Joint Home Loan: జాయింటుగా గృహ రుణం.. ప్రయోజనాలివే!

ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ లు) కూడా రుణం కోసం సహా-దరఖాస్తుదారు ఉండొచ్చు. 

Published : 29 Jan 2023 11:16 IST

చాలా మంది.. జీవితంలో ఒకే ఇంటిని కొనుగోలు చేయగులుగుతారు. రుణం తీసుకుని కొనుగోలు చేస్తే ఇంటి అప్పు తీరేసరికి 20 నుంచి 30 ఏళ్ల సమయం పడుతుంది. అందువల్ల కొనుగోలు చేసే ముందే తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. గృహ రుణాన్ని వ్యక్తిగతంగానే కాకుండా, ఉమ్మడిగా కూడా తీసుకోవచ్చు. ఉమ్మడిగా తీసుకోవడం వల్ల రుణ పరిమితి పెంచుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద మొత్తంలో రుణం పొందొచ్చు..

ఇంటి కొనుగోలుకు పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. బ్యాంకులు ఇంటి విలువతో పాటు కొనుగోలుదారుని ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని రుణం మంజూరు చేస్తుంటాయి. ఆస్తి విలువలో 90% వరకు గృహ రుణం ఇచ్చే వీలుంటుంది. అయితే, ఒకవేళ కొనుగోలుదారుని ఆదాయం తక్కువగా ఉంటే..ఇంటి విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ రుణం తక్కువగా రావచ్చు. సహ-దరఖాస్తుదారుడు ఉంటే వారి ఆదాయాన్ని కూడా కలిపి చూస్తారు. కాబట్టి, ఎక్కువ మొత్తంలో రుణం లభించే అవకాశం ఉంటుంది. 

రాజీ పడనవసరం లేదు..

నచ్చిన ప్రదేశంలో నచ్చిన విధంగా ఇల్లు కొనుగోలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం పడుతుంది. సింగిల్‌గా తీసుకుంటే మీరు అనుకున్న మొత్తం రుణం లభించక.. రాజీ పడాల్సి రావచ్చు. జాయింటుగా హోమ్‌లోన్‌ తీసుకోవడం వల్ల..బ్యాంకు దృష్టిలో ఆదాయం, చెల్లింపుల సామర్థ్యం రెండూ పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ మొత్తంలో రుణం పొందేందుకు అర్హత సాధిస్తారు. దీంతో రాజీ లేకుండా నచ్చిన ఇంటిని కొనుగోలు చేయవచ్చు. 

పన్ను ప్రయోజనాలు..

గృహ రుణంపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. గృహ రుణ అసలు చెల్లింపులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సి కింద రూ. 1.50 లక్షల వరకు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్‌ 24బి కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. జాయింటుగా లోన్‌ తీసుకుంటే దరఖాస్తుదారులు ఇరువురూ వారి వారి రుణ చెల్లింపులకు లోబడి పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. కాబట్టి పన్ను ప్రయోజనాలకు అనుగుణంగా చెల్లింపులను ప్లాన్‌ చేసుకోవచ్చు. 

మహిళా దరఖాస్తుదారు ఉంటే..

చాలా బ్యాంకులు మహిళా దరఖాస్తుదారులకు సాధారణ వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. కాబట్టి, మొదటి దరఖాస్తుదారుగా మహిళను ఎంచుకుంటే ఈ ప్రయోజనం పొందొచ్చు. అంతేకాకుండా ప్రాసెసింగ్‌ ఫీజులు తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు మహిళలకు స్టాంప్‌డ్యూటీలో రాయితీలు అందిస్తున్నాయి. రుణం తీసుకునే సమయంలో ఇలాంటి ప్రయోజనాలను చెక్‌చేయండి. 

ఈఎంఐలు భారం కాకుండా..

ఉమ్మడి గృహ రుణం తీసుకుంటే.. ఈఎంఐలు కూడా పంచుకుని చెల్లించవచ్చు. కాబట్టి, భారం మొత్తం ఒక్కరిపైనే పడకుండా ఉంటుంది. 

సహా-దరఖాస్తుదారులుగా ఎవరు ఉండొచ్చు?

గృహ రుణంలో.. సహ-దరఖాస్తుదారులుగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోబుట్టువులు, కుమారుడు లేదా అవివాహిత కుమార్తె వంటి దగ్గరి బంధువులు అయి ఉండాలి. హోమ్ లోన్ తీసుకునే దరఖాస్తుదారులందరి ఆదాయ పత్రాలతో పాటు సహ-దరఖాస్తుదారులందరి కేవైసీ పత్రాలు, లోన్ సంబంధిత పత్రాలను అందించాలి. ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) కూడా సహా-దరఖాస్తుదారు ఉండొచ్చు. 

సహ దరఖాస్తుదారు Vs సహ యజమాని..

ఆస్తి సహ యజమానులందరూ గృహ రుణ సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. కానీ గృహ రుణం సహ-దరఖాస్తుదారు ఇంటి సహ యజమాని కానవసరం లేదు. క్రెడిట్‌/లోన్‌ కోసం సహదరఖాస్తుదారుని ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని