Stock Market: మార్కెట్లపై ‘ఫెడ్‌’ పంచ్‌.. రూ.5లక్షల కోట్లు ఉఫ్‌..!

అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్ల కొంపముచ్చింది. మాంద్యం భయాలు సూచీలను కుప్పకూల్చాయి. దేశీయ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటలో భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ రోజు

Updated : 16 Jun 2022 15:54 IST

భారీ నష్టాలను చవిచూసిన సూచీలు

ముంబయి: అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్ల కొంపముచ్చింది. మాంద్యం భయాలు సూచీలను కుప్పకూల్చాయి. దేశీయ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటలో భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ రోజు గరిష్ఠం నుంచి ఏకంగా 1700 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 52 వారాల కనిష్ఠానికి పడిపోయింది. ఫలితంగా నేడు దాదాపు రూ.5లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

మార్కెట్‌ సాగిందిలా..

క్రితం సెషన్‌లో 52,541 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. ఈ ఉదయం 500 పాయింట్లకు పైగా లాభంతో 53,018.91 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. 53,142.50 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. కానీ, మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో 51,425.48 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 1716 పాయింట్లు పతనమైంది. చివరకు 1,045.60 పాయింట్లు (1.99శాతం) దిగజారి 51,495.79 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 331.55 పాయింట్లు (2.11శాతం) నష్టంతో 15,360.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,335.10 - 15,863.15 మధ్య కదలాడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. అత్యధికంగా లోహ రంగ సూచీ 5శాతానికి పైగా కుంగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు కోలుకుని రూ.78.10 వద్ద స్థిరపడింది.

సూచీల పతనానికి కారణాలివే..

* కీలక వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ఫెడ్‌ ప్రకటించింది. అయితే అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ ఆశావహంగానే ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆ ప్రభావంతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా మార్కెట్‌ నష్టాల్లో ఉండటంతో.. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. కానీ, మధ్యాహ్నానికి ఫెడ్‌ ప్రకటనను పూర్తిగా అర్థం చేసుకున్న మదుపర్లు.. మళ్లీ అమ్మకాలు జరిపారు. ముఖ్యంగా 2022 కు అమెరికా జీడీపీ వృద్ధి అంచనాలను ఫెడ్‌ తగ్గించడం మార్కెట్‌పై పెను ప్రభావమే చూపించింది.

* గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు పెద్ద మొత్తంలో ఉపసంహరణలు చేసుకుంటున్నారు. జూన్‌లో ఇప్పటివరకు రూ.24,949 కోట్ల విదేశీ పెట్టబడులు వెళ్లిపోగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1.92లక్షల కోట్ల ఈక్విటీలను విదేశీ మదుపర్లు విక్రయించారు. ఇది మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది.

* ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుతో అమెరికాలో మళ్లీ మాంద్యం భయాలు మొదలయ్యాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు చేపడితే వచ్చే ఏడాది నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని గతవారం కొన్ని సర్వేలు వెల్లడించాయి.

* వీటికి తోడు, దేశీయంగా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటం.. వారాంతపు డెరివేటివ్‌ల గడువు నేటితో ముగియడం వంటి కారణాలతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని