Credit Score: మంచి క్రెడిట్ స్కోర్‌తో ఉప‌యోగాలేంటి?

Credit Score: క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక గుర్తింపు.

Updated : 16 Aug 2022 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఏటా కోటీ 80 ల‌క్ష‌ల పైగానే క్రెడిట్ కార్డులు జారీ అవుతున్నాయి. ఇందులో చాలా మంది కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారూ ఉన్నారు. క్రెడిట్ కార్డుల‌ పట్ల అవ‌గాహ‌న లేక‌పోతే ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు, అధిక ఛార్జీల‌ బారిన పడతారు. దీని వల్ల క్రెడిట్ విలువ కూడా త‌గ్గుతుంది. కాబట్టి క్రెడిట్‌ కార్డు వాడేటప్పుడు క్రమశిక్షణతో ఉండాలి. మంచి క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అంటే వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయించుకోవడంతో పాటు త‌ప్పుగా నమోదైన పేర్లు, చెల్ల‌ని ఫోన్ నంబర్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి.

మంచి క్రెడిట్ స్కోరుని క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ప్రయోజనాలివే
క్రెడిట్ స్కోర్ అనేది మీ ఆర్థిక గుర్తింపు. ఇది 300-850 మ‌ధ్య ఉండే 3 అంకెల సంఖ్య‌. ఇది మీ క్రెడిట్ చ‌రిత్ర‌ను సూచిస్తుంది. క్రెడిట్ స్కోర్ మీ గ‌త రుణాలు, చెల్లింపుల ఆధారంగా లెక్కిస్తారు. మీరు రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన ప్ర‌తిసారీ దీన్ని త‌నిఖీ చేస్తారు. వివిధ ర‌కాల రుణాల మంజూరు స‌మ‌యంలో బ్యాంకులు వ్య‌క్తికి సంబంధించిన ఆర్థిక బ‌లాన్ని, క్రెడిట్ వివ‌రాల‌ను చూడ‌డానికి క్రెడిట్ బ్యూరోల స‌హాయాన్ని తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు రుణాలు కావాల‌న్నా, రుణ ప‌రిమితి పెర‌గాల‌న్నా, కొత్త క్రెడిట్ కార్డులు అవ‌స‌ర‌మున్నా త‌క్ష‌ణ ఆమోదం లభిస్తుంది. పేల‌వ‌మైన క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు రుణాల‌ను పొందే అవ‌కాశాలు సన్నగిల్లుతాయి.

తక్కువ వ‌డ్డీ రేట్లు: రుణ వ‌డ్డీ రేట్లు నేరుగా మీ క్రెడిట్ స్కోర్‌తో ముడిప‌డి ఉంటాయి. కాబ‌ట్టి మీరు మంచి క్రెడిట్ స్కోర్‌ను క‌లిగి ఉన్న‌ట్ల‌యితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అర్హులైన అభ్య‌ర్థుల‌కు అందించే లాభ‌దాయ‌క‌మైన వ‌డ్డీ రేట్ల‌కు మీరు అర్హుల‌వుతారు. మీ మంచి క్రెడిట్ స్కోర్.. ఏదైనా రుణాన్ని అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే పొందేలా చేస్తుంది.

ఆర్థిక హ‌క్కులు క‌ల్పిస్తుంది: మ‌చ్చ‌లేని క్రెడిట్ చ‌రిత్ర మీకు గొప్ప‌గా చెప్పుకునే హ‌క్కులు, గ‌ర్వించ‌ద‌గ్గ అద‌న‌పు ఆర్థిక సౌక‌ర్యాల‌ను అందిస్తుంది. రుణాన్ని జారీ చేసే బ్యాంకులు మీకు ప్రాధాన్యమిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్‌, బ్యాంకుతో రుణ వ‌డ్డీ రేట్ల‌ను బేర‌మాడే శ‌క్తిని, సామ‌ర్థ్యాన్ని ఇస్తుంది. వీటితో పాటు కొత్త క్రెడిట్ కార్డు మంజూరు, కార్డు లిమిట్ పెరుగుదల, రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలు, అధిక కాల పరిమితితో రుణాల మంజూరు లాంటి ఎన్నో లాభాలను మంచి క్రెడిట్ స్కోరు ద్వారా పొందొచ్చు.

చివ‌రిగా: మీ క్రెడిట్ స్కోర్ పేల‌వంగా ఉన్న‌ట్ల‌యితే మీరు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. క్రెడిట్ రిపోర్ట్‌లో ఎలాంటి డిఫాల్డ్‌లూ క‌నిపించ‌కుండా ఉండ‌టానికి మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఇత‌ర యుటిలిటీ బిల్లుల‌ను స‌కాలంలో చెల్లించాలి. ఒకే స‌మ‌యంలో ఎక్కువ సంఖ్య‌లో రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌ద్దు. మీ క్రెడిట్ చ‌రిత్ర‌లో త‌ప్పులు ఏమిటో తెలుసుకోవ‌డానికి నెల‌వారీగా మీ క్రెడిట్ స్కోర్‌ని త‌నిఖీ చేస్తూ ఉండండి. క్రెడిట్ స్కోర్ మెరుగుకు ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అత్య‌వ‌స‌రం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని