Loan written off: 5 ఏళ్లలో ₹10 లక్షల కోట్ల రుణాల రైటాఫ్‌!

గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.10 లక్షల కోట్ల మేర మొండి బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది.

Updated : 13 Dec 2022 16:31 IST

దిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్ల (రూ.10,09,511కోట్లు) విలువైన మొండి బాకీలను (NPA) బ్యాంకులు రైటాఫ్‌ (written off) చేశాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) ఈ మేరకు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు దాటిన మొండి బకాయిలను బ్యాంకులు (Banks) రైటాఫ్‌ పేరిట తమ బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తాయని పేర్కొన్నారు. రైటాఫ్‌ అంటే సాంకేతికంగా రద్దు చేసినట్లే గానీ.. రుణాలు పూర్తిగా మాఫీ చేసినట్లు కాదని చెప్పారు.

‘‘తమ బ్యాలెన్స్‌ షీట్లను క్లీన్‌ చేసేందుకు బ్యాంకులు మొండి బకాయిల రైటాఫ్‌ ప్రక్రియను నిరంతరం చేపడుతుంటాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి సంబంధిత బ్యాంకు బోర్డు ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటాయి. వాణిజ్య బ్యాంకుల నుంచి ఉన్న సమాచారం ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.10,09,511 కోట్ల రుణాలు రైటాఫ్‌ అయ్యాయి’’ అని కేంద్రమంత్రి తెలిపారు.

రుణాలు రైటాఫ్‌ చేసినప్పటికీ వాటిని తీసుకున్నవారు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రైటాఫ్‌ వల్ల రుణ గ్రహీతకు ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని తెలిపారు. అలాగే బ్యాంకులు సైతం సివిల్‌ కోర్టుల్లో దావాలు వేయడం, రుణ రికవరీ ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం, దివాలా స్మృతి కింద కేసులు నమోదు చేయడం, నిరర్థక ఆస్తుల విక్రయం వంటి ప్రక్రియల ద్వారా రుణాలను రికవరీ చేస్తున్నాయని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో రైటాఫ్‌ చేసిన రుణాల్లో రూ.1.32 లక్షల కోట్లు సహా మొత్తం రూ.6.59 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రికవరీ చేశాయని మంత్రి వివరించారు.

బ్యాంకుల మొండి బాకీల విషయంలో ఆయా బ్యాంకు అధికారులే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఎన్‌పీఏలకు సంబంధించి మొత్తం 3,312 మంది ప్రభుత్వ బ్యాంకు అధికారులను జవాబుదారీ చేస్తూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రమే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని, అదీ పరిమితంగానే అంటూ మరో ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ జవాబిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని