BGMIకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలో అందుబాటులోకి!

BGMI to resume operations in India: పాపులర్‌ గేమ్‌ బీజీఎంఐకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Published : 19 May 2023 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మల్టీప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. పబ్‌జీ తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న ఈ గేమ్‌.. గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతానికి మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

గేమింగ్ కంపెనీ సర్వర్ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించినందున మూడు నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు రాజీవ్‌ చంద్రశేఖర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. యూజర్లపై ప్రభావం, ఎడిక్షన్‌ వంటి అంశాలను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రం ఆమోదం నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్‌ సంస్థ క్రాఫ్టన్‌ తెలిపింది.

సరిహద్దుల్లో ఘర్షణ అనంతరం చైనాకు చెందిన యాప్స్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్‌జీపై నిషేధం విధించింది. దీంతో దక్షిణ కొరియాకు చెందిన గేమింగ్‌ కంపెనీ క్రాఫ్టన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) పేరిట గేమ్‌ను తీసుకొచ్చింది. అయితే, చైనాకు చెందిన టెన్సెంట్‌తో క్రాఫ్టన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ భారత్‌కు చెందిన ప్రహార్‌ అనే ఎన్జీవో ఆరోపించింది. ఈ ఆరోపణలను క్రాఫ్టన్‌ అప్పట్లో తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే బీజీఎంఐపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో యాప్‌ స్టోర్ల నుంచి ఈ గేమ్‌ కనుమరుగైంది. నిషేధం నాటికి ఈ గేమ్‌కు 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ ఉన్నాయి. మళ్లీ ఏడాది తర్వాత అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని