ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గాల్లోని లాభ నష్టాలు..

మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి పొందే మొత్తం, ప్రణాళికాబద్ధమైన ఖర్చులను సమకూర్చుకోవడానికి సహాయపడుతుంది....

Published : 19 Dec 2020 17:04 IST

మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి పొందే మొత్తం, ప్రణాళికాబద్ధమైన ఖర్చులను సమకూర్చుకోవడానికి సహాయపడుతుంది​​​​​​​.

కచ్చితమైన రాబడులను పొందడానికి ఎలాంటి పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టాలో మీకు అర్ధం కావడం లేదా? అయితే పెట్టుబడి ఆప్షన్ లను అంచనా వేయడంలో మీకు సహాయపడేందుకు ప్రజాదరణ పొందిన కొన్ని రకాల పెట్టుబడి ఆప్షన్ లను మీ కోసం కింద తెలియచేశాము. వాటిని పరిశీలించి మీకు అనువైన ఆప్షన్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఫిక్స్డ్ డిపాజిట్:

భారతదేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడులను అందించే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి. మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి పొందే మొత్తం, ప్రణాళికాబద్ధమైన ఖర్చులను సమకూర్చుకోవడానికి సహాయపడుతుంది. దీనిలో నగదు ఉపసంహరణ ప్రక్రియ చాలా సులువుగా ఉండడంతో పాటు, కాలపరిమితి ఎంపిక, పన్ను ఆదా ఆప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలను ఇది అందిస్తుంది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల ఆధారంగా రుణం కూడా తీసుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు ఇతర రుణాల కంటే కొంచం తక్కువగా ఉంటుంది.

అయితే, ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి కేవలం డబ్బును దాచుకోడానికి మంచి ఆప్షన్ గా పనిచేస్తాయే తప్ప, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి పనికిరావు. ఫిక్స్డ్ డిపాజిట్లపై సంపాదించే వడ్డీపై పన్ను విధిస్తారు, అలాగే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇది సరిపోదు. వడ్డీ రేట్లలోని హెచ్చుతగ్గులు మీ దీర్ఘకాలిక నిధులపై ప్రభావం చూపవచ్చు.

బంగారం:

భారతీయులకు బంగారంతో ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక సందర్భాలలో బంగారాన్ని ఉత్తమ బహుమతి ఎంపికగా భారతీయులు ఎంచుకుంటారు. బంగారం సరఫరా తగ్గి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, బంగారం విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో బంగారాన్ని విక్రయించడం లేదా దానిపై రుణం తీసుకోవడం ద్వారా ఊహించని ఆర్ధిక అవసరాల నుంచి బయటపడవచ్చునని అందరూ భావిస్తుందటారు.

కానీ వాస్తవానికి బంగారాన్ని విక్రయించే సమయంలో మీరు ఆశించినంత విలువ వచ్చే అవకాశం తక్కువగా ఉండవచ్చు. దానికి కారణం అమ్మకం సమయంలో బంగారం రేటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, ఇది అంత అనుకూలమైనదిగా ఉండకపోవచ్చు. బంగారాన్ని నిల్వ చేయడానికి కూడా కొంత ఖర్చు అవుతుంది. అలాగే ఇది కొనుగోలు, అమ్మకం పన్నులను (జీఎస్టీ, మూలధన లాభాలు) కూడా కలిగి ఉంటుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు మేకింగ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే బంగారాన్ని విక్రయించే సమయంలో మాత్రం మీరు సదరు చార్జీలను కోల్పోవడంతో పాటు అదనపు తరుగుదల ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అందువలన, బంగారం విక్రయ రేటు తక్కువగా ఉంటుంది.

రియల్ ఎస్టేట్:

లక్షలాది మంది భారతీయులు ఇంటిని నిర్మించుకోడానికి అవరమైన స్థలాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. స్థిరత్వం, భద్రతను అందించే రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలోని ఆస్తి విలువ ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఈ ఆస్తిని పొందడంలో ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీరు ఈ ఆస్తిని మీకు ఇష్టమైన వారికి వారసత్వంగా బదిలీ కూడా చేయవచ్చు.

కానీ ఇక్కడ నిజంగా జరిగే విషయం ఏమిటంటే, ఉదాహరణకు 1988 సంవత్సరంలో మీరు రూ. 20 లక్షల విలువ చేసే ఆస్తిని కొనుగోలు చేశారని అనుకుందాం. అది 2018 సంవత్సరంలో రూ. 5 కోట్లకు చేరుకుంది, అంటే దీని అర్ధం మీ పెట్టుబడి పై సగటు రాబడి 11.33 శాతం. ఒకవేళ మీరు ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి 10 శాతం వడ్డీతో రుణం తీసుకున్నారని అనుకుంటే, మీ పెట్టుబడిపై సగటు రాబడి మరింత తగ్గుతుంది. దానితో పాటు నిర్వహణ చార్జీలతో కలుపుకుంటే మీ సగటు రాబడి శాతం ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు అత్యవసరంగా నగదు అవసరమైనట్లయితే, వెంటనే ఆస్తిని విక్రయించడం కొంచం కష్టంతో కూడుకున్న విషయం. ప్రస్తుతం భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా క్షీణీస్తోంది. ఇది మరికొంతకాలం ఇలానే ఉండే అవకాశం ఉంది.

ఈక్విటీ:

సంపదను సృష్టించుకోడానికి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులను అందిస్తాయి. అత్యవసర సమయాల్లో సులభంగా, త్వరితగతిన నగదును పొందవచ్చు. మీరు పెట్టుబడులు పెట్టడానికి సిప్ మార్గాన్ని ఎంచుకున్నట్లైతే, క్రమం తప్పకుండా ప్రతి నెల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మీరు దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టినట్లయితే, అధిక రాబడులను పొందే అవకాశం ఉందని నివేదికలు తెలియచేస్తున్నాయి.

అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి. మీరు ఈక్విటీలలో సంపాదించే నగదు మీరు ఎంచుకున్న స్టాక్ లపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లపై అవగాహన లేని వారు ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం సవాలుతో కూడుకున్న విషయం. ఇది వారి పెట్టుబడులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. దేశీయ ఇండెక్స్, సెన్సెక్స్ 1979 సంవత్సరంలో ప్రారంభమైన నాటి నుంచి 360 కన్నా ఎక్కువ రెట్లు పెరిగింది, ఈ కాలవ్యవధిలో సీఏజీఆర్ సుమారు 16 శాతంగా ఉంది, ఇది ఇతర ఆస్తి తరగతుల కంటే చాలా ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని