FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ వివరాలు తెలుసుకోండి!

త‌క్కువ కాల‌వ్య‌వ‌ధితో కూడిన ఎఫ్‌డీల‌తో పోలిస్తే, ఎక్కువ కాల‌వ్య‌వ‌ధితో కూడిన ఎఫ్‌డీల‌కు ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుంది.

Updated : 08 Jan 2022 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed deposits) ఒకటి. పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై స్థిర‌మైన రాబ‌డి, అలాగే న‌ష్టభయం కూడా త‌క్కువ ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. అందువ‌ల్లే రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని వారు రాబ‌డి త‌క్కువ‌గా ఉన్నా ఇందులో మ‌దుపు చేసేందుకు ఆసక్తి చూపుతారు. స్వల్పకాలిక (1-3 ఏళ్లు), మ‌ధ్య కాలిక (3-5 ఏళ్లు), దీర్ఘకాలిక (5-10 ఏళ్లు) ల‌క్ష్యాల కోసం ఎఫ్‌డీల్లో డబ్బు మదుపు చేసే వీలుంది. మీ ల‌క్ష్యాన్ని అనుస‌రించి డిపాజిట్లను ఎంచుకోవ‌చ్చు. అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే..?

ఎఫ్‌డీ కాల‌ వ్యవధి: ఎఫ్‌డీ వ‌డ్డీ రేటు కాల‌ వ్యవధితో ముడిపడి ఉంటుంది. సాధార‌ణంగా త‌క్కువ కాల‌వ్యవధితో కూడిన ఎఫ్‌డీల‌తో పోలిస్తే, ఎక్కువ కాల‌వ్యవధితో కూడిన ఎఫ్‌డీల‌కు ఎక్కువ వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంటాయి బ్యాంకులు. అంటే ఒక సంవత్సరం ఎఫ్‌డీతో పోలిస్తే, ఐదేళ్ల ఎఫ్‌డీకి ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే.. రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై సాధార‌ణ ప్రజలు చేసే 1 నుంచి 2 సంవత్సరాల్లోపు డిపాజిట్లకు 5 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంటే.. 3 నుంచి 5 ఏళ్ల ఎఫ్‌డీపై 5.30 శాతం, 5 నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 5.40 శాతం వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తోంది. అంటే కాల‌ప‌రిమితి పెరిగేకొద్దీ ఎక్కువ వ‌డ్డీ రేటుతో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తోంది.

కొన్నిసార్లు బ్యాంకులు 5-10 ఏళ్ల కాల‌ప‌రిమితితో కూడిన ఎఫ్‌డీల కంటే.. 5 ఏళ్ల కాల‌ప‌రిమితి గ‌ల ఎఫ్‌డీల‌పై ఎక్కువ వ‌డ్డీ ఆఫ‌ర్ చేస్తుంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3 ఏళ్లపైన 5 ఏళ్లలోపు ఎఫ్‌డీల‌పై 6 శాతం వ‌డ్డీ ఇస్తుంటే, 5 ఏళ్ల పైన‌, 10 సంవ‌త్సరాల్లోపు డిపాజిట్లపై 5.75 శాతం మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. ఈ తేడాల‌ను గ‌మ‌నించి ఎఫ్‌డీలో మ‌దుపు చేస్తే ఎక్కువ రాబ‌డి పొందొచ్చు.

వ‌డ్డీరేటు: ప్రస్తుతం బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవ‌త్సరాలకు వివిధ కాల‌వ్యవధితో 2.25 శాతం నుంచి 6.50 శాతం వ‌డ్డీతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తున్నాయి. య‌స్ బ్యాంక్ 5 నుంచి 10 సంవ‌త్సరాల డిపాజిట్లపై అత్యధికంగా 6.50 శాతం వ‌డ్డీని అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు మ‌రో 0.50 శాతం అధిక వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు. అయితే, వ‌డ్డీ రేట్లు రెండు ర‌కాలుగా ఉంటాయి. క్యుములేటివ్‌, నాన్-క్యుములేటివ్. క్యుములేటివ్ మోడ్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం మెచ్యూరిటీ వరకు లాక్ చేసి ఉంచుతారు. సేక‌రించిన వ‌డ్డీ మొత్తం, అస‌లుతో క‌లిపి మెచ్యూరిటీ స‌మ‌యంలో చెల్లిస్తారు. నాన్-క్యుములేటివ్ మోడ్‌లో ప్రతి నెలా, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షికంగా స్థిర వడ్డీ మొత్తాన్ని సంపాదించొచ్చు. మీ అవ‌స‌రాల‌కు త‌గిన మార్గాన్ని ఎంచుకోవ‌చ్చు. అయితే, మీకు అవసరం పడితే ఎప్పుడైనా డిపాజిట్ బ్రేక్ చేసి మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.

రేటింగ్‌: క్రిసిల్‌, కేర్ వంటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. వివిధ అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ఆర్థిక సంస్థలు విశ్వసనీయతను అంచనా వేసి నివేదిక‌లు ప్రచురిస్తాయి. వాటి ద్వారా వివిధ పెట్టుబ‌డి సాధ‌నాల‌ రేటింగ్ తెలుసుకోవ‌చ్చు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. క్రిసిల్ FAA+, కేర్ AA రేటింగ్ పొందిన ఏదైనా ఆర్థిక సంస్థ ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి, మీ న‌ష్ట భయం తగ్గించుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి ముందే సదరు ఆర్థిక సంస్థ క్రెడిట్ రేటింగ్‌ను తనిఖీ చేయడం మంచిది.

రుణ స‌దుపాయం: డ‌బ్బు అత్యవసరం అయినప్పుడు సాధార‌ణంగా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తారు. అయితే ఎఫ్‌డీ ఖాతా ఉన్నవారు ఆటోమేటిక్‌గా రుణ అర్హతను పొందుతారు. తాము డిపాజిట్ చేసిన ఎఫ్‌డీ నుంచి 75 శాతం వ‌ర‌కు రుణం పొందొచ్చు. అయితే బ్యాంకులు మీకు చెల్లించే వ‌డ్డీ కంటే 2 శాతం అద‌న‌పు వ‌డ్డీని రుణం కోసం మీ నుంచి వ‌సూలు చేస్తాయి. ఈ సంద‌ర్భంలో రుణ కాల‌వ్యవధి మీ ఎఫ్‌డీ కాలవ్యవధితో సమానంగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు 10 సంవ‌త్సరాలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉండి 4 సంవ‌త్సరాల త‌ర్వాత ఎఫ్‌డీపై రుణం తీసుకుంటే ఈ మొత్తం చెల్లించేందుకు మీకు 6 సంవ‌త్సరాల సమయం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని