Updated : 15 Aug 2022 17:38 IST

Bharat Biotech: భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా విజయవంతం

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ నుంచి రక్షణ కోసం ఉద్దేశించిన నాసల్‌ వ్యాక్సిన్‌ ‘బీబీవీ154’ను భారత్‌ బయోటెక్‌ విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ టీకా పూర్తిగా సురక్షితమైందని, వ్యాధినిరోధక శక్తిని సమర్థంగా ప్రేరేపిస్తోందని వెల్లడించింది. కొన్ని మార్పులు చేసిన అడినోవైరస్‌ వెక్టార్‌ సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ‘వాషింగ్టన్‌ యూనివర్శిటీ ఇన్‌ సెయింట్‌ లూయిస్‌’ భాగస్వామ్యంతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు వివరించింది. ఈ టీకాను నాసికా రంధ్రాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రయోగ ఫలితాలను ఔషధ నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు వెల్లడించింది. 

ముఖ్యంగా పేద, మధ్యతరగతి దేశాలకు అతి తక్కువ వ్యయంతో టీకాను అందించాలనే లక్ష్యంతో ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సాయంతో భారత ప్రభుత్వం ఈ టీకా అభివృద్ధి, ప్రయోగాలకు సహకరించినట్లు వివరించింది. బీబీవీ154 టీకాను ప్రాథమిక డోస్‌గా, బూస్టర్‌ డోస్‌గా వినియోగించడంపై వేర్వేరుగా ప్రయోగాలను నిర్వహించారు. ఈ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద భద్ర పర్చి సులభంగా రవాణా చేయవచ్చు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీబీవీ154 టీకా విజయవంతమైందని ప్రకటించినందుకు గర్వపడుతున్నామని భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా పేర్కొన్నారు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని