Bharat NCAP: మన కార్లకు స్టార్ రేటింగ్‌ ఎప్పటి నుంచంటే..?

కార్లలోని ప్రయాణికుల భద్రతకు హామీనిచ్చేలా ప్రతిపాదించిన కొత్త కారు మదింపు పథకం అయిన భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP) రేటింగ్‌ను ఏప్రిల్‌ 1, 2023 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది....

Published : 25 Jun 2022 17:37 IST

దిల్లీ: కార్లలోని ప్రయాణికుల భద్రతకు హామీనిచ్చేలా ప్రతిపాదించిన కొత్త కారు మదింపు పథకం ‘భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP)’ రేటింగ్‌ను ఏప్రిల్‌ 1, 2023 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కేటగిరీ ఎం1 (డ్రైవర్‌ సీటు కాకుండా అదనంగా ఎనిమిది సీట్లు ఉండి ప్రయాణికుల నిమిత్తం ఉపయోగించే వాహనాలు) వాహనాలకు భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat NCAP) విధానాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపింది.

ఈ కొత్త పద్ధతి అమల్లోకి వస్తే కార్లలో ఉండే ప్రయాణికులకు ఎంత వరకు భద్రత లభిస్తుందనే విషయంపై ముందే ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. క్రాష్‌ టెస్టింగ్‌ (crash tests)కు సరైన మౌలిక సదుపాయాలు ఉన్న కేంద్రాల్లోనే రేటింగ్‌ నిర్ధారిస్తారని తెలిపింది. ఇప్పటి వరకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌, యూరో ఎన్‌క్యాప్‌ ప్రమాణాలే ఇందుకోసం ఉన్నాయి. క్రాష్‌ పరీక్షల ఆధారంగా ఇచ్చే ఈ స్టార్‌ రేటింగ్‌ (Star Ratings) వల్ల కార్లలోని ప్రయాణికుల భద్రతకు హామీనివ్వడమే కాకుండా.. భారత వాహనాల ఎగుమతి విలువనూ పెంచగలమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అంతర్జాతీయ క్రాష్‌ టెస్ట్‌ నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చిన భారత్‌ ఎన్‌క్యాప్‌ ప్రమాణాలను కంపెనీలు పాటించాల్సి ఉంటుందన్నారు.

భారత్‌లోని సొంత పరీక్షా కేంద్రాల్లో, కంపెనీలు తమ వాహనాలను పరీక్షించాల్సి ఉంటుందని గడ్కరీ అన్నారు. భారత్‌ ఎన్‌క్యాప్‌ మన వాహన పరిశ్రమలో ఆత్మనిర్భరతను తీసుకురావడమే కాకుండా.. ప్రపంచంలో భారత్‌ను అగ్రగామి వాహన కేంద్రంగా నిలబెట్టగలదని ఆయన అన్నారు. వాహనాలకు 1-5 వరకు స్టార్‌రేటింగ్‌ ఇస్తారు. 2020లో మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 1,31,714 మరణాలు సంభవించాయి. 2024 కల్లా రోడ్డు ప్రమాదాల్లో మరణాలను 50 శాతం తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఇటీవలే గడ్కరీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని