Car Insurance: కారు బీమాకి అద‌నంగా ఉండే రైడ‌ర్‌లతో ప్ర‌యోజ‌నాలు

స‌మ‌గ్ర‌ బీమాకు అనేక రైడ‌ర్‌లు జ‌త చేస్తే మోటారు వాహ‌నానికి అనేక ర‌క్ష‌ణ‌లు క‌ల్పించ‌వ‌చ్చు.

Published : 07 Jul 2022 16:16 IST

ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగే కాలం ఏమ‌న్నా ఉందంటే అది వ‌ర్షాకాల‌మే. ప్ర‌కృతి అప్పుటిక‌ప్పుడే వాతావ‌ర‌ణాన్ని, ప‌రిస‌ర ప్రాంతాల‌ను బీభ‌త్సం చేసేస్తుంది. దానికి తోడు ప్ర‌మాదాలు జ‌రిగేవి కూడా ఎక్కువ మోటారు వాహ‌నాల‌తోనే. కాబ‌ట్టి వ‌ర్షాకాలం మోటారు వాహ‌నాల డ్రైవింగ్‌తో మ‌రింత జాగ్ర‌త్త‌గా మ‌సులుకోవాలి. ప్ర‌మాదాల వ‌ల‌న మోటారు వాహ‌నానికి, వ్య‌క్తుల‌కు జ‌రిగే ఆర్ధిక న‌ష్టాల‌ను ఎదుర్కొవ‌డానికి మోటారు ఇన్సూరెన్స్ చాలా వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రి. చ‌ట్ట ప్ర‌కారం అయితే థ‌ర్డ్ పార్టీ బీమా త‌ప్ప‌నిస‌రి. స‌మ‌గ్ర‌ బీమాకు అనేక రైడ‌ర్‌లు జ‌త చేస్తే మోటారు వాహ‌నానికి ర‌క్ష‌ణ‌ క‌ల్పించ‌వ‌చ్చు.

భార‌త్‌లో రోడ్డు ప్ర‌మాదాల గ‌ణాంకాలు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. ప్ర‌పంచ బ్యాంకు నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచంలోని వాహ‌నాల్లో భార‌త్‌లో కేవ‌లం 1% మాత్ర‌మే ఉంటే..రోడ్డు ప్ర‌మాదాలు, మ‌ర‌ణాల విష‌యంలో అత్య‌ధికంగా ఉంది. ఇటువంటి ప్ర‌మాదాలు వ‌ర్ష‌కాలంలోనే ఎక్కువ‌గా ఉంటాయి. ఈ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డానికి, ఆర్ధికంగా న‌ష్ట‌పోకుండా ఉండ‌టానికి రైడ‌ర్‌ల‌తో కూడిన‌ మోటారు బీమా ఎంత‌యినా అవ‌స‌రం.

కొత్త కారు కొనుగోలు చేసేట‌ప్పుడు ఒక సంవ‌త్స‌రం స‌మ‌గ్ర బీమాను, 3 ఏళ్ల థ‌ర్డ్‌-పార్టీ పాల‌సీని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. 2వ‌, 3వ సంవ‌త్స‌రాల్లో వినియోగ‌దారుడు కేవ‌లం `స్టాండ్‌లోన్ ఓన్ డ్యామేజ్‌` (SAOD) పాల‌సీని కొనుగోలు చేస్తే సరిపోతుంది. కానీ ఇది పాక్షిక ర‌క్ష‌ణ‌ను మాత్ర‌మే ఇస్తుంది. అయితే వర్షాకాలంలో వాహ‌నం జారిపోవ‌డానికి అవ‌కాశం ఉన్న ర‌హ‌దారుల వ‌ల్ల అంత‌కు మించిన న‌ష్ట‌మే జ‌రిగే అవ‌కాశాలుంటాయి. అందువ‌ల్ల స‌మ‌గ్ర బీమాను ఎంచుకోవ‌డం, యాడ్‌-ఆన్ రైడ‌ర్‌ల‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌డం వ‌ల్ల భ‌ద్ర‌త ఎక్కువ ఉంటుంది.

మోటారు బీమా పాల‌సీలో భాగ‌మైన కొన్ని విలువైన రైడ‌ర్‌లు ఈ క్రింద ఉన్నాయి.

ఇంజిన్ ర‌క్ష‌ణ క‌వ‌ర్:
ఇంజిన్ అనేది వాహ‌నానికి అత్యంత ముఖ్య‌మైన ది. అయితే ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగే ఇంజిన్ న‌ష్టం ప్రాథ‌మిక పాల‌సీ కింద క‌వ‌రేజ్ ఉండ‌దు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రైడ‌ర్‌లో భాగంగా 'హైడ్రోస్టాటిక్ క‌వ‌రేజీ'ని అందిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, భారీ వ‌ర్షాల స‌మ‌యంలో వాహ‌నం నీటిలో మునిగిపోయి ఇంజిన్‌లో నీరు చేరితే, ఇంజిన్ ర‌క్ష‌ణ రైడ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా మీరు కొత్త కారుని క‌లిగి ఉంటే, దీర్ఘ‌కాలం ఉండే ఇంజిన్ జీవితానికి ఈ క‌వ‌ర్‌ని త‌ప్ప‌నిస‌రిగా పొందాలి. ఇది ఆయిల్ లీకేజీ, ఏసీ లీకేజీ, మొద‌లైన ఇత‌ర ప్రామాణిక స‌మ‌స్య‌ల నుండి కూడా ర‌క్ష‌ణ ఇస్తుంది.

జీరో డిప్ క‌వ‌ర్:
రోజులు గ‌డిచి కొద్ది కారు విలువ ప‌డిపోతుంది. కొనుగోలు చేసిన మ‌రుస‌టి రోజు అమ్మినా కూడా దాని విలువ క‌నీసం 5% అయినా త‌గ్గుతుంది. అందువ‌ల్ల క్లెయిమ్‌ను దాఖ‌లు చేసేట‌ప్పుడు బీమా సంస్థ‌లు త‌గ్గిపోయిన విలువ‌ను తీసివేసి ప్ర‌స్తుత విలువ‌ ఆధారంగా మీకు ప‌రిహారం చెల్లిస్తాయి. అయితే, బంప‌ర్‌-టు-బంప‌ర్ క‌వ‌ర్‌ని కొనుగోలు చేయ‌డం ద్వారా, కారు చ‌క్రాలు వాటి భాగాల త‌రుగుద‌ల బాధ్య‌త‌ని బీమా కంపెనీకి మ‌ళ్లించ‌వ‌చ్చు. ఇంకా జీరో డిప్రిసియేష‌న్ యాడ్‌-ఆన్ రైడ‌ర్ ఉంటే వాహ‌నానికి 100% క్లెయిమ్ ఉంటుంది. అయితే ట్యూబ్‌లు, బ్యాట‌రీలు, టైర్లు వంటి వాటికి 50% క‌వ‌ర్ ఉంటుంది.

వినియోగ వ‌స్తువ‌ల క‌వ‌ర్:
కారు అనేది 4 చ‌క్రాల దృఢ‌మైన మెట‌ల్ బాడీ. కారు స‌జావుగా న‌డ‌వ‌డానికి బోల్ట్‌లు, కూలెంట్‌, లూబ్రికెంట్‌, గ్రీజు మొద‌లైన వినియోగ వ‌స్తువులు అవ‌స‌ర‌మ‌య్యే క్లిష్ట‌మైన యంత్రం. అందువ‌ల్ల‌, 60 నెల‌ల పాత కారు అయినా స‌రే స‌మ‌గ్ర కారు బీమా పాల‌సీకి వినియోగ వ‌స్తువ‌ల రైడ‌ర్‌ని జోడించ‌డం ద్వారా, వాటి మ‌ర‌మ్మ‌త్తుల స‌మ‌యంలో ఈ భాగాల‌పై అయ్యే ఖ‌ర్చులకు మీరు రీయింబ‌ర్స్‌మెంట్ పొంద‌వ‌చ్చు.

టైర్ ర‌క్ష‌ణ క‌వ‌ర్:
కారు చ‌క్రాల‌పై న‌డుస్తుంది. కాబ‌ట్టి టైర్ మ‌న్నిక‌లో, ర‌క్ష‌ణ‌లో ఎప్పుడూ రాజీప‌డ‌కూడ‌దు. టైర్ ర‌క్ష‌ణ క‌వ‌ర్ కారు చ‌క్రాల‌ను టైర్ పేలుళ్లు, కోత‌లు, రీఫిట్ చేయ‌డానికి లేబ‌ర్ ఛార్జీలు మొద‌లైన వాటి నుండి ర‌క్షిస్తుంది. అలాగే భారీ వ‌ర్షాల స‌మ‌యంలో దృఢ‌మైన వీల్ బ్యాండ్‌ను క‌లిగి ఉండ‌టం చాలా ముఖ్యం. అయితే, ఇది చిన్న పంక్చ‌ర్ మ‌ర‌మ్మ‌త్తులు, త‌యారీ లోపాలు, రీబ్యాలెన్సింగ్‌, టైర్ల అమ‌రిక‌ల‌ను క‌వ‌ర్ చేయ‌దు.

నో-క్లెయిమ్ బోన‌స్ క‌వ‌ర్:
నో క్లెయిమ్ బోన‌స్ (NCB) అనేది బీమా క్లెయిమ్ చేయ‌కుండా వాహ‌నంపై అద‌నపు జాగ్ర‌త్త‌లు తీసుకున్నందుకు బీమా కంపెనీ ఇచ్చే రివార్డ్‌. పాల‌సీ అమ‌లులో ఉన్న‌ వ్య‌వ‌ధిలో ఒక్క క్లెయిమ్‌ను కూడా దాఖ‌లు చేయ‌క‌పోవ‌డం ద్వారా, పాల‌సీని పున‌రుద్ధ‌రించేట‌ప్పుడు బీమా కంపెనీ మీకు ప్రీమియం లో ఆక‌ర్ష‌ణీయ‌మైన త‌గ్గింపు అందిస్తుంది. 5 ఏళ్ళ పాటు ఇలా ఒక్క క్లెయిమ్ కూడా లేకపోతే 50 శాతం వరకు ప్రీమియం లో తగ్గింపు పొందొచ్చు. కానీ మీరు చిన్న క్లెయిమ్ చేసిన‌ప్ప‌టికీ ఈ బోన‌స్ శూన్యం. కాబ‌ట్టి, నో క్లెయిమ్ బోన‌స్ (NCB) ర‌క్ష‌ణ క‌వ‌ర్‌ని ఎంచుకోవ‌డం ద్వారా మీరు క్లెయిమ్ చేసిన‌ప్ప‌టికీ NCB ప్ర‌యోజ‌నం అలాగే ఉంటుంది. ఇది మీకు విలువైన యాడ్‌-ఆన్‌. 

చివ‌రిగా: ఈ వ‌ర్షాకాలం మంచి లేదా చెడ్డ రోడ్ల‌పై కూడా వాహ‌నంపై ప్ర‌యాణించాల్సి రావ‌చ్చు. మీకు, మీ వాహ‌నానికి భ‌ద్ర‌త కీల‌కం కాబ‌ట్టి ఈ వ‌ర్షాకాలంలో సాఫీగా ప్ర‌యాణించేందుకు మీ కారు బీమాకి ఈ యాడ్‌-ఆన్ క‌వ‌ర్‌ల‌ను జోడించ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని