాక్టివ్‌గా ఉండాలంటే ప్ర‌తి 6 నెల‌ల‌కు ఒక‌సారైనా కార్డుతో లావాదేవీలు చేసి ఉండాలి.

ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్
ఈ బ్యాంక్ మ‌హిళ‌ల పొదుపు ఖాతాలో చేసిన రూ. 50 ల‌క్ష‌లలోపు డిపాజిట్ల‌పై 3 శాతం, రూ.50 ల‌క్ష‌ల పైన చేసిన డిపాజిట్ల‌పై 3.50 శాతం వ‌డ్డీ అందిస్తుంది.
* మ‌హిళ‌ల‌కు గృహ రుణంపై ప్ర‌త్యేక‌ వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి. 
* డెబిట్ కార్డు ద్వారా విందు, వినోదాలు, బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలు కోసం చేసే ఖ‌ర్చుపై రూ. 750 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. 
* మొద‌టి సంవ‌త్స‌రం లాక‌ర్ అద్దెపై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది. ఇది ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల పొదుపు ఖాతాపై మాత్ర‌మే అందుబాటులో ఉంది. 
* ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ వంటి ఇత‌ర స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి. 

ఐడీబీఐ సూప‌ర్ శ‌క్తి ఉమెన్స్ అకౌంట్..
ఈ  ఖాతా రూ. 5 కోట్ల లోపు డిపాజిట్ల‌పై 3 శాతం, రూ. 5 కోట్ల పైనా, రూ.100 కోట్ల లోపు డిపాజిట్ల‌పై 3.25 శాతం, రూ. 100కోట్ల పైన డిపాజిట్ల‌పై 3.35 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంది. 

* మెట్రో, అర్బ‌న్ ప్ర‌దేశాల‌లో రూ. 5,000, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో రూ.2500, గ్రామీణ ప్రాంతాల్లో  రూ.500 క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించాలి.
* రూ. 15,000 పైన డిపాజిట్ల‌కు ఆటో స్వైప్ అవుట్‌, ఆటో స్వైప్ ఇన్ స‌దుపాయం ఉంది.
* ఈ పొదుపు ఖాతాతో మ‌హిళ కోసం ప్ర‌త్యేకించి రూపొందించిన మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ ఏటీఎం క‌మ్ డెబిట్ కార్డును పొందొచ్చు.
* ఏటీఎం నుంచి రోజుకు రూ. 40,000 విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

 * వ్య‌క్తిగ‌త పీఏపీ చెక్‌బుక్‌, లాక‌ర్ స‌ర్వీసుల‌పై 15 శాతం రాయితీ, డీమ్యాట్ ఏఎంసీపై 50 శాతం రాయితీ పొంద‌వ‌చ్చు. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్..
ఈ బ్యాంక్ రూ. 50 ల‌క్ష‌ల లోపు డిపాజిట్ల‌పై 3 శాతం, రూ. 50 ల‌క్ష‌ల పైన డిపాజిట్ల‌పై 3.50 శాతం వ‌డ్డీ అందిస్తుంది.

*  మెట్రో, అర్బ‌న్ ప్ర‌దేశాల్లో రూ.10,000, సెమీ అర్బ‌న్‌, గ్రామీణ ప్రాంతాల్లో  రూ.5,000 క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించాలి. 
* ఈ ఖాతా ద్వారా యాక్సిడెంట‌ల్ డెత్ క‌వ‌ర్ రూ. 10 ల‌క్ష‌లు, యాక్సిడెంట‌ల్ హాస్పిట‌లైజేష‌న్ క‌వ‌ర్ రూ.1 ల‌క్ష ఉంటుంది. 
* ప్ర‌మాదం కార‌ణంగా ఆసుప్ర‌తిలో చేరాల్సి వ‌స్తే సంవ‌త్స‌రానికి గ‌రిష్ఠంగా 10 రోజులు.. రోజు వారీ న‌గ‌దు రూ. 1000 చొప్పున అందిస్తారు.
* రోజువారీ న‌గ‌దు విత్‌డ్రా ప‌రిమితి రూ. 25,000, షాపింగ్ లిమిట్ రూ.2,75,000 ఉంటుంది. 
* వాహ‌న రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వాహ‌న ఆన్‌-రోడ్ ధ‌ర‌లో 90 శాతం రుణంగా, 7 సంవత్స‌రాల కాల‌ప‌రిమితితో పొందొచ్చు.
* నెట్ బ్యాంకింగ్‌, ఫోన్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ వంటి స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

చివ‌రగా: మ‌హిళ‌లు కొత్త పొదుపు ఖాతాను తెరిచేటప్పుడు అందించే వడ్డీ రేటు, డెబిట్ కార్డ్ ఛార్జీలు, ఇతర కీలక సౌకర్యాలు/ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. చాలా వ‌ర‌కు బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా పొదుపు ఖాతాను తెరిచేందుకు అనుమ‌తిస్తున్నాయి. బ్యాంకులు అందించే ఈ సదుపాయంతో మ‌హ‌ళ‌లు పొదుపును అలవాటు చేసుకుని, భ‌విష్య‌త్‌ అవ‌స‌రాల కోసం పెట్టుబ‌డులు పెట్టాలి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన వ‌డ్డీ రేట్లు 2022 జూన్ 6 నాటివి. బ్యాంకులు ఇచ్చే ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను మాత్ర‌మే ఇక్క‌డ ఇవ్వ‌డం జ‌రిగింది. పొదుపు ఖాతాను తెరిచే ముందు అన్ని విష‌యాల‌నూ నిశితంగా తెలుసుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని