Sanjay Kumar Jha: యుద్ధ విమానాల ఇంజిన్లకు మిధాని లోహాలు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్‌), సమీప భవిష్యత్తులో అత్యంత కీలక రక్షణ ప్రాజెక్టుల్లో భాగం పంచుకోనుంది. అంతర్జాతీయ సంస్థలైన జీఈ, ప్రాట్‌ అండ్‌ విట్నీ తదితర సంస్థలకు సూపర్‌ అల్లాయ్స్, టైటానియమ్‌ ఉత్పత్తులు అందించడానికీ సంస్థ సిద్ధమవుతోంది.

Published : 19 Jun 2024 02:46 IST

హెచ్‌ఏఎల్, ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్లకూ ‘మెటీరియల్స్‌’ సరఫరా
అంతర్జాతీయ రక్షణ, ఏరోస్పేస్‌ మార్కెట్లకు విస్తరిస్తున్నాం
సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝా వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రభుత్వ రంగ రక్షణ ఉత్పత్తుల సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్‌), సమీప భవిష్యత్తులో అత్యంత కీలక రక్షణ ప్రాజెక్టుల్లో భాగం పంచుకోనుంది. అంతర్జాతీయ సంస్థలైన జీఈ, ప్రాట్‌ అండ్‌ విట్నీ తదితర సంస్థలకు సూపర్‌ అల్లాయ్స్, టైటానియమ్‌ ఉత్పత్తులు అందించడానికీ సంస్థ సిద్ధమవుతోంది. దేశీయంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేసే యుద్ధ విమానాల ఇంజిన్లలో వినియోగించే లోహాలు సరఫరా చేయనుంది. ఇప్పటికే యుద్ధ విమానాల్లో ఇతర భాగాలకు అవసరమైన లోహాలను మిధానీ అందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో విస్తరిస్తున్నామని.. ముఖ్యంగా గల్ఫ్, ఐరోపా మార్కెట్లలోని రక్షణ, ఏరోస్పేస్‌ సంస్థలకు సూపర్‌ అల్లాయ్స్‌ సరఫరా చేయనున్నట్లు మిధాని సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝా ఇటీవల మదుపర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ కాల్‌లో వెల్లడించారు. 

‘జీఈ 414 ఇంజిన్‌’కూ

ఎంతో శక్తిమంతమైన ‘జీఈ 414 ఇంజిన్‌’ను మనదేశంలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఉత్పత్తి చేయనున్న ఎల్‌సీఏ తేజస్‌ ఎంకే2 రకం విమానాల్లో వినియోగించేందుకు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థ జీఈతో ప్రాథమిక ఒప్పందం కుదిరింది. ఈ ఇంజిన్లో వినియోగించే సూపర్‌ అల్లాయ్స్‌ను ఉత్పత్తి చేయడంపై మిధాని దృష్టి సారించింది. ‘జీఈ 414 ఇంజిన్‌’ మెటీరియల్‌ సరఫరా చేసే సంస్థల్లో మిధాని ఉండే అవకాశాలు ఉన్నాయని సంస్థ సీఎండీ వివరించారు. మనదేశంలో ఏరో ఇంజిన్ల ఉత్పత్తి అధికం కాబోతోందని, వాటికి అవసరమైన లోహాలు సరఫరా చేసే అవకాశం తమకు లభిస్తుందని అన్నారు. హెచ్‌ఏఎల్‌ ప్రాజెక్టులైన కావేరీ డ్రై ఇంజిన్, శక్తి ఇంజిన్లకు సబ్‌ మెటీరియల్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్‌ మల్టీరోల్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ప్రాజెక్టులో వినియోగించే 110 కిలో న్యూటాన్స్‌ ఇంజిన్‌ మెటీరియల్‌ సైతం సరఫరా చేస్తామని అన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు జీఈ ఆసక్తిగా ఉంది.

పెరుగుతున్న ఎగుమతులు 

గతంలో లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్‌కు మిధాని విస్తరిస్తోందని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కంపెనీలకు లోహాలు, లోహ పదార్థాలు సరఫరా చేస్తున్నామని, అమెరికాలోనూ అడుగు పెట్టబోతున్నామని తెలిపారు. దీంతో పాటు ఆరోగ్య సంరక్షణ, చమురు- సహజవాయువు రంగాలకు అవసరమైన లోహాలు అందిస్తున్నామని అన్నారు. ఇంతకాలం టైటానియమ్‌ ఉత్పత్తులు అధికంగా అందిస్తూ వచ్చినా, ఇప్పుడు సూపర్‌ అల్లాయ్స్‌పై దృష్టి కేంద్రీకరించినందున ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. మిధానికి ప్రస్తుతం రూ.1,767 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఎగుమతి ఆర్డర్లు 5 శాతానికి పైగానే ఉంటాయి. సమీప భవిష్యత్తులో మరో రూ.1,150 కోట్ల విలువైన ఆర్డర్లు లభించే అవకాశం ఉంది.  

20- 25% వృద్ధి లక్ష్యం 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20-25% వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజయ్‌ కుమార్‌ ఝా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ    రూ.1,102 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక నికరలాభం రూ.91.26 కోట్లు, ఈపీఎస్‌     రూ.4.87 నమోదయ్యాయి. తొలిసారిగా మిధాని   రూ.1,000 కోట్ల వార్షికాదాయాన్ని అధికమించింది. అంతర్జాతీయ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో సరఫరా వ్యవస్థ సమస్యలు ఎదురయ్యాయి. దీనికి తోడు ముడి పదార్థాల లభ్యత, ధర విషయాల్లో తలెత్తిన సవాళ్ల వల్లే లాభాలు తక్కువగా నమోదయ్యాయి. సమీప భవిష్యత్తులో మంచి ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని