Banking Crisis: నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!

వారం వ్యవధిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు బ్యాంకుల్లో సంక్షోభ ఘంటికలు మోగాయి. వీటిల్లో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్‌ కూడా ఉంది. స్థానిక ప్రభుత్వాలు రంగంలోకి దిగి సర్దుబాటు చేశాయి. కానీ, వడ్డీరేట్లు పెరిగే కొద్దీ బ్యాంకింగ్‌లో సంక్షోభాలు ముదురుతాయేగానీ.. తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. చాలా బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 

Updated : 19 Mar 2023 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా(USA) మార్కెట్లు తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్నది నానుడి. 2008లో ఇక్కడ లేమన్‌ బ్రదర్స్‌ పతనం ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టింది. తాజాగా అమెరికా(USA) ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం గంటలు మోగుతున్నాయి. వారం వ్యవధిలో సిలికాన్‌ వ్యాలీ, సిల్వర్‌గేట్‌ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకులు భారీ కుదుపులకు లోనయ్యాయి. ప్రకంపనలు ఐరోపాను తాకాయి. ఎప్పటి నుంచో ఊసురోమంటూ నెట్టుకొస్తున్న స్విస్‌ దిగ్గజం క్రెడిట్‌ సూయిజ్‌ మరోసారి ఆర్థిక ఐసీయూపైకి చేరింది. చివరికి ప్రభుత్వం రంగంలోకి దిగి నిధులు సర్దుబాటు చేయడంతో తాత్కాలికంగా కోలుకొంది. అసలే ద్రవ్యోల్బణం ముదిరి ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తున్న సమయంలో ఇటువంటి సంకేతాలు మార్కెట్లను వణికించేస్తున్నాయి. గత వారంలో నాలుగు సెషన్లు నష్టాల్లోనే ముగియడం పరిస్థితికి అద్దం పడుతోంది.

అమెరికా(USA) బ్యాంకింగ్‌ కష్టాలు తీరాయా..?

వరుసగా బ్యాంకుల పతనాలు వాషింగ్టన్‌లో ఆందోళన రేకెత్తించాయి. ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను కాపాడేందుకు ఏకంగా 11 పెద్ద బ్యాంకులు కలిసి 30 బిలియన్‌ డాలర్లు సమకూర్చాయి. ఇక్కడితో సంక్షోభం ఆగుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఈ ఒక్క నెలలోనే అమెరికా (USA)బ్యాంకుల మార్కెట్‌ విలువ ఏకంగా 229  బిలియన్‌ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో 2022 నాటికి గుర్తించని నష్టాలు సుమారు 620 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా. ఈ మొత్తం అమెరికా(USA) బ్యాంకిగ్‌ వ్యవస్థలోనే హైలిక్విడిటీ (వేగంగా నగదుగా మార్చుకోగల) ఉన్న ఆస్తుల్లో మూడింట ఒకటో వంతుకు సమానం. గత వారం ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్ప్‌ (ఎఫ్‌డీఐసీ) ఛైర్మన్‌ మార్టిన్‌ గ్రెయెన్‌బెర్గ్‌ వీటిని దృష్టిలో పెట్టుకొనే హెచ్చరికలు జారీ చేశారు. చాలా బ్యాంకులు ఎస్‌వీబీ ఉన్న పరిస్థితుల్లో లేకపోవడం ఒక్కటే సానుకూలాంశం. ఆర్థిక సంక్షోభం విరుచుకుపడటానికి పెద్దగా కారణాలు అవసరం లేదనడానికి 2008 సంక్షోభం ఒక ఉదాహరణ. అప్పట్లో  లేమన్‌బ్రదర్స్ మొత్తం ఆస్తులు 613 బిలియన్‌ డాలర్లు కాగా.. అప్పులు 639 బిలియన్‌ డాలర్లు. వీటి మధ్య తేడా కేవలం 26 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ, భయాలు మాత్రం తీవ్రంగా వ్యాపించే మార్కెట్లు కుప్పకూలాయి.

2007-09లోనే బీజాలు..

2007-09లో బ్యాంకులు విచ్చలవిడిగా రుణాలు మంజూరు చేయడం అప్పట్లో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలిచింది. కానీ, ఆ తర్వాత నుంచి రుణాల విషయంలో నియంత్రణ సంస్థలు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి. బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల సొమ్మును కొనుగోలుదారులు తేలిగ్గా దొరికే ప్రభుత్వ బాండ్ల వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. ఫలితంగా అమెరికా(USA) బాండ్‌ మార్కెట్‌ బ్యాంకులకు ఆధారంగా మారింది. సుదీర్ఘకాలం పాటు తక్కువ వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం ఉండటంతో దీర్ఘకాలిక బాండ్ల విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, కొవిడ్‌ సమయంలో ఫెడ్‌ ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నగదును చొప్పించింది. దీంతో బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో డబ్బు వెల్లువెత్తింది. ఈ డిపాజిట్ల సొమ్ముతో బ్యాంకులు దీర్ఘకాలిక బాండ్లు, ప్రభుత్వ హామీ ఉన్న మార్టిగేజ్‌ సెక్యూరిటీలను కొనుగోలు చేశాయి. బాండ్లలో వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ బాండ్లను మెచ్యూరిటీ తేదీల వరకు బ్యాంకులు ఉంచుకోవాలంటే వాటి ఖాతాదార్ల డిపాజిట్‌ సొమ్ము కొనసాగాలి. జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా(USA) వంటి పెద్ద బ్యాంకుల్లో కస్టమర్లు ఓ పట్టాన డిపాజిట్లు తీయరు. కానీ, అమెరికాలోని 10.5 ట్రిలియల్‌ డాలర్ల ఆస్తులున్న 4,000కు పైగా చిన్న, మధ్య తరగతి బ్యాంకుల్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ డిపాజిట్లను నిలబెట్టుకోవాలంటే మరింత మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి ఆయా బ్యాంకుల లాభాలను గణనీయంగా హరించేస్తుంటాయి.

వడ్డీ రేట్ల పెంపుతో..

2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రకటన చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత 30ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమెరికా(USA)లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలను కట్టడి చేయడం బైడెన్‌ సర్కార్‌కు సవాల్‌గా మారింది. దీంతో 2022 మార్చి నుంచి అమెరికా ఫెడ్‌ దూకుడుగా వడ్డీరేట్లను పెంచడం మొదలుపెట్టింది. దాదాపు ఏడాది వ్యవధిలో 4.5శాతం పెంచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బాండ్లపై వచ్చే వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆ బాండ్ల అసలు ధరలు మార్కెట్లో గణనీయంగా పడిపోయాయి. 

* ఉదాహరణకు రూ.100 విలువైన ప్రభుత్వ బాండ్‌పై రూ.1 వడ్డీ వస్తోందనుకుందాం. దీనిని ఈల్డ్‌ అంటారు. ఆ సమయంలో కేంద్రబ్యాంక్‌ వడ్డీ 0.75పైసలు ఉంది. అప్పుడు బాండ్లలో పెట్టుబడి బ్యాంకులకు లాభదాయకం. ఆ బాండ్లను ఓపెన్‌ మార్కెట్లు రూ.100 కంటే ఎక్కువ ధరకు (రూ.110 అనుకొందాం) విక్రయించుకోవచ్చు కూడా. కానీ ఆ బాండ్లకు రూ.1 వడ్డీ స్థిరంగా కొనసాగుతుంది. అంటే రూ.100 పెట్టుబడిపైన వచ్చిన వడ్డీనే రూ.110పై కూడా లభిస్తుంది. అంటే ఓపెన్‌ మార్కెట్లో బాండ్లు కొన్నవారు పెట్టిన పెట్టుబడిపై కొత్త వడ్డీ శాతం తగ్గుతుంది. అదే ప్రభుత్వ వడ్డీనే రూ.4.5 అయితే.. బాండ్లలో వచ్చే రూ.1 వడ్డీ బ్యాంకులకు నష్టమే. ఎందుకంటే బ్యాంకులు సేకరించిన డిపాజిట్లపై కూడా పెరిగిన వడ్డీ చెల్లించాలి. అంటే వాటికి రూ.3.5 నష్టం అన్నమాట.  ఆ బాండ్లను ఓపెన్‌ మార్కెట్లో విక్రయించాలన్నా అసలు విలువ రూ.100కు కొనుగోలు చేయరు. అంతకంటే తక్కువకు కొనుగోలు చేస్తేనే పెట్టుబడి దారులకు వడ్డీరేటు(ఈల్డ్‌లు పెరిగి) గిట్టుబాటవుతుంది. 

అమెరికా(USA) బ్యాంకులకు గుట్టలుగా నష్టాలు..

ఈ క్రమంలో తక్కువ ఈల్డ్‌లను ఇచ్చే బాండ్లను అట్టేపెట్టుకోవడం అమెరికా(USA)లోని బ్యాంకులకు తలకు మించి భారంగా మారింది. 2022 నాటికి  బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా 862 బిలియన్‌ డాలర్ల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టింది. వీటిల్లో 632 డాలర్లు బాండ్లే ఉన్నాయి. బాండ్ల ధరలు పడిపోయినా.. బ్యాంకులు ఉంచుకొన్నంతకాలం వాటిని నష్టాల కింద చూపరు. ఒక్కసారి వాటిని తక్కువ ధరకు విక్రయించాక నష్టాలు బయటపడతాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ కూడా ఇలా తక్కువ ఈల్డ్‌ సెక్యూరిటీలు, బాండ్లను విక్రయించి 1.5 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టం మూటగట్టుకోవడంతో పతనమైంది. అసలు బ్యాంక్‌ వద్ద మొత్తం సెక్యూరిటీల పోర్టుఫోలియో 91 బిలియన్‌ డాలర్లు ఉండగా.. వాటిపై 15 బిలియన్‌ డాలర్లు నష్టం ఉన్నట్లు అమెరికా పత్రికలు ఘోషిస్తున్నాయి.   

ఇక జేపీ మోర్గాన్‌ 36 బిలియన్‌ డాలర్లు, వెల్స్‌ఫార్గో (డబ్ల్యూఎఫ్‌సీ)41 బిలియన్‌ డాలర్లు, సిటీగ్రూప్‌ 25 బిలియన్‌ డాలర్లు, గోల్డ్‌మన్‌ శాక్స్‌ 1 బిలియన్‌ డాలర్ల నష్టాలు ఇటువంటి కోవకు చెందినవే. వీటిని ఆయా కంపెనీలు అమెరికా(USA) సెక్యూరిటీ అండ్‌ ఎక్స్‌ఛేంజి కమిషన్‌ అందజేసిన వార్షిక 10-కే ఫైలింగ్స్‌లో పేర్కొన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వద్ద నష్టాల్లో ఉన్న 221 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లు అమ్మకానికి ఉన్నట్లు లెక్కల్లో చెబుతోంది. ఇప్పటికే వాటిపై 4 బిలియన్‌ డాలర్ల నష్టం మూటగట్టుకొంది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందగా ఉంది అమెరికా(USA) బాండ్‌ మార్కెట్‌ పరిస్థితి.

మరోవైపు క్రెడిట్‌ సూయిజ్‌..

క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ బ్యాంక్‌ 2004-08 మధ్యలో బల్గేరియాలోని మాదకద్రవ్యాల డీలర్లకు మనీలాండరింగ్‌లో సాయం చేసినట్లు క్రిమినల్‌ ఆరోపణలు 2022 జూన్‌లో న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యాయి. మోజాంబిక్‌లో అవినీతి ఆరోపణలు ఈ బ్యాంక్‌పై ఉన్నాయి. దీని మాజీ ఉద్యోగులపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. అమెరికా(USA), బ్రిటిన్‌ సంస్థల కేసుల వల్ల కూడా భారీగా పరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. యూకే, స్విట్జర్లాండ్‌లలో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలతో బ్యాంక్‌ కొత్త ఛైర్మన్‌ హోర్టా-ఒసోరియో రాజీనామా చేయాల్సి వచ్చింది.  2022లో వినియోగదారుల డేటా పొరబాటున లీకైంది. మానవహక్కుల హననం చేసేవారు, అవినీతి రాజకీయ నాయకులు, ఆంక్షల పరిధిలోని వ్యాపారవేత్తలకు ఈ బ్యాంక్‌ సేవలు అందించనట్లు తేలింది.

అన్నింటికీ మించి క్రెడిట్‌ సూయిజ్‌ 2022 సంవత్సరలో 7.3 బిలియన్‌ డాలర్ల నష్టం చవిచూసినట్లు మార్చిలో పేర్కొంది. 2008లోనూ ఈ సంస్థ ప్రకటించిన 8.9 బిలియన్‌ డాలర్లకు నష్టాలను ప్రకటించింది. గతే ఏడాది డిపాజిట్లు.. నిర్వహణలోని ఆస్తులు 110.5 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. దాదాపు 390 బిలియన్‌ డాలర్ల నుంచి సుమారు 230 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇక మార్చి 9న అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజి కమిషన్‌ ఈ బ్యాంక్‌ పాత నివేదకలను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సంస్థ తన 2021, 2022 నివేదికల్లో కొన్ని బలహీనతలు కనుగొన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ప్రధాన పెట్టుబడిదారు అయిన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ తాము మరిన్ని నిధులను ఇవ్వలేమని తేల్చిచెప్పడం భయాలను రాజేసింది. దీంతో చివరికి స్విస్‌ ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్‌ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే యత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఐరోపా కేంద్ర బ్యాంకు మరోసారి వడ్డీరేట్లు పెంచడం క్రెడిట్‌ సూయిజ్‌ కష్టాలను మరింత పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని