Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మదుపర్లకు మంచిరోజులు.. పెరుగుతున్న వడ్డీరేట్లు!

FD interest rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లను సైతం బ్యాంకులు క్రమంగా పెంచడం మొదలుపెట్టాయి.

Published : 15 Jun 2022 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ధరల పెరుగుదలను కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ ఇటీవల రెపోరేటును పెంచింది. రెండు దఫాల్లో మొత్తం 90 బేసిస్‌ పాయింట్లు సవరించింది. దీంతో ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణరేట్లను పెంచాయి. అదే సమయంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Fixed Deposits) రేట్లను సైతం బ్యాంకులు క్రమంగా పెంచడం మొదలుపెట్టాయి.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎఫ్‌డీలపై వడ్డీని 0.20% పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈనెల 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 211 రోజుల నుంచి ఏడాది వ్యవధి డిపాజిట్లపై వడ్డీ ఇప్పుడున్న 4.40 శాతం నుంచి 4.60కు చేరింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ 5.30 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ లభించనుంది. సీనియర్‌ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. దీంతోపాటు రూ.2 కోట్ల పైబడిన డిపాజిట్లపై వడ్డీని 0.75 శాతం మేరకు పెంచింది.

* ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం డిపాజిట్‌ రేట్లను పెంచింది. రూ.రెండు కోట్లు అంతకంటే తక్కువ డిపాజిట్లపై కాలపరిమితిని బట్టి గరిష్ఠంగా 25 బేసిస్‌ పాయింట్ల వరకు సవరించింది. జూన్‌ 15 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల మధ్య కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీరేట్లను హెచ్‌డీఎఫ్‌సీ 4.40 శాతం నుంచి 4.65 శాతానికి సవరించింది. 9 నెలల నుంచి ఏడాది కాలపరిమితి గల రేట్లను 4.50% నుంచి 4.65%, ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలావధి గల రేట్లను 5.10 శాతం నుంచి 5.35 శాతానికి పెంచింది. 

* రూ.రెండు కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ సైతం వడ్డీరేట్లను సవరించింది. 185 - 289 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 4.40%, 271 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాలావధి కలిగిన డిపాజిట్లపై 4.70%, ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీరేటును అందిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్లకు 5.40%, 3-5 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీరేటును నిర్ణయించారు.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1-10 ఏళ్ల డిపాజిట్లపై 10-35 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటు పెంచింది.

* రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25% వరకు ఈనెల 15 నుంచి పెంచుతున్నట్లు ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని