Savings Account: పొదుపు ఖాతా తెరుస్తున్నారా? బీమా హామీతో 7శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకులివే..

ప్రస్తుతం డిపాజిట్ బీమా పథకం కింద, బ్యాంకులోని ప్రతి డిపాజిటర్ వద్ద ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుంది

Updated : 06 Jun 2022 16:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకులో ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పొదుపు ఖాతా అవసరం. అలాగే అత్యధిక లిక్విడిటీ ఉన్న ఖాతా కూడా పొదుపు ఖాతానే. ఇందులో డబ్బు ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంకు పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తం నుంచి.. రూ.10 వేల వరకు వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. అందువల్ల అత్యవసర నిధి, స్వల్పకాలిక పెట్టుబడులు ఉంచేందుకు చాలా మంది పొదుపు ఖాతానే ఎంచుకుంటారు. ఇందులో నిధులు సురక్షితమే కాకుండా అత్యధిక లిక్విడిటీ ఉన్నప్పటికీ, రాబడి మాత్రం తక్కువగా ఉంటుంది. చాలా వరకు బ్యాంకు పొదుపు ఖాతాల నుంచి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఉండదు. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం పొదుపు ఖాతాపై 7 శాతం వడ్డీ అందిస్తున్నాయి. వీటికి డీఐసీజీసీ (డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ - DICGC) అందించే బీమా సదుపాయం కూడా ఉంది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం అంటే..?
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) అనేది రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుబంధ సంస్థ. బ్యాంకులు దివాళా తీసి, డిపాజిట‌ర్ల‌ సొమ్మును తిరిగి చెల్లించ‌లేని స్థితికి చేరుకుంటే డిపాజిటర్లు నష్టపోకుండా డీఐసీజీసీ రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం బీమా కలిగిన బ్యాంకు పొదుపు, ఫిక్స్‌డ్‌/రికరింగ్ డిపాజిట్లతో పాటు అన్ని రకాల బ్యాంకు డిపాజిట్లకు వర్తిస్తుంది. ఇందుకుగానూ బ్యాంకులు తమ డిపాజిట్లను డీఐసీజీసీ వద్ద బీమా చేయించి ఉండాలి. ప్రస్తుతం డిపాజిట్ బీమా పథకం కింద, బ్యాంకులోని ప్రతి డిపాజిటర్ వద్ద ఉన్న అసలు, వడ్డీ మొత్తానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా హామీ ఉంటుంది.

పొదుపు ఖాతాపై 7 శాతం వ‌డ్డీ ఇస్తున్న బ్యాంకులివే..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్ 2022 మే 19 నుంచి రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ.. రూ.1 కోటి లోపు స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న ఖాతాల‌కు గరిష్ఠంగా 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలలోపు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న వారికి 6శాతం, రూ.1లక్షలోపు ఖాతా బ్యాలెన్స్‌పై 3.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: రూ.1 లక్ష నుంచి రూ.50 లక్షలలోపు స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న‌ పొదుపు ఖాతాలపై ఈ బ్యాంకు 7 శాతం, రూ.1 ల‌క్ష‌లోపు 4.50 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు 6.50 శాతం వడ్డీని అందిస్తోంది.

ఈక్వీటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంకు రూ.5 లక్షల కంటే ఎక్కువగానూ.. రూ. 2 కోట్ల కంటే తక్కువ గానూ బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న పొదుపు ఖాతాల‌పై 7 శాతం వడ్డీని అందిస్తోంది. రూ.1 లక్షలోపు 3.50 శాతం, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలలోపు ఖాతా బ్యాలెన్స్‌పై 6 శాతం వడ్డీని అందిస్తోంది.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంకు రూ.25 లక్షల పైనా.. రూ. 1 కోటిలోపు స‌గ‌టు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న బ్యాంకు పొదుపు ఖాతాల‌పై 7 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.1లక్షలోపు 3.50 శాతం; రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షలలోపు 5 శాతం; రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న ఖాతాల‌పై 6 శాతం వడ్డీని బ్యాంక్‌ అందిస్తోంది.
ఫిన్‌కేర్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్ రూ.5 లక్షల పైనా.. రూ. 1 కోటి లోపు స‌గ‌టు బ్యాలెన్స్‌ నిర్వ‌హిస్తున్న పొదుపు ఖాతాల‌పై 7 శాతం వడ్డీ అందిస్తోంది. రూ.1 లక్ష వరకు 4.50 శాతం; రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల లోపు బ్యాలెన్స్‌పై 6 శాతం వడ్డీ ఇస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ బ్యాంక్ రూ.25 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ నిర్వహిస్తున్న ఖాతాలకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.1 లక్ష లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు 3.75 శాతం; రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షలకు 6.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. 

గుర్తుంచుకోండి: బ్యాంకులు రోజు చివ‌రికి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను అనుస‌రించి వ‌డ్డీ లెక్కించిన‌ప్ప‌టికీ.. నెలవారీ, త్రైమాసికం, అర్ధ వార్షికానికోసారి త‌మ బ్యాంకు నియ‌మాల‌కు అనుగుణంగా పొదుపు ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీని చెల్లిస్తాయి. సూచించిన స్లాబుల ఆధారంగా వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకు రూ.1 ల‌క్షలోపు బ్యాలెన్స్‌పై 3.5 శాతం, ఆ పైన 6 శాతం వ‌డ్డీ ఇస్తుంద‌నుకుందాం. మీరు ఖాతాలో జూన్ 1న రూ.1.20 ల‌క్ష‌ల డిపాజిట్ చేశారనుకుందాం. జూన్ 25న రూ. 20 వేలు విత్‌డ్రా చేసుకున్నట్లయితే, రూ.1.20 లక్షల మీద 25 రోజులకు వడ్డీ లభిస్తుంది. ఆ మిగిలిన 5 రోజులకు రూ.1 లక్ష మొత్తానికి మాత్రమే వడ్డీ ఇస్తారు. బ్యాంకు పొదుపు ఖాతా చాలా లావాదేవీల‌కు కీల‌కంగా ఉంటుంది. అందువ‌ల్ల పొదుపు ఖాతాను ఎంచుకునేట‌ప్పుడు వ‌డ్డీ ఒక్క‌టే కాకుండా ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రిస్క్ తీసుకోలేని వారు డీఐసీజీసి ఇచ్చే రూ.5 ల‌క్ష‌ల బీమా హామీని (ఇది పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇత‌ర డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తుంది) మించి బ్యాలన్స్ నిర్వహించకపోవడమే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని