ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం - ఆర్థిక ఆరోగ్యమెలా?

ఆర్థికంగానూ ఆరోగ్యంగా ఉండ‌ట‌మెలాగో తెలుసుకుందాం​​​​​​...

Published : 21 Dec 2020 13:14 IST

ఆర్థికంగానూ ఆరోగ్యంగా ఉండ‌ట‌మెలాగో తెలుసుకుందాం

7 ఏప్రిల్ 2018 మధ్యాహ్నం 4:27

ఒక మ‌నిషి శారీర‌కంగా, మాన‌సికంగా, సామాజికంగా, భావోద్వేగ ప‌రంగా, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే అత‌ను ఆరోగ్య‌వంతుడ‌నిపించుకుంటాడు. ఈ ఐదు ల‌క్ష‌ణాలు ఒక‌దానికొక‌టి ముడిప‌డి ఉంటాయి. ఎలాంటి చీకూ చింత లేన‌ప్పుడే ఒక వ్య‌క్తి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండ‌గ‌ల‌డు. ఆర్థికంగా ఇబ్బందులున్న‌ప్పుడు ఆ వ్య‌క్తికి శారీర‌కంగా, మాన‌సికంగా, భావోద్వేగ‌ప‌రంగా, సామాజికంగానూ ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఈ రోజు ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం సంద‌ర్భంగా మీ ఆర్థిక ఆరోగ్యం బాగుండేలా కృషి చేయండి.

ఆరోగ్యం, ఆనందం

మ‌నిషి ఆనందంగా ఉండ‌టంలో డ‌బ్బు కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌న్న‌ది నిజ‌మే. ప్ర‌తీ ఒక్క వ్య‌క్తికి ఇల్లు కొన‌డం, కారు కొన‌డం, పిల్ల‌ల‌కు మంచి చ‌దువులు చెప్పించాల‌నీ, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా అత్యున్న‌త జీవితం గ‌డపాల‌ని, ప్ర‌పంచ‌మంతా చుట్టి రావాల‌నే ల‌క్ష్యాలుంటాయి. అయితే ఈ ఆర్థిక లక్ష్యాల‌ను సాధించాలంటే ప్ర‌ణాళిక ముఖ్యం. అయితే మీ సంపాద‌న‌, ప్రాధాన్య‌తా క్ర‌మం, స‌మ‌యం ఆధారంగా ఈ ల‌క్ష్యాల‌ను గుర్తించి వాటికోసం త‌గిన పెట్టుబ‌డుల‌ను పెట్టండి. ఈ ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో మీ పెట్టుబ‌డుల‌ను త‌ర‌చుగా స‌మీక్షిస్తుండండి.

ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు

అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోండి

ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న కోసం ఎంత ప్రణాళిక‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ, ఉద్యోగం కోల్పోవ‌డం, ఊహించ‌ని ప్ర‌మాదాల కార‌ణంగా ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురు కావ‌చ్చు. ఇలాంటి ప‌రిస్థితుల‌నెదుర్కోవ‌డానికి మీకంటూ ఒక అత్య‌వ‌స‌ర నిధి ఉండ‌టం ముఖ్యం. ఆరు నెల‌ల అవ‌స‌రాల‌కు స‌రిప‌డా మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా ఉంచుకోవ‌డం మంచిది. ఈ నిధి కోసం లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేయండి. ఇత‌ర ఖ‌ర్చుల కోసం ఇందులోని డ‌బ్బుల‌ను వెచ్చించ‌కండి.

ఖ‌ర్చుల కోసం గాక‌ పొదుపు కోసం బ‌డ్జెట్ త‌యారు చేసుకోండి.

ఖ‌ర్చుల కోసం కాకుండా పొదుపు కోసం బ‌డ్జెట్‌ను రూపొందించుకోండి. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు డ‌బ్బు వృధా చేయకుండా, ఆర్థిక ల‌క్ష్యాల‌క‌నుగుణంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం మొద‌టి ప్రాధాన్య‌త‌గా గుర్తించండి.

అధిక రిస్క్ క‌వ‌రేజీని క‌లిగి ఉండండి

సంప‌ద‌తో సంబంధం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రు ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో వైద్య ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిన సంగ‌తి మీకు తెలిసిందే. దీంతో పాటు మీ పై ఆధార‌ప‌డ్డ‌వారు ఇబ్బందులెదుర్కోకుండా ఉండేందుకు బీమా తీసుకోవ‌డం మంచిది. మీ కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాలు, అప్పులు తదిత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకొని త‌గిన ట‌ర్మ్ పాల‌సీ తీసుకోండి. సాంప్ర‌దాయ ప‌థ‌కాలు, యూలిప్స్ ల‌లో ప్రీమియం అధికంగా ఉండ‌ట‌మే గాక హామీ మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది.

ఆర్థిక నిపుణ‌ల పాత్ర ఎంత‌?

చాలా తెలివైన, విజ‌య‌వంత‌మైన వ్య‌క్తులు సైతం ఆర్థిక విష‌యాల ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి వైఫ‌ల్యం చెందుతూ ఉంటారు. ఆర్థిక విష‌యాల ప‌ట్ల శ్ర‌ద్ధ చూప‌క‌పోవ‌డం, త‌గినంత స‌మ‌యం కేటాయించలేక‌పోవ‌డం దీనికి ముఖ్య కార‌ణాలు. ప‌ని ఒత్తిడి అధికంగా ఉండే న‌గ‌రాల్లోని ప్ర‌జ‌ల్లో ఈ స‌మ‌స్య మ‌రింత అధికం. ఇలాంటి సంద‌ర్భాల‌లో స‌రైన ఆర్థిక నిపుణుడి తోడ్పాటు ఉంటే మీ ఆర్థిక జీవితం బాగుంటుంది.

మంచి ఆర్థిక నిపుణుడు ఒక మంచి వైద్యుడి లాంటివాడు. మీ లక్ష్యాలు, విలువ‌లకు త‌గ్గ‌ట్లుగా మీ అల‌వాట్ల‌ను మార్చి ల‌క్ష్యాల‌ను అందుకునేలా త‌గిన తోడ్పాటునందిస్తాడు. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఎలా చేరుకోవాలో రోడ్ మ్యాప్ గీసి అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తాడు. అంతిమంగా మీరు ఇబ్బందులెదుర్కోకుండా స‌హాయ‌ప‌డ‌తాడు.

మంచి ఆర్థిక నిపుణుడిని గుర్తించ‌డ‌మెలా

మంచి ఆర్థిక నిపుణుడిని గుర్తించ‌డం స‌వాల్‌తో కూడుకున్న‌ది. ఈ విష‌యంలో బ్యాంకులు, బ్యాంకిగేత‌ర ఆర్థిక సంస్థల ఏజెంట్లు, వెల్త్ మేనేజ‌ర్లు మీకు తోడ్పాటునందిస్తామ‌ని ముందుకు రావ‌చ్చు. కానీ పేరు, బ్రాండ్‌ని చూసి మోస‌పోవ‌ద్దు. చాలా కంపెనీల ల‌క్ష్యం వారి ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌ను పెంచుకోవటమే.

మ‌రి మంచి ఆర్థిక నిపుణుడిని గుర్తించ‌డ‌మెలా. అత‌డు ఈ కింద వివ‌రించిన మూడు ల‌క్ష‌ణాల‌ను త‌ప్ప‌క క‌లిగి ఉండాలి.

  1. మీ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా అవ‌స‌ర‌మైన స‌మ‌చారాన్ని వివ‌రంగా, స‌మ‌గ్రంగా త‌యారు చేసి ఇచ్చి మీకు తోడ్ప‌డ‌తాడు.
  2. మీకు వ‌చ్చే రాబ‌డులు, అందుకోసం తీసుకోవాల్సిన రిస్క్ ల గురించి విపులంగా మీతో చ‌ర్చించ‌గ‌లుగుతాడు.
  3. కేవ‌లం ఉత్ప‌త్తి, పెట్టుబ‌డుల స‌ల‌హాలతో మాత్ర‌మే ఆగ‌కుండా, మీ ఆర్థిక ప్ర‌ణాళిక నిరంత‌రం కొన‌సాగేలా చూడ‌టంలో మీకు స‌హాయ‌ప‌డ‌తాడు.

ఈ ప్ర‌పంచ ఆరోగ్య దినోత్సవ సంద‌ర్భంగా మీరు ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా ఎలాంటి చీకూ చింత లేకుండా హాయిగా ఉండాల‌ని కోరుకుంటున్నాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని