రూ. 500 పెట్టుబడితో ధనవంతులుగా మారండిలా..

మీరు నెలకు రూ. 500 పెట్టుబడిగా పెట్టినట్లయితే, సుమారు 10 శాతం రాబడులతో 20 సంవత్సరాల తరువాత రూ. 3. 8 లక్షలు పొందవచ్చు​​​​​​.....

Updated : 01 Jan 2021 19:55 IST

మనలో చాలా మందికి నెలకు రూ. 500 ఖర్చు చేయడం చాలా సులభమైన విషయం. అందువలన నెలకు రూ. 500 ఆదా చేసి, దానిని పెట్టుబడిగా పెట్టడం పెద్ద కష్టమైన పని కాదు. ఏది ఏమైనప్పటికీ, నెలకు రూ. 500 పెట్టుబడి చేస్తే, అది సంవత్సరానికి రూ. 6000, అలాగే 20 సంవత్సరాలకు రూ. 1.2 లక్షలు అవుతుందని చాలా మంది గ్రహించరు. అలాంటి చిన్న మొత్తాన్ని మీరు నిరంతరం పెట్టుబడిగా పెట్టగలిగితే, దీర్ఘ కాలంలో మీరు చాలా పెద్ద మొత్తాన్ని పొందగలరు. సాధారణంగా పెట్టుబడిదారులకు భిన్నమైన రిస్క్ ప్రొఫైల్స్, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్స్, ఇన్వెస్ట్మెంట్ ఛాయస్లు ఉన్నాయి. కావున, నెలకు కేవలం రూ. 500 మాత్రమే పెట్టుబడిగా పెట్టే ఐదు రకాల ఆసక్తికరమైన పెట్టుబడి మార్గాల గురించి కింద తెలుసుకుందాం.

  1. మ్యూచువల్ ఫండ్లు

మ్యూచువ‌ల్ ఫండ్లు ప్ర‌స్తుతం ఎక్కువ మంది ఆస‌క్తి చూపే పెట్టుబ‌డి సాధ‌నాలు. దీర్ఘ‌కాలంలో సంప‌ద సృష్టికి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లంప్‌స‌మ్ లేదా సిప్ విధానంలో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలానికి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, డైవ‌ర్సిఫైడ్ , స్మాల్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. ఫండ్ నిర్వాహ‌కులు పెట్టుబ‌డుల‌ను మంచి లాభాలు ఆర్జించేలా కృషిచేస్తారు. కొన్ని మ్యూచువ‌ల్ ఫండ్లలో నెలకు కనిష్టంగా రూ. 100 పెట్టుబడిగా పెట్టవచ్చు. అలాగే మరికొన్ని మ్యూచువ‌ల్ ఫండ్లలో నెలకు కనిష్టంగా రూ. 500 పెట్టుబడిగా పెట్టవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ. 500 పెట్టుబడిగా పెట్టినట్లయితే, సుమారు 10 శాతం రాబడులతో 20 సంవత్సరాల తరువాత రూ. 3. 8 లక్షలు పొందవచ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకునేందుకు ఆ రంగంలో నిపుణుల‌ను సంప్రదించి నిర్ణ‌యం తీసుకోవాలి.

  1. అటల్ పెన్షన్ యోజన

ఇది అసంఘటిత రంగంలో ఉన్న వారి ఆర్ధిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో ప్రవేశ పెట్టిన పధకం. దీని నుంచి నెల నెలా రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పింఛను పొందే అవకాశం ఉంది. సామాజిక భద్రత పథకాల్లో లేని వారు, ఆదాయ పన్ను పరిధి లో రాని వారి కోసం ప్రభుత్వం వారి ఖాతా లో మదుపు చేసిన మొత్తానికి మరో 50 శాతం లేదా సంవత్సరానికి రూ. 1000 (ఏది తక్కువైతే అది) జత చేస్తారు. 18 నుంచి 40 సంవత్సరాలలోపు వయసు గల వారికి ఇందులో చేరే అర్హత ఉంటుంది, 60 ఏళ్ళ వయసు వచ్చే సరికి ఇందులో నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈ పథకంలో నెలకు రూ. 500 పెట్టుబడి పెట్టినట్లయితే, అతనికి 60 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత నుంచి కచ్చితంగా నెలకు రూ. 5000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ చందాదారుడు మరణించినట్లైతే, అతని భార్యకు ఈ మొత్తం లభిస్తుంది.

  1. ప్రజా భవిష్య నిధి

పీపీఎఫ్ ఖాతాను ఎవ‌రైనా ప్రారంభించ‌వ‌చ్చు. మైన‌ర్ కూడా ఖాతాను ప్రారంభించే అవ‌కాశ‌ముంది. పీపీఎఫ్ ఖాతా గ‌డువు 15 సంవ‌త్స‌రాలు. అయితే త‌ర్వాత కూడా దీనిని కొన‌సాగించే అవ‌కాశం ఉంది. 5 సంవ‌త్స‌రాల చొప్పున గ‌డువు పొడ‌గించుకోవ‌చ్చు. పీపీఎఫ్‌ చందాదారుల‌కు ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. చెల్లించేట‌పుడు,వ‌డ్డీ ఆదాయంపై, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ఇలా మూడు సంద‌ర్భాల్లో ప‌న్ను మిన‌హాయింపులు పొందే వీలుంది. పీపీఎఫ్ ఖాతాదారుడు సంవ‌త్స‌రానికి రూ.500 నుంచి గ‌రిష్ఠంగా రూ.1,50,000 వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టొచ్చు. గ‌రిష్ఠంగా సంవత్స‌రానికి 12 సార్లు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఈ పథకంలో నెలకు రూ. 500 పెట్టుబడిగా పెట్టినట్లయితే, అది సంవత్సరానికి రూ. 6000, అలాగే 15 సంవత్సరాల తరువాత రూ. 1.7 లక్షలను పొందవచ్చు.

  1. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు

ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సాంప్రదాయ పెట్టుబడి మార్గాలు. చాలా ప్రముఖ బ్యాంకులు రూ. 100 కనీస డిపాజిట్ తో, అలాగే రూ. 500 కనీస డిపాజిట్ ఆఫర్లతో రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లు 6.5 శాతం నుంచి 7.25 శాతం మధ్య మారుతూ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్లు మీరు ఎంచుకున్న కాలపరిమితితో ప్రతి నెలా పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులే కాకుండా, అనేక ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా నెలకు రూ.500 కనీసం డిపాజిట్ ను అనుమతిస్తున్నాయి. డిపాజిట్ల ఆధారంగా రుణాలను పొందడం కోసం రికరింగ్ డిపాజిట్లను ఉపయోగించవచ్చు. రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లకు సమానంగా ఉంటాయి.

  1. పోస్ట్ ఆఫీస్ పథకాలు

తక్కువ మొత్తంలో పెట్టుబడులను చాలా రకాల పోస్ట్ ఆఫీస్ పథకాలు అనుమతిస్తాయి. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతా (సంవత్సరానికి 4 శాతం వడ్డీ)ను రూ. 20 లతో తెరవవచ్చు. అలాగే చెక్కు లేని ఖాతాలకు రూ. 50 కనీస బ్యాలన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఐదు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతాను నెలకు రూ. 10 లతో తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ ఖాతాను కనీసం రూ. 200 లతో తెరవవచ్చు. అలాగే జాతీయ పొదుపు పథకం ఖాతాను కనీసం రూ. 100 లతో తెరవవచ్చు. జాతీయ పొదుపు పథకం విషయంలో రూ. 100 ల డిపాజిట్ ఐదు సంవత్సరాల తరువాత రూ. 144.23 కు పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని