Home Loans: గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్‌?

ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?

Published : 16 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత ఇంటిని పొందడానికి చాలా బడ్జెట్‌, దీర్ఘకాలిక ప్రణాళిక, దూరదృష్టి లాంటివి ఎంతో అవసరం. సాధారణంగా ఎక్కువ మంది బ్యాంకు రుణంతో ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. భారత్‌లో ఇంటిపై రుణం పొందడం అంత తేలికైన పనికాదు. ఇంటి రుణం అనేది చాలా పెద్ద అప్పు. కాబట్టి బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు దరఖాస్తుదారుడి చాలా ఆర్థిక విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్నిసార్లు ఒకే క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఇంటి రుణ దరఖాస్తుల విషయంలో వేర్వేరు ఫలితాలను పొందొచ్చు. ఇంటి రుణం ఒక్క క్రెడిట్‌ స్కోరుతోనే కాకుండా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇంటి రుణం ఆమోదించే ముందు బ్యాంకులు పరిగణించే ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందే రుణాలుంటే..

ఇంటి రుణ దరఖాస్తుదారుడు ఇప్పటికే రుణాలు కలిగి ఉండి, ఈఎంఐలు చెల్లిస్తున్నట్లయితే అతని ఇంటి రుణ అర్హత తగ్గుతుంది. రుణాలు తీసుకుని రీపేమెంట్స్‌ సరిగ్గా చేయనివారిని ఆర్థిక సంస్థలు అనుమానాస్పదంగా పరిగణిస్తాయి. అందుచేత సమయానికి EMI చెల్లించడం ఎంతో ముఖ్యం.

వయసు

ఇంటి రుణం మంజూరు చేసే సమయంలో ఆర్థిక సంస్థలు పరిగణించే ముఖ్యమైన అంశం వయసు. 30-50 సంవత్సరాల వయసు గల వ్యక్తులను రుణం పొందడానికి ఉత్తమ అభ్యర్థులుగా బ్యాంకులు పరిగణిస్తాయి. ఎందుకంటే వారికి రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన సంఖ్యలో పని సంవత్సరాలు మిగిలి ఉంటాయి. రుణాన్ని తిరిగి చెల్లించే ఆదాయ శక్తి సామర్థ్యాలు ఈ వయసులో ఉన్నవారికి అధికంగా ఉంటాయని బ్యాంకుల నమ్మకం.

స్థిరత్వం

ఇంటి రుణాన్ని ఆమోదించే ముందు ఆర్థిక సంస్థలు వ్యక్తి స్థిరత్వం కోసం చూస్తాయి. ఉద్యోగాలు మారుతూ ఉండే వ్యక్తుల పట్ల బ్యాంకులు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉంటాయి. సందేహాస్పదమైన ట్రాక్‌ రికార్డు ఉన్న కంపెనీలో పనిచేసే వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి ఆర్థిక సంస్థలు వెనకాడతాయి. కనీసం 3 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులను ఇష్టపడతాయి. ఒక వ్యక్తి సంస్థలో ఎంత ఎక్కువ కాలం పనిచేస్తే, రుణం పొందే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.

వృత్తి

గృహ రుణాన్ని అంచనా వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాలలో వృత్తి ఒకటి. ఎందుకంటే, తిరిగి చెల్లించే సామర్థ్యం వ్యక్తికి సంబంధించిన ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం, స్థిర ఆదాయం ఉన్న వ్యక్తులకు రుణం ఇవ్వడంలో ప్రాధాన్యం ఉంటుంది. ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు.. వారి ఉద్యోగాల స్థిరత్వం కారణంగా బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తాయి. అలాగే, ప్రముఖ సంస్థల్లో పనిచేసే వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు ఇంటి రుణాన్ని పొందేవారిలో రెండో వరుసలో ఉంటారు. స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, కాంట్రాక్టర్లకు రుణం మంజూరు చేసేటప్పడు ఆర్థిక సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకుంటాయి. అలాంటి వారు అకౌంట్ పుస్తకాలూ, గత కొద్ది ఏళ్ల ITR లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి ప్రస్తుత జీతంతో పాటు రాబోయే సంవత్సరాల్లో వేతనం పెరుగుదల ఇంటి రుణం పొందడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 

జీవిత భాగస్వామి ఆదాయం

దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి ఆదాయాన్ని బట్టి, ఉమ్మడి ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల రుణ అర్హత పెరగడమే కాకుండా, రుణం కూడా అధికంగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నందున, ఇది మెరుగైన రీపేమెంట్‌ సామర్థ్యాన్ని సూచిస్తుంది. భార్య పేరు మీద ఇంటి రుణం మంజూరయితే.. వడ్డీ సాధారణ రేటు కంటే ఐదు బేసిస్‌ పాయింట్లు తక్కువ ఉంటుంది.

ఆస్తి ఉండే ప్రదేశం..

రుణం వేగంగా మంజూరు చేయడానికి ఆస్తి (ఇల్లు) ఉండే ప్రాంతం/ ప్రదేశం కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. త్వరగా విక్రయించగల ప్రదేశంలో ఉన్న ఆస్తిని బ్యాంకులు మేలైనదిగా చూస్తాయి. దూరంగా ఉన్న నివాసాలతో పోలిస్తే.. పాఠశాలలు, షాపింగ్‌ ప్లాజాలు, రైల్వే స్టేషన్, ఆసుపత్రులకు సమీపంలో సౌకర్యంగా ఉండే ఆస్తులపై రుణం పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆస్తి చాలా దూరంలో ఉంటే, బ్యాంకులు రుణాన్ని ఆమోదించడంలో వెనకాడతాయి. వీటితో పాటు దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు, డౌన్ పేమెంట్ మొత్తం, రుణ కాలవ్యవధి లాంటివి కూడా రుణ ఆమోదంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని