WhatsApp scam: ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయా? జాగ్రత్త!

WhatsApp scam: ఈ మధ్య ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌, మెసేజ్‌లు ఎక్కువయ్యాయి. అయితే, అవి మోసపూరితమైనవి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Updated : 08 May 2023 16:52 IST

WhatsApp scam | ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో చాలా మంది సాధారణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారానే సందేశాలను పంపించుకునేవారు. కానీ, అనవసర మెసేజ్‌లు, మోసపూరిత సందేశాలు ఎక్కువవడంతో వాటికి స్వస్తి పలికారు. వాట్సాప్‌ (WhatsApp)లో ఆ బెడద లేకపోవడంతో అందరూ ఈ వేదికను వాడుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఇటీవల వాట్సాప్‌ (WhatsApp)లోనూ స్కామ్‌ మెసేజ్‌లు, కాల్స్‌ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా గత వారం, పదిరోజుల్లో భారీ ఎత్తున ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి మెసేజ్‌లు, కాల్స్‌ వస్తున్నాయి.

లాటరీలు, లోన్‌లు, ఉద్యోగావకాశాల పేరిట ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి వాట్సాప్‌ (WhatsApp) సందేశాలు, కాల్స్‌ వస్తున్నాయి. మలేషియా, కెన్యా, వియత్నాం, ఇథియోపియా సహా పలు ఇతర దేశాలకు చెందిన ఐఎస్‌డీ కోడ్‌లతో మోసగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. ఇది ఓ పెద్ద స్కామ్‌ అని.. వీటికి ఎవరూ స్పందించొద్దని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే, మోసగాళ్ల చేతికి తమ నంబర్లు ఎలా చిక్కాయని వాట్సాప్‌ (WhatsApp) యూజర్లు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మెసేజ్‌లు, కాల్స్‌ వెనకున్న అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పటి వరకైతే గుర్తించలేదు. కానీ, వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును దోచుకోవడమే లక్ష్యమై ఉంటుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాట్సాప్‌ VoIP నెట్‌వర్క్‌ ద్వారా పనిచేస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశం నుంచైనా అదనపు ఛార్జీలు లేకుండానే కాల్‌ చేయొచ్చు. మెసేజ్‌లు పంపొచ్చు. అందుకే మోసగాళ్లు అంతర్జాతీయ నంబర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, ఇంటర్నేషనల్‌ నంబర్ల నుంచి కాల్‌ లేదా మెసేజ్ వచ్చినంత మాత్రాన అది కచ్చితంగా అంతర్జాతీయ నంబర్‌ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య చాలా ఏజెన్సీలు వాట్సాప్‌ (WhatsApp) కాల్‌, మెసేజ్‌ల కోసం మనముంటున్న సొంత నగరంలోనే అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. అందుకే తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని