BharatPe: భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా

BharatPe CEO quits: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నలిన్‌ నేగిని తాత్కాలిక సీఈఓగా బోర్డు నియమించింది.

Published : 03 Jan 2023 13:50 IST

దిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ భారత్‌పే (BharatPe) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (CEO) పదవికి సుహైల్‌ సమీర్‌ (Suhail Sameer) రాజీనామా చేశారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌తో గతంలో విభేదించిన సమీర్‌.. తాజాగా తన పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. జనవరి 7 నుంచి సీఈఓ పదవి నుంచి వైదొలిగి.. అదే రోజు నుంచి వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగనున్నారని భారత్‌ పే పేర్కొంది.

కంపెనీ కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు వీలుగా ప్రస్తుతం సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తున్న నలిన్‌ నేగిని తాత్కాలిక సీఈఓగా నియమిస్తున్నట్లు భారత్‌పే తెలిపింది. మరోవైపు కొత్త సీఈఓ కోసం అన్వేషణలను బోర్డు కొనసాగిస్తోంది. ఫిన్‌టెక్‌ విభాగంలో భారత్‌పేను అత్యున్నత స్థానంలో నిలిబెట్టడంలో సుహైల్‌ శక్తివంచన లేకుండా కృషి చేశారని, అందుకు బోర్డు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు భారత్‌పే బోర్డు ఛైర్మన్‌ రజ్‌నీశ్‌ కుమార్‌ తెలిపారు.

2022 ప్రారంభం నుంచి భారత్‌పే తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నైకా ఐపీఓ విషయంలో కోటక్‌ గ్రూప్‌ ఉద్యోగి పట్ల కంపెనీ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ అసభ్య పదజాలం ఉపయోగించడం అప్పట్లో వివాదాస్పదమైంది. తర్వాత నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గ్రోవర్‌తో పాటు ఆమె భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌ కంపెనీని వీడారు. అక్కడికి కొద్ది రోజులకే మరో సహ వ్యవస్థాపకుడు భవీక్‌ కొలాడియా సైతం కంపెనీ నుంచి నిష్క్రమించారు. అనంతరం పలువురు ఉన్నతస్థాయి ఉద్యోగులు సైతం కంపెనీని వీడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని