IPO: జులై 3న రెండు ఐపీఓలు.. రూ.2,700 కోట్ల సమీకరణ

IPO: జులై 3-5 మధ్య రెండు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఆయా కంపెనీల ఐపీఓ షేరు ధరల శ్రేణి సహా ఇతర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Published : 28 Jun 2024 15:38 IST

దిల్లీ: ఎంక్యూర్‌ ఫార్మా ఐపీఓ (Emcure Pharma IPO) జులై 3-5 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.960- 1,008గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.1,952 కోట్లు సమీకరించనుంది. కొత్తగా రూ.860 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.1,152 కోట్లు విలువ చేసే షేర్లు విక్రయించనుంది. మదుపర్లు కనీసం రూ.14,112తో 14 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, జెఫరీస్‌ ఇండియా, యాక్సిస్‌ క్యాపిటల్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఐపీఓలో (IPO) ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కొన్ని షేర్లను రిజర్వ్‌ చేశారు. అర్హత గల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్‌ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని ఎంక్యూర్‌ ఫార్మా తెలిపింది. పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వివిధరకాల ఔషధాల అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు చేపడుతోంది.

బన్సల్‌ వైర్‌ ఐపీఓ..

స్టీల్‌ వైర్ల తయారీ సంస్థ బన్సల్‌ వైర్‌ ఇండస్ట్రీస్‌ (Bansal Wire Industries IPO) సైతం జులై 3-5 మధ్య ఐపీఓకి రాబోతోంది. రూ.745 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. షేరు ధరల శ్రేణిని రూ.243-256గా నిర్ణయించింది. ఈ ఐపీఓ పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే జరుగుతోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లు అందుబాటులో లేవు. మదుపర్లు కనీసం రూ.14,848తో 58 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, డీఏఎం క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్‌ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.

ఈ ఐపీఓలో (IPO) సమీకరించిన నిధులతో కంపెనీ కొత్తరకం వైర్ల తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉంది. అందుకనుగుణంగా దాద్రీలోని తయారీకేంద్రంలో మార్పులు చేయనుంది. అర్హతగల సంస్థాగత మదుపర్లకు (QIBs) 50 శాతం, రిటైల్‌ మదుపర్లకు 35 శాతం, సంస్థాగతేతర మదుపర్లకు (NIIs) 15 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ హై కార్బన్‌ స్టీల్‌ వైర్‌, మైల్డ్ స్టీల్‌ వైర్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వైర్‌.. ఇలా మూడు విభాగాల్లో వైర్లను తయారుచేసి ఎగుమతి చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు