సామాన్యుల డీమ్యాట్- బీఎస్‌డీఏ

త‌క్కువ‌ చార్జీలతో మార్కెట్ లో పెట్టుబ‌డి చేసేందుకు చిన్నమ‌దుప‌ర్ల‌కు సెబీ ప్ర‌వేశ పెట్టిన సాధ‌నం (బీఎస్‌డీఏ) బేసిక్ స‌ర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ (క‌నీససేవ‌లు క‌లిగిన డీమ్యాట్ ఖాతా) గురించి తెలుసుకుందాం......

Published : 16 Dec 2020 15:32 IST

త‌క్కువ‌ చార్జీలతో మార్కెట్ లో పెట్టుబ‌డి చేసేందుకు చిన్నమ‌దుప‌ర్ల‌కు సెబీ ప్ర‌వేశ పెట్టిన సాధ‌నం (బీఎస్‌డీఏ) బేసిక్ స‌ర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ (క‌నీససేవ‌లు క‌లిగిన డీమ్యాట్ ఖాతా) గురించి తెలుసుకుందాం. 

చాలా మంది మ‌దుప‌ర్లు స్టాక్ మార్కెట్ లో నిత్యం షేర్ల క్ర‌య‌విక్ర‌యాలు చేయ‌క‌పోవ‌చ్చు. త‌మ‌కు అనువైన పెట్టుబ‌డి చేసి దీర్ఘ‌కాలం కొన‌సాగే వారు, త‌క్కువ మొత్తంలో ట్రేడింగ్ చేసే వారు కూడా ఉంటారు. సంప్ర‌దాయ డీమ్యాట్ ఖాతాలో విధించే చార్జీలు అధికంగా ఉంటాయి. అలాంటి మ‌దుప‌ర్ల‌కు బేసిక్ స‌ర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ) అనువైన‌ది. ఇది మామూలు డీమ్యాట్ ఖాతా కంటే భిన్నం ఎందుకంటే ఇందులో ట్రేడింగు చేసినందుకు లావాదేవీల రుసుములు, స్టేట్ మెంట్, డిపాజిట‌రీలు విధించే రుసుములు ప‌రిమితంగా ఉంటాయి.

రుసుములు :

  • మ‌దుప‌ర్ల పెట్టుబ‌డి విలువ రూ. 50 వేల కంటే త‌క్కువ ఉంటే ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌రు.
  • పెట్టుబ‌డి విలువ రూ.50 వేల నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటే వాటిపై రూ. 100 మించకుండా చార్జీలు ఉంటాయి.

ఎవ‌రు అర్హులు:

  • సాధార‌ణ డీమ్యాట్ ఖాతాలు ఒక్క‌టి మాత్ర‌మే క‌లిగి ఉన్న మ‌దుప‌ర్లు, అస‌లు డీమ్యాట్ ఖాతా లేని మ‌దుప‌ర్లు ఈ బీఎస్‌డీఏ ను తీసుకోవ‌చ్చు…

  • ఒక‌టి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలు క‌లిగిన వ్య‌క్తి దీన్ని తీసుకునే వీలు ఉండ‌దు. మ‌దుప‌రి ప‌లు ఖాతాలు
    ఉన్న‌ప్ప‌టికి అందులో మొద‌టి వ్య‌క్తిగా లేక‌పోతే బీఎస్‌డీఏ ను తీసుకోవ‌చ్చు.

  • ఒక్కో వ్య‌క్తి ఒక్క ఖాతా మాత్ర‌మే పొంద‌గ‌ల‌డు.

  • గ‌రిష్టంగా పెట్టుబ‌డి విలువ రూ.2 ల‌క్ష‌ల‌కు మించి ఉండ‌కూడ‌దు.

  • ఈ ఖాతా ద్వారా ల‌భించే సేవ‌లు దాదాపుగా సంప్ర‌దాయ ఖాతాలానే ఉంటాయి.

స్టేట్ మెంట్లు :

  • సాధార‌ణంగా డీమ్యాట్ ఖాతాల‌కు సంబంధించిన లావాదేవీల స్టేట్‌మెంట్లు త్రైమాసికానికి ఒక‌సారి పంపిస్తుంటారు.

  • డీమ్యాట్ ఖాతాలో న‌గ‌దు లేకున్నా లేదా ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌ని ఖాతాల‌కు వార్షికంగా ఒక స్టేట్ మెంట్ ను పంపిస్తే స‌రిపోతుంది.

  • క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్న ఖాతాల‌కు కూడా వార్షిక నివేదిక‌ను పంపిస్తే స‌రిపోతుంది.

స్టేట్ మెంట్ ల‌కు చార్జీలు:

  • సాధార‌ణంగా డిపాజిట‌రీలు లావాదేవీలకు సంబంధించిన స్టేట్ మెంట్ భౌతిక లేదా ఎల‌క్ట్రానిక్ రూపంలో పంపుతుంటారు.

  • మ‌దుప‌రి ఎంచుకునే ప‌ద్ధ‌తిని బ‌ట్టి ఇది ఉంటుంది. డిపాజిట‌రీలు ఒక్కో ఖాతాకు క‌నీసం రెండు భౌతిక రూపంలో ఉండే స్టేట్‌మెంట్ల‌ను పంపాలి.

  • అంత‌కంటే ఎక్కువైతే స్టేట్ మెంటుకు రూ.25 చొప్పున వ‌సూలు చేస్తారు ఎల‌క్ట్రానిక్ రూపంలో పంపే వాటికి రుసుం ఉండ‌దు.

ఈ ఖాతా చిన్న మ‌దుప‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. చార్జీలు ప‌రిమితంగా ఉంటాయి.డీమ్యాట్ కు సంబందించిన అన్ని సౌక‌ర్యాలు పొంద‌వ‌చ్చు. అందుకే ఈ బేసిక్ స‌ర్వీసెస్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ) ఖాతాను సామాన్యుల డీమ్యాట్ అని అనొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని