డౌన్‌లోడ్‌కు BGMI రెడీ.. ఆడేందుకు ఇకపై టైమ్‌ లిమిట్‌

BGMI Relaunched in India: బీజీఎంఐ దేశంలోకి రీఎంట్రీ ఇచ్చింది. డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి వచ్చింది.

Published : 29 May 2023 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ మల్టీ ప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆండ్రాయిడ్‌ (Android), ఐఓఎస్‌ (iOS) స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్ల నుంచి ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దాదాపు ఏడాది తర్వాత గేమింగ్‌ లవర్స్‌కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో.. సదరు గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ కొన్ని మార్పుల చేసింది. ఆడేందుకు టైమ్‌ లిమిట్‌ పెట్టింది.

బీజీఎంఐను ఇంతకుముందులా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు ఆడడానికి వీల్లేదు. 18 ఏళ్ల వయసులోపు వారు ఇకపై రోజులో మూడు గంటలు మాత్రమే ఆడేందుకు వీలుపడుతుందని క్రాఫ్టన్‌ తెలిపింది. 18 ఏళ్లు పైబడిన వారు గరిష్ఠంగా ఆరు గంటల పాటు గేమ్‌ ఆడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు 18 ఏళ్లలోపు వయసు గేమర్స్‌కు పేరెంటల్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపింది. అలాగే, ఒకవేళ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాకపోవచ్చని క్రాఫ్టన్‌ తెలిపింది. రానున్న 48 గంటల్లో దశలవారీగా యూజర్లకు గేమ్‌ అడేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.

పబ్‌జీ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్‌.. గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్‌ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గేమింగ్‌ కంపెనీ సర్వర్‌ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించినందున మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్‌ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బీజీఎంఐని అందుబాటులోకి తెచ్చిన క్రాఫ్టన్‌ సంస్థ.. దీనికి ఆడేందుకు టైమ్‌ లిమిట్‌ తీసుకొచ్చింది. అలాగే, గేమ్‌కు సంబంధించి మ్యాపులు, వెపన్స్‌లో కొన్ని మార్పులు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని