అటల్ పెన్షను యోజన ద్వారా లాభాలెన్నో...

మన దేశంలో పెన్షను స్కీమ్ అనేది మొన్నటి వరకు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. కానీ ఈ ప్రయోజనాలు అందరికి వర్తించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మే 9, 2015న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రకటించింది....

Updated : 21 Oct 2021 16:05 IST

మన దేశంలో పెన్షను స్కీమ్ అనేది మొన్నటి వరకు కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించేది. కానీ ఈ ప్రయోజనాలు అందరికి వర్తించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మే 9, 2015న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రకటించింది. ముఖ్యంగా అసంఘటిత రంగ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షను యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం 18 నుంచి 40 ఏళ్ల వయస్సులోపు ఉన్న ప్రతీ భారతీయుడు నెల నెలా వారి స్తోమతకు తగ్గట్టుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఎవరైతే ఈ పథకంలో పెట్టుబడి పెట్టారో వారికి 60 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత నుంచి ప్రభుత్వం పెన్షను రూపంలో నిర్ణీత మొత్తాన్ని అందిస్తుంది. ఈ పథకంలో నెల నెలా మీరు చెల్లించే మొత్తాన్ని బట్టి రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ తీసుకునే వీలుంది. ఉదాహరణకి మీరు నెలకి రూ.5000ల పెన్షన్ పొందాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మీ వయస్సు 18 సంవత్సరాలు అనుకుంటే మీరు 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210లు పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది.

ఒకవేళ మీ వయస్సు 40 సంవత్సరాలు అనుకుంటే మీరు 20 సంవత్సరాల పాటు నెలకు రూ.1454లు పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. ఈ పెన్షన్ స్కీం లో మీరు గరిష్టంగా నెలకు రూ. 5000ల పెన్షను మాత్రమే పొందగలరు. తక్కువ వయస్సులోనే ఈ పథకంలో చేరడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని ఆర్ధిక నిపుణులు తెలియచేస్తున్నారు.

అటల్ పెన్షన్ యోజన పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి?

అటల్ పెన్షన్ యోజన పథకంలో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు:

అటల్ పెన్షను యోజన పథకంలో చేరిన వారికీ ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలను కల్పించింది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి 60 సంవత్సరాల తర్వాత నిర్ణీత మొత్తాన్ని పెన్షను రూపంలో పొందాలని భావించే వారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ పింఛను వ్యవస్థ కు ఎలాంటి పన్ను మినహాయింపులను ఇస్తుందో అదే విధంగా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారికి కూడా అవే ప్రయోజనాలను కల్పిస్తుంది.

ఈ పథకంలో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50000ల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారు స్కీమ్ మెచ్యూరిటీ తీరిన తర్వాత ప్రమాదవశాత్తు మరణించినట్లయితే నెల నెలా పెన్షను వారి జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. ఒకవేళ జీవిత భాగస్వామి కూడా మరణించినట్లయితే పెన్షనుకు సంబంధించిన పూర్తి డబ్బును నామినీకి చెల్లిస్తారు.

స్కీమ్ మెట్యూరిటీ తీరకముందే పథకంలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామి స్కీమ్ ను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ రంగం సంస్థ అయిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీయే) నిర్వహిస్తోంది.

నెల నెలా సక్రమంగా చెల్లించని వారికి ఎంత జరిమానా ఉంటుంది?

నెలకు రూ.100 చెల్లించే వారు నిర్ణీత తేదీలోగా చెల్లించకపోతే వారికి ఒక రూపాయి జరిమానా విధిస్తారు. అలాగే నెలకు రూ.101 నుంచి రూ.500 చెల్లించే వారికి రెండు రూపాయలు, రూ.501 నుంచి రూ.1000 చెల్లించే వారికి ఐదు రూపాయలు, రూ.1000 ల కంటే ఎక్కువ చెల్లించే వారికి పది రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. ఒకవేళ వరుసగా ఆరు నెలల పాటు చెల్లించనట్లయితే సదరు పింఛ‌ను ఖాతాను స్తంభింపజేస్తారు. అదేవిధంగా 12 నెలలు పాటు చెల్లించనట్లయితే పింఛను ఖాతాను డీయాక్టివేట్ చేస్తారు. 24 నెలల అనంతరం ఖాతాను మూసివేస్తారు.

అటల్ పెన్షను యోజన పథకాన్ని చిన్న వయస్సులోనే తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాన్ని ఒకసారి చూద్దాం…

18 సంవత్సరాల వయస్సు ఉన్న చందాదారుడు రూ. 5,000ల నెలసరి పెన్షను కొరకు నెలకు రూ. 210 చొప్పున 42 సంవత్సరాలకు గాను మొత్తం రూ. 1,05,840 చెల్లిస్తాడు. అదే పెన్షను కోసం 40 సంవత్సరాల చందాదారుడు నెలకు రూ.1,454 ల చొప్పున మొత్తం రూ.3,48,960లను చెల్లిస్తాడు.

వీరిద్దరూ చెల్లించే చందాలో ఉన్న వ్యత్యాసం రూ.2,43,120. అంటే ఒకే రకమైన పెన్షను కోసం 40 సంవత్సరాల వయస్సున్న చందాదారుడు 18 సంవత్సరాల వయస్సు ఉన్న చందాదారుడికంటే రూ.2,43,120 ఎక్కువగా చెల్లిస్తున్నాడు. అందుకే తక్కువ వయస్సు ఉన్నప్పుడే అటల్ పెన్షను యోజన పధకంలో చేరడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలని పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని