పీపీఎఫ్ ఖాతా తెర‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

పీపీఎఫ్ ఖాతాను కొన‌సాగించేందుకు ఏడాదికి క‌నీసం రూ. 500 జ‌మచేస్తే స‌రిపోతుంది

Published : 03 May 2022 14:45 IST


ప్ర‌జా భ‌విష్య నిధి (ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లేదా పీపీఎఫ్ పేరుకు త‌గిన‌ట్లుగానే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పెట్టుబ‌డులు పెట్ట‌గ‌లిగే ప్ర‌భుత్వ ప‌థ‌కం. ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌తో స‌హేతుక‌మైన రాబ‌డిని అందిస్తుంది. పొద‌పుతో పాటు ప‌న్ను ఆదా చేసే విధంగా రూపొందించ‌డం వ‌ల్ల చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. పీపీఎఫ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నేషనల్ సేవింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా 1968లో ప్రవేశపెట్టింది. చిన్న చిన్న మొత్తాల‌లో పొదుపు చేసే వారు కూడా దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డులు చేయాల‌నేదే ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ల‌క్ష్యం. కేంద్ర ప్ర‌భుత్వ హామీ ఉండ‌డం వ‌ల్ల న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. అందువ‌ల్ల రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డని వారు పెట్టుబ‌డులను వాయిదా వేడ‌యం లేదా పూర్తిగా నిలిపివేయ‌డం వంటివి చేయ‌కుండా ఈ ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌చ్చు. 

పీపీఎఫ్‌లో ఒక ప్ర‌త్యేకమైన ఫీచ‌ర్ ఉంది. పీపీఎఫ్ ఖాతాదారు దివాళా తీసినా లేదా రుణాలు చెల్లించ‌డంలో విఫ‌లమ‌యినా అత‌ను/ఆమె బాకీ ఉన్న మొత్తాన్ని జమచేయటం కోసం దేశంలో ఏ కోర్టు ఆర్డర్/డిక్రీ ఇచ్చినప్పటికీ, పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని 'ఎటాచ్' చేయటం వీలుకాదు. అయితే, ఆదాయ‌పు ప‌న్ను, ఇత‌ర ప్ర‌భుత్వ అధికారులు మాత్రం ప‌న్ను బ‌కాయిల‌ను రిక‌వ‌రీ చేసేందుకు ఖాతాను జోడించ‌వ‌చ్చు. భారత ప్రభుత్వం 1968లో ప్ర‌వేశ‌పెట్టిన పీపీఎఫ్‌ పాత నిబంధనల స్థానంలో ‘పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 2019’ ని డిసెంబ‌రు 12, 2019లో తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం పథకం క్రమానుగత సవరణలకు లోబడి ఉంటుంది. 

పీపీఎఫ్ ఖాతానే ఎందుకు? 
భార‌త్‌లోని పెట్టుబ‌డిదారుల ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని పీపీఎఫ్ సేహేతుక‌మైన రాబ‌డిని అందిస్తుంది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ఆదాయ వ‌ర్గాల వారు దీర్ఘ‌కాలం పాటు చిన్న మొత్తాల‌తో పొదుపు చేయ‌గ‌లుగుతారు. క‌చ్చిత‌మైన రాబ‌డిని పొంద‌డంతో పాటు ప్ర‌భుత్వ హామీతో పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుంది. ఈఈఈ(మినహాయింపు-మినహాయింపు- మినహాయింపు) కేటగిరి కిందికి రావడం వల్ల పెట్టుబడులు, రాబడి, మెచ్యూరిటీ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్ష‌న్ 80సి కింద‌ పన్ను ప్రయోజనాలు ల‌భిస్తాయి. దీంతో దీర్ఘ‌కాలంలో మంచి కార్ప‌స్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. పీపీఎఫ్‌ ఖాతాలో చేసిన పెట్టుబడి మార్కెట్ అస్థిరతకు గురికానందువల్ల ఈ ఖాతా భారతదేశంలోని మధ్యతరగతి ఆదాయ ప్రజల ఆదర‌ణ‌ పొందింది.

పీపీఎఫ్ ఖాతాను రూ. 500 చిన్న మొత్తంతో ప్రారంభించ‌వ‌చ్చు. ఖాతాను కొన‌సాగించేందుకు ఏడాదికి క‌నీసం రూ. 500 జ‌మచేస్తే స‌రిపోతుంది. ఏడాదికి గ‌రిష్ఠంగా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఈ పెట్టుబ‌డి కూడా ఒకేసారి పెట్ట‌న‌వ‌స‌రం లేదు. పెట్టుబ‌డిదారులు త‌మ సౌల‌భ్యాన్ని అనుస‌రించి ఏడాదికి 12 వాయిదాలలో పీపీఎఫ్ ఖాతాలో డ‌బ్బు జ‌మ‌చేయ‌వ‌చ్చు. 

పీపీఎఫ్ పెట్టుబ‌డులకు 15 సంవ‌త్స‌రాల సుదీర్ఘ స‌మ‌యం ఉంటుంది. అంటే లాక్ - ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు ఖాతా క్రియాశీల‌కంగా ఉండేలా ఖాతాదారుడు చూసుకోవాలి. ఇందుకోసం ఏడాదికి క‌నీసం రూ. 500 ఖాతాలో జ‌మ‌చేయాలి. మెచ్యూరిటీ స‌మ‌యంలో డ‌బ్బు పూర్తిగా విత్‌డ్రా చేసుకోన‌వ‌స‌రం లేదు. 5 సంవ‌త్స‌రాల‌ చొప్పున ఖాతాను పొడిగించుకోవ‌చ్చు.

సాధార‌ణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసులు అందించే పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. పీపీఎఫ్ ఖాతా వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్ర‌తీ త్రైమాసికానికి ప్ర‌భుత్వం వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తుంది. దేశంలోని అనేక వాణిజ్య బ్యాంకులు నిర్వహించే సాధారణ ఖాతాల కంటే ఈ ఖాతాపై అధిక వడ్డీ రేటును అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. 

పీపీఎఫ్ ఖాతా రుణ స‌దుపాయాన్ని అందిస్తుంది. పెట్టుబ‌డిదారుడు ఖాతాలో జ‌మ‌చేసిన మొత్తంపై ఖాతా ప్రారంభించిన 3 నుంచి 6 సంవ‌త్సారాల లోపు రుణం పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాపై రుణం పొందేందుకు గరిష్ఠ స‌మ‌యం 36 నెల‌లు. ఖాతాలో ఉన్న మొత్తంపై 25 శాతం లేదా అంత‌కంటే త‌క్కువ మొత్తాన్ని రుణంగా తీసుకునే అవ‌కాశం ఉంది. ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం త‌ర్వాత నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.

చివరిగా:
ఇంత‌కు ముందుకు చెప్పుకున్న‌ట్లు పీపీఎఫ్ ఖాతా పెట్టుబ‌డుల‌పై ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద గ‌రిష్ఠంగా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. అంతేకాకుండా వ‌డ్డీపై కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు. మెచ్యూరిటీ స‌మ‌యంలో వ‌డ్డీతో పాటు క‌లిపి తీసుకునే మొత్తం నిధికి కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు. దీంతో ఖాతాదారులు మంచి రాబ‌డిని పొంద‌గులుగుతారు. పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈ పధకం లో రిస్క్ లేని పెట్టుబడి చేయవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని