Credit cards: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందించే ప్రయోజనాలివే..!

మీరు ఒక బ్రాండ్ ని ఎక్కువగా కొనుగోలు చేసేవారైతే, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవడం మంచిది

Published : 18 Mar 2022 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్ కార్డులు ద్వారా కేవలం చెల్లింపు సౌలభ్యాన్ని మాత్రమే కాకుండా క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటివి కూడా పొందొచ్చు. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లలోకి అనేక రకాల కొత్త క్రెడిట్ కార్డులు ప్రవేశిస్తున్నాయి. అయితే, ఒక సాధారణ క్రెడిట్ కార్డు ప్రతి లావాదేవీపై ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తుంది. అదే ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అయితే నిర్దిష్ట లావాదేవీలపై అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఎవరైతే నిర్దిష్ట కొనుగోలు అలవాట్లను, అలాగే నిర్దిష్ట బ్రాండ్ ప్రాధాన్యతలను కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ కార్డులు సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ఈ కార్డులకు జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజులు వర్తిస్తాయి. అందువల్ల మీరు ఈ కార్డుల కోసం చెల్లించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను పొందాలని గుర్తుంచుకోండి.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులనేవి బ్యాంకులు, రిటైల్ కంపెనీలు లేదా వ్యాపార సంస్థలు సంయుక్తంగా అందిస్తాయి. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను నిరంతరం వినియోగించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లను పొందొచ్చు. ఒకవేళ మీరు ఒక బ్రాండ్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేవారైతే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవడం మంచిది. మీకు సులభంగా అర్థం అవ్వడానికి మూడు రకాల క్రెడిట్ కార్డులను.. వాటి ప్రయోజనాలను గురించి కింద తెలియజేశాం..

అమెజాన్ పే - ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు: అమెజాన్‌లో చేసే ప్రతి కొనుగోలుపై ప్రైమ్ సభ్యులకు 5 శాతం క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ సభ్యులకు 3 శాతం క్యాష్‌బ్యాంక్‌ను ఈ కార్డు అందిస్తుంది. అదే విధంగా రూ.100 కంటే ఎక్కువ భాగస్వామి వ్యాపారులకు చేసే చెల్లింపులపై 2 శాతం క్యాష్‌బ్యాక్, ప్రతి ఇతర లావాదేవీలపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. వీటితో పాటు అమెజాన్‌లో చేసే కొనుగోళ్లను మూడు లేదా ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కూడా కార్డు అందిస్తుంది. దీనికి ఎలాంటి వార్షిక రుసుమూ లేదు.

ఫ్లిప్‌కార్ట్‌- యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు: ఫ్లిప్ కార్ట్, మింత్రాలో చేసే ప్రతి కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్, ఉబర్, క్యూర్.ఫిట్, క్లియర్ ట్రిప్, 1 ఎంజీ మొదలైన వాటిపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను, మిగిలిన అన్ని రకాల చెల్లింపులపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఈ కార్డు అందిస్తుంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు, సంవత్సరంలో నాలుగు ఉచిత డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌ను పొందడంతో పాటు కొన్ని రకాల రెస్టారెంట్లలో 20 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ.500గా ఉంది.

ఇండియన్ ఆయిల్- సిటీ బ్యాంక్ ప్లాటినమ్‌ క్రెడిట్ కార్డు: ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై నాలుగు టర్బో పాయింట్లను, అలాగే ఇంధన కొనుగోళ్లపై 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ రివర్సల్‌ను ఈ కార్డు అందిస్తుంది. అలాగే కిరాణా, సూపర్ మార్కెట్‌లలో చేసే ప్రతి రూ.150 ఖర్చుపై 2 టర్బో పాయింట్లను కూడా అందిస్తుంది. 1 టర్బో పాయింట్ విలువ రూ.1 ఉచిత ఇంధనానికి సమానం. ఈ క్రెడిట్ కార్డుపై వార్షిక రుసుము రూ.1,000గా ఉంది.

క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా సంపాదించిన రివార్డ్ పాయింట్లను వస్తువులను లేదా గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగించుకోవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేయడం, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుముపై తగ్గింపు వంటి ప్రయోజనాలను ఈ కార్డులు మీకు అందిస్తాయి.

గుర్తుంచుకోవలసిన విషయాలు: కొన్నిసార్లు మీరు ఒకే క్రెడిట్ కార్డును ఉపయోగించి అన్ని రకాల కొనుగోళ్ల పై ప్రయోజనాలను పొందలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ప్రయోజనాలను పొందడానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ కో-బ్రాండెడ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నప్పుడు, వాటిని వినియోగించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని, అధిక మొత్తంలో రివార్డ్ పాయింట్లు లభిస్తున్నాయని అతిగా ఖర్చులు చేసినట్లైతే రుణ భారం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని