Cibil Score: అధిక సిబిల్‌ స్కోరుతో ప్రయోజనాలివే..

భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం మంచి క్రెడిట్‌ స్కోరును నిర్వహించడం మంచిది.

Published : 05 Dec 2022 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ బ్యూరో సంస్థలు అందించే క్రెడిట్‌ స్కోరు (Credit Score) ఆధారంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. వ్యక్తుల రుణ ప్రవర్తనను తెలుసుకుంటాయి. సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫాక్స్‌, క్రిఫ్‌ హై మార్క్‌ వంటి సంస్థలు వ్యక్తుల గత రుణ చరిత్రను అనుసరించి 300-900 మధ్య క్రెడిట్‌ స్కోరును అందిస్తాయి. ఈ స్కోరును అనుసరించే బ్యాంకులు ముఖ్యంగా వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు వంటి అసురక్షిత రుణాలు, గృహ రుణం, కారు రుణం వంటి దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. కాబట్టి భవిష్యత్‌ ఆర్థిక అవసరాల కోసం మంచి క్రెడిట్‌ స్కోరును నిర్వహించడం మంచిది. అధిక క్రెడిట్‌ స్కోరు వల్ల ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. .

రుణ ఆమోదం..

అధిక క్రెడిట్‌ స్కోరు బాధ్యతాయుమైన ప్రవర్తనను తెలియజేస్తుంది. రుణ ఎగవేతలు లేకపోవడం, సమయానుసారంగా చెల్లింపులు వంటి వాటిని తెలియజేస్తుంది. ఇటువంటి రుణ గ్రహీతలతో బ్యాంకులకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక క్రెడిట్‌ స్కోరు ఉన్నవారి రుణ దరఖాస్తులకు త్వరితగతిన ఆమోదం లభిస్తుంది. అత్యవసర స్థితిలో రుణం కోసం వెళ్లినప్పుడు ఇది మరింతగా సహాయపడుతుంది.

తక్కువ వడ్డీ రేట్లు..

బ్యాంకులు క్రెడిట్‌ రిస్క్‌ ఆధారంగా కూడా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉంటే బ్యాంకులకు క్రెడిట్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ వడ్డీరేటుతో రుణం మంజూరు చేస్తాయి. ఒకవేళ క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉంటే.. క్రెడిట్‌ రిస్క్‌ తగ్గుతుంది. కాబట్టి తక్కువ వడ్డీరేటుకే రుణం ఇస్తాయి. గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి వాటిలో 0.50% వడ్డీ తగ్గినా చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

వడ్డీ రేట్లు తగ్గించమని కోరవచ్చు..

రుణాలు సక్రమంగా చెల్లించే రుణ గ్రహీతలను వదులుకునేందుకు బ్యాంకులు ఇష్టపడవు. కాబట్టి సిబిల్‌ స్కోరు ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లు కొంత వరకు తగ్గించమని బ్యాంకులను కోరవచ్చు. బ్యాంకులు మెరుగైన వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజులతో రుణం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి. 

ఎక్కువ రుణం..

రుణం మొత్తం పెరుగుతున్న కొద్దీ బ్యాంకులకు నష్టభయం పెరుగుతుంది. కాబట్టి అధిక మొత్తంలో రుణాలను ఆమోదించేందుకు ఆలోచిస్తారు. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నవారికి లోన్‌ అందించినప్పటికీ, రుణ మొత్తం తక్కువగా ఉండొచ్చు. కానీ క్రెడిట్‌ స్కోరు ఎక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలోనైనా ఆమోదించే అవకాశం ఉంటుంది. 

ప్రీ-అప్రూవ్డ్‌ రుణాలు..

క్రెడిట్‌ స్కోరు బాగుంటే బ్యాంకులే స్వయంగా రుణాలను, క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ ఆఫర్‌లతో తక్కువ డాక్యుమెంటేషన్‌తో, తక్కవ సమయంలోనే రుణం పొందే వీలుంటుంది. 

ప్రీమియం క్రెడిట్‌ కార్డు..

క్రెడిట్‌ స్కోరు బాగుంటే.. ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌, రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లతో కూడిన ప్రీమియం క్రెడిట్‌ కార్డులను పొందేందుకు అవకాశం ఉంటుంది.

కాలపరిమితి..

ఎక్కువ కాలవ్యవధిలో ఈఎంఐ తగ్గుతుంది. అయితే చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. ఇది రుణదాతకు లాభమే అయినప్పటికీ ఎక్కువ కాలపరిమితితో రుణ ఎగవేతలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి బ్యాంకులు ఎక్కువ కాలవ్యవధిని అందించేందుకు ఇష్టపడవు.. ఒకవేళ క్రెడిట్‌ స్కోరు బాగుంటే ఎక్కువ కాలపరిమితితోనూ రుణాలను ఆమోదిస్తాయి. 

చివరిగా..

క్రెడిట్‌ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మంచిదిగా చెబుతారు. 800 కంటే ఎక్కువ నిర్వహించేవారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రుణ ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డు బిల్లలు సమయానికి చెల్లించడం ద్వారా క్రెడిట్‌ స్కోరును పెంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని