Credit Cards: క్రెడిట్‌ కార్డులతో ఈ ప్రయోజనాలు తెలుసా?

క్రెడిట్‌ కార్డులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు.

Updated : 08 Jul 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డులనగానే చాలామంది అదొక అప్పుల ఊబిగా ఊహించుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ లేనివారికి ‘అప్పుల ఊబి’ అనే పదం సరైనదే. అయితే, క్రెడిట్‌ కార్డు వాడకం వల్ల కొద్దిగా నష్టాలు ఉన్నప్పటికీ.. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి క్రెడిట్‌ కార్డులు లాభమనే చెప్పాలి. క్రెడిట్‌ కార్డును పద్ధతిగా ఉపయోగిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. మీ ఆర్థిక దినచర్యలో క్రెడిట్ కార్డులను చేర్చడం వల్ల రివార్డ్స్‌, డిస్కౌంట్స్‌ వంటి అనేక ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ప్రయోజనాలు కార్డు వాడకాన్ని బట్టి ఉంటాయి. సాధారణ ఖర్చుల కోసం కార్డులను ఎలా ఉపయోగించాలో తెలిస్తే.. అది మంచి మొత్తాన్ని ఆదా చేయడంలో ఉపయోగపడుతుంది. క్రెడిట్‌ కార్డుతో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌

రోజువారీ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ పొందే అవకాశం క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం వల్ల పొందొచ్చు. ఇది క్రెడిట్‌ కార్డు ఉపయోగించేవారికి అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో ఒకటి. భారత్‌లోని క్రెడిట్‌ కార్డు ప్రొవైడర్లు.. కిరాణా, ఇంధనం, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై క్యాష్‌బ్యాక్‌ రివార్డ్స్‌ను అందిస్తాయి. ఇలా వచ్చిన క్యాష్‌బ్యాక్‌ రివార్డులను తర్వాత రిడీమ్‌ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ పంపుల వద్ద ఇంధన సర్‌ఛార్జ్‌ మినహాయింపులను కూడా పొందొచ్చు.

రివార్డ్‌ పాయింట్స్‌

క్రెడిట్‌ కార్డులు తరచుగా రివార్డ్‌ ప్రోగ్రామ్స్‌తో వస్తాయి. ప్రతి లావాదేవీకి వినియోగదారులు పాయింట్లను కూడగట్టుకోవడానికి వీలుంటుంది. షాపింగ్‌, ప్రయాణాలు వంటి అనేక రకాల ప్రయోజనాల కోసం ఈ పాయింట్లను తర్వాత రిడీమ్‌ చేసుకోవచ్చు. ఉచిత షాపింగ్‌ లేదా ఉచిత విమాన టిక్కెట్ల వంటి అద్భుతమైన బహుమతులు, వోచర్ల కోసం కార్డు వినియోగదారులు ఈ రివార్డ్స్‌ను రిడీం చేసుకోవచ్చు.

లాంజ్‌ యాక్సెస్‌

క్రెడిట్‌ కార్డులు దేశంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో కాంప్లిమెంటరీ లాంజ్‌ యాక్సెస్‌, ప్రాధాన్యత చెక్‌-ఇన్‌ సౌకర్యాలను అందిస్తాయి. అంతేకాకుండా ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విక్రయాల సమయంలో క్రెడిట్‌ కార్డులపై మంచి డీల్‌లు తరచుగా అందుబాటులో ఉంటాయి. వీటిలో డిస్కౌంట్లు లేదా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉంటాయి. చాలా సార్లు క్రెడిట్‌ కార్డును బట్టి ప్రీ-పెయిడ్‌ ఆఫర్లపై 5-10% అదనపు తగ్గింపును కూడా పొందొచ్చు.

మెరుగైన క్రెడిట్‌ స్కోరు

క్రెడిట్‌ కార్డులు ఆయా వినియోగదారులకు క్రెడిట్ లైన్‌ను నిర్మించుకునే అవకాశాన్ని అందిస్తాయి. కార్డు వినియోగం, తిరిగి చెల్లింపులు ఆధారంగా క్రెడిట్‌ హిస్టరీ ఉంటుంది. క్రెడిట్‌ కార్డులను బాధ్యతాయుతంగా ఉపయోగించి, చెల్లింపులు కూడా సరైన సమయంలోగా చెల్లించిన వారికి క్రెడిట్‌ హిస్టరీ మెరుగ్గా ఉంటుంది. వీరి మెరుగైన ఆర్థిక ప్రవర్తన వల్ల క్రెడిట్ స్కోరు అధికంగానే ఉంటుంది. ఇలాంటి వారికి భవిష్యత్‌లో రుణాలు వేగంగా లభించడమే కాకుండా, వాటిపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి.

ఆన్‌లైన్‌ లావాదేవీలు

ఆన్‌లైన్‌/డిజిటల్‌ లావాదేవీలు, షాపింగ్‌ చేసేటప్పుడు చెల్లింపులకు క్రెడిట్‌ కార్డులు చాలా సౌకర్యంగా ఉంటాయి. డెబిట్‌ కార్డుతో కూడా ఇలాంటి లావాదేవీలు చేయొచ్చు కానీ, దానిలో తగినంత నగదు నిల్వ లేనప్పుడు ఇబ్బందే. అదే క్రెడిట్‌ కార్డుతో అయితే చెల్లింపులు చేయడం వినియోగదారుడికి చాలా తేలిక. ఉదాహరణకు ప్రయాణాలకు టికెట్లు బుక్‌ చేసేటప్పుడు, ఆహారాన్ని ఆర్డర్‌ చేసినా లేదా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసినా, ఏవైనా సేవలకు ఛార్జీలు చెల్లించినా.. క్రెడిట్‌ కార్డులతోనే చాలా సులభం. 

వడ్డీ రహిత కాలం

క్రెడిట్‌ కార్డులతో చేసే ఖర్చులపై చెల్లింపులకు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ వడ్డీ రహిత సమయం సాధారణంగా 20 నుంచి 50 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకు ఎలాంటి వడ్డీని వసూలు చేయదు. ఇప్పుడే కొనుగోలు చేసి తర్వాత చెల్లించడం అనేది వినియోగదారులకు తాత్కలికంగా మంచి అవకాశమనే చెప్పాలి. ఈ వడ్డీ రహిత సమయం ఉండడం వల్ల బకాయి ఎలా తీర్చాలనే దానిపై వినియోగదారుడు తగు నిర్ణయం తీసుకోవచ్చు.

నగదు ఉపసంహరణ

అనుకోని అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులు ఆర్థిక భద్రతా వలయంగా పనిజేస్తాయి. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే ఎవరినీ అప్పు అడగకుండానే క్రెడిట్‌ కార్డు ద్వారా పొందొచ్చు. ఎవరికైనా కొన్ని పరిస్థితులు, సంఘటనల కారణంగా.. ముఖ్యంగా మెడికల్‌ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నిధులు అత్యవసరంగా అవసరం పడతాయి. అలాంటి సమయంలో కార్డు క్రెడిట్‌ లిమిట్‌ను బట్టి ఆయా బ్యాంకు ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, దీనికి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

ఈఎంఐ సౌకర్యం

కార్డుపై వినియోగదారులు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు.. ఆ బకాయిలను అంతే వేగంగా ఒకేసారి చెల్లించలేకపోవచ్చు. ఇందుకుగాను ఆ బకాయిలను సమానమైన నెలవారీ వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటికి వ్యక్తిగత రుణం తీసుకోవడం కన్నా క్రెడిట్‌ కార్డుపై కొనుగోలు చేసి ఆ తర్వాత ఈఎంఐల్లో తీర్చేయడం వల్ల వడ్డీ ఖర్చు తక్కువ ఉంటుంది.

వ్యక్తిగత రుణం

డబ్బులు అవసరం పడినప్పుడు క్రెడిట్‌ కార్డు ద్వారా రుణం తీసుకోవచ్చు. రుణం గురించి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే వారిని సంప్రదించొచ్చు. క్రెడిట్‌ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి క్రెడిట్‌ కార్డు జారీ చేసిన సంస్థలే ప్రీ అప్రూవ్డ్‌ రుణాలను మంజూరు చేస్తాయి. ఇలాంటి ప్రీ అప్రూవ్డ్‌ రుణాలను తీసుకోవాలని కార్డు ప్రొవెడర్లే కార్డుదారులను అభ్యర్థిస్తాయి. ఇలాంటి వాటికి వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఆయా బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజులను మాఫీ చేస్తాయి.

సురక్షితం

లావాదేవీలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లడం కంటే క్రెడిట్‌ కార్డును తీసుకెళ్లడం చాలా వరకు సులభం, సురక్షితం. కార్డును పోగొట్టుకున్నప్పుడు బ్యాంకుకు తెలియజేసి కార్డును తాత్కాలికంగా బ్లాక్‌ చేయొచ్చు. తర్వాత కొత్త కార్డును కూడా పొందొచ్చు. కార్డును చోరీ లేదా క్లోనింగ్‌ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ క్రెడిట్‌ కార్డుపై బీమా ఉన్నప్పుడు ఆ మోసాల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా కార్డుపై అదనపు మోసాలు గుర్తించినట్లయితే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయొచ్చు. మోసం అని రుజువైతే బ్యాంకులు సాధారణంగా ఆ ఛార్జీలను మాఫీ చేస్తాయి. కాబట్టి, మోసగాళ్లు చేసిన కొనుగోళ్లకు మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

చివరిగా: ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారు క్రెడిట్‌ కార్డులు ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు. క్రమశిక్షణ లేనివారు వీటివల్ల రుణాల ఊబిలో చిక్కుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని