Budget 2023: ఈసారి బడ్జెట్‌లో బ్యాంకులకు ‘మూలధనం’ లేనట్లేనా?

Budget 2023: బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్న వేళ ఈసారి బడ్జెట్‌ (Budget 2023)లో వాటికి ప్రత్యేకంగా మూలధన సాయం ఏమీ ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Published : 22 Jan 2023 19:05 IST

దిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్‌ (Budget 2023)లో బ్యాంకులకు ప్రత్యేకంగా మూలధన కేటాయింపులు ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి లాభాల బాటలో ఉండడమే అందుకు కారణమని పేర్కొన్నాయి. బ్యాంకుల ‘క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో’ నియంత్రణాపరమైన అవసరాల కంటే 14- 20% అధికంగా ఉందని వెల్లడించాయి. 2023- 24 బడ్జెట్‌ను (Budget 2023) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

మరోవైపు మార్కెట్‌ నుంచి గ్రోత్‌ ఫండ్లను సమీకరించడం, కీలకేతర ఆస్తులను విక్రయించడం ద్వారా కావాల్సిన నిధులను బ్యాంకులు సమకూర్చుకుంటున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు తెలిపారు. ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్‌లో రూ. 20,000 కోట్లను బ్యాంకుల మూలధన అవసరాల నిమిత్తం కేటాయించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ నిమిత్తం సర్కార్‌ రూ. 3,10,997 కోట్లు కేటాయించింది. దీంట్లో రూ. 34,997 కోట్లు బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా.. మరో రూ. 2,76,000 కోట్లు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా సమకూర్చారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 15,306 కోట్ల లాభాలను ఆర్జించాయి. రెండో త్రైమాసికానికి అవి రూ. 25,685 కోట్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన తొలి త్రైమాసికంలో 9 శాతం, రెండో త్రైమాసికంలో 50 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభాలు ఏడాది క్రితంతో పోలిస్తే 74 శాతం పెరిగి రూ. 13,265 కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త లాభాలు 32 శాతం పెరిగి రూ. 40,991 కోట్లకు పెరిగాయి. పైగా వాటాదారులకు రూ. 7,867 కోట్లు విలువ చేసే డివిడెండ్లను ప్రకటించాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. మొండి బకాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంకుల లాభాలు 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు చేరడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం అనుసరించిన ‘4ఆర్‌’ (Recognition, Resolution, Recapitalisation, Reforms) వ్యూహం వల్ల మొండి బకాయిలు సైతం గణనీయంగా తగ్గాయన్నారు.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని