Investments: కొత్త‌గా సంపాద‌న ప్రారంభ‌మైన‌ యువ‌తకి పెట్టుబడుల కోసం 5 మార్గాలు

సంపాద‌న త‌క్కువ‌గా ఉంద‌ని పెట్టుబ‌డుల‌ను వాయిదా వేయ‌కూడ‌దు, కొద్ది మొత్తంతోనైనా మ‌దుపు చేయ‌డం ప్రారంభించాలి. 

Updated : 05 Jan 2022 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త‌గా ఉద్యోగంలో చేరారా? ఎందులో పొదుపు చేయాలో అయోమ‌యంగా ఉందా? అయితే ఈ పెట్టుబ‌డి మార్గాలు ప‌రిశీలించండి. అప్పటివ‌ర‌కు త‌ల్లిదండ్రుల మీద ఆధార‌ప‌డిన యువ‌త‌కు ఉద్యోగంలో చేరి మొద‌టి జీతం అందుకున్న త‌ర్వాత ఆర్థిక స్వాతంత్ర్యం వ‌స్తుంది. దీంతో పాటు కొన్ని బాధ్యతలు వ‌స్తాయి. వాటిని గుర్తించి అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేయ‌కుండా.. ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పొదుపు, పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నించాలే త‌ప్ప సంపాద‌న త‌క్కువ‌గా ఉంద‌ని పెట్టుబ‌డుల‌ను వాయిదా వేయ‌కూడ‌దు. ఆర్థిక ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని.. కొద్ది మొత్తంతోనైనా మ‌దుపు చేయ‌డం ప్రారంభించాలి. కొత్త‌గా పెట్టుబ‌డులు చేసేవారికి స‌రైన ల‌క్ష్యాన్ని గుర్తించ‌డంతోనే ఆర్థిక విజ‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటారు నిపుణులు. ఉద్యోగుల‌కు సంబంధించి ఐదు ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు: కొత్త‌గా ఉద్యోగంలో చేరిన యువ‌త‌కు బాధ్యతలు త‌క్కువ‌గానే ఉంటాయ‌ని చెప్పాలి. నష్ట‌భ‌యాన్ని త‌ట్టుకోగ‌ల‌రు. కాబట్టి కొంత రిస్క్ ఉన్న ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. పెట్టుబ‌డి కూడా నెల‌వారీ క్ర‌మానుగ‌తంగా చేస్తే దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొందొచ్చు. ఏడాదికోసారి డ‌బ్బు మొత్తంగా పెట్టుబ‌డి పెట్టే బ‌దులు సిప్ విధానం మేల‌ని చెప్తారు నిపుణులు. ఈక్విటీ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం ద్వారా పెట్టుడుల‌కు వైవిధ్య‌త ఉంటుంది. లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో న‌ష్ట‌భ‌యం మోస్త‌రుగా ఉండి రాబ‌డి కూడా మెరుగ్గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డి పెట్టడం ద్వారా మార్కెట్లో నెల‌కొన్న అస్థిత‌ర‌త‌ను అధిగమించొచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు/ రిక‌రింగ్ డిపాజిట్లు: స్వల్ప కాలం కోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌ను న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉన్న పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్పొచ్చు. దీని ద్వారా హామీతో కూడిన రాబ‌డి ఉంటుంది. సాధార‌ణ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల కంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌లో వ‌డ్డీ రేటు అధికంగా ఉంటుంది. రిక‌రింగ్ డిపాజిట్ ద్వారా నెల‌నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ అత్య‌వ‌స‌ర నిధికి కావాల్సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. ఈ మొత్తాన్ని ద్ర‌వ్య ల‌భ్య‌త ఎక్కువగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్లు వంటి వాటిలో ఉంచొచ్చు.  

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్): పీపీఎఫ్ భ‌ద్ర‌త క‌లిగిన పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్పొచ్చు. దీని కాలపరిమితి 15 సంవ‌త్స‌రాలు ఉంటుంది. పీపీఎఫ్‌లో పొదుపు చేసిన మ‌దుపు స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌దు గానీ దీర్ఘ‌కాలంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం పీపీఎఫ్ ప‌థ‌కంలో వ‌డ్డీరేటు 7.10 శాతంగా ఉంది. ఈ ప‌థ‌కంలో పొదుపు చేసిన వారికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మదుపు చేయొచ్చు.

పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎన్‌పీఎస్: ఉద్యోగులు కెరీర్ ప్రారంభం నుంచి ప‌ద‌వీ విరమణ కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని పెట్టుబ‌డులు ప్రారంభించాలి. దీనికి జాతీయ పింఛను ప‌థ‌కం (ఎన్‌పీఎస్)లో మ‌దుపు చేయొచ్చు. దీంట్లో పెట్టుబడులు పెట్టేవారికి ప‌న్ను ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ మీకు అప్ప‌టికే ప‌ద‌వీ విర‌మ‌ణకు సంబంధించిన పెట్టుబ‌డులు ఉంటే ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డికి నిర్దిష్ట‌మైన వ్యూహాన్ని అనుస‌రించాలి. దీర్ఘ‌కాలం పాటు పెట్టుబ‌డి చేసేందుకు ఎన్‌పీఎస్ ఉద్దేశించింది. పదవీ విరమణ లక్ష్యాన్ని సాధించడంతో పాటు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇదే కాకుండా ఏడాదికి అదనంగా రూ.50 వేల వరకు మదుపు చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు.

బంగారంలో పెట్టుబ‌డి: ద్రవ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే సురక్షితమైన పెట్టుబ‌డిగా బంగారాన్ని ప‌రిగ‌ణిస్తుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ)లో పెట్టుబడి పెడితే ఏడాదికి 2.50 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలంలో మూల‌ధ‌న వృద్ధిని కూడా పొందొచ్చు. బాండ్ల కాల‌ప‌రిమితి పూర్త‌య్యాక విత్‌డ్రా చేసుకుంటే పన్ను ఉండ‌దు. కాబట్టి, వీటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూల‌ధ‌న వృద్ధి, పన్ను మిన‌హాయింపులు వంటి ప్రయోజనాలు పొందొచ్చు. వేతనదారులు పెట్టుబడిని అలవాటు చేసుకోవాలి. వారు పెట్టుబడిని ప్రారంభించడానికి తగిన ఆదాయం కోసం ఎదురు చూడ‌కుండా సంపాదించే మొత్తంలో కొంత.. బంగారంలో మదుపు చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లో కూడా వీలైనంత మదుపు చేయొచ్చు.

చివ‌రగా: మీకొచ్చే ఆదాయానికి త‌గిన‌ట్ల‌గా సంపాద‌న ప్రారంభ‌మైనప్పటి నుంచి పెట్టుబడులు చేయాలి. అలాగే, జీవిత‌, ఆరోగ్య బీమాల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న ఎండోమెంట్, మనీ బ్యాక్, యులిప్, హోల్ లైఫ్ లాంటి పథకాల నుంచి దూరంగా ఉండండి. పెట్టుబ‌డుల‌కు సంబంధించి తీసుకునే నిర్ణ‌యాల్లో స‌మ‌స్య‌లు లేదా సందేహాలు ఉంటే ఆర్థిక నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని