Banking Crisis: మరో సంక్షోభం రాకుండా.. అమెరికన్‌ బ్యాంకులన్నీ ఏకతాటిపైకి!

Banking Crisis: పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు అమెరికాలోని 11 బడా బ్యాంకులు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. తద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

Published : 17 Mar 2023 18:15 IST

న్యూయార్క్‌: సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ పతనం అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ (American banking system)ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అక్కడ మరికొన్ని బ్యాంకులూ అదే బాటలో ఉన్నాయనే వార్తలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారింది. ఐరోపాలో క్రెడిట్‌ సూయిజ్‌ కూడా ఇదే తరుణంలో ప్రమాద ఘంటికలు మోగించడంతో ఆందోళన తీవ్రమైంది. మరోసారి 2008 నాటి లేమన్‌ బ్రదర్స్‌ స్థాయి సంక్షోభం తలెత్తుతుందోననే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికాలోని 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి. ఈ బ్యాంకులో కూడా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్ తరహాలో టెక్‌, అంకుర సంస్థల డిపాజిట్లే అధికంగా ఉన్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ బ్యాంకులో 176.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, బ్యాంకింగ్‌ వ్యవస్థపై వస్తున్న వదంతులతో ఖాతాదారులు ఇటీవల భారీ ఎత్తున నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ద్రవ్య లభ్యత సమస్య ఏర్పడి దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.

2008 ఆర్థిక సంక్షోభం ఆరంభంలోనూ బ్యాంకులు ఇలాగే ఏకతాటిపైకి వచ్చి బలహీనంగా ఉన్న బ్యాంకులను ఆదుకునేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని బడా బ్యాంకులు ఇతర బ్యాంకులను కొనుగోలు చేసి సంక్షోభం మరింత ముదరకుండా చర్యలు తీసుకున్నాయి. కానీ, అప్పటికే పరిస్థితి చేదాటడంతో సంక్షోభం అనివార్యమైంది.

ఫస్ట్‌ రిపబ్లిక్‌లో అనేక మంది బిలియనీర్లు ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారందరికీ ఈ బ్యాంకు సులభమైన షరతులతో సేవలందిస్తోన్నట్లు తెలుస్తోంది. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం ఈ బ్యాంకులో తనఖా రుణం తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. బ్యాంకు షేరు గురువారం ఓ దశలో 36 శాతం నష్టపోయింది. కానీ, 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటన నేపథ్యంలో తిరిగి పుంజుకుంది. చివరకు 10 శాతం లాభంతో ముగిసింది

ఫస్ట్‌ రిపబ్లిక్‌కు  నిధులు సమకూరుస్తున్న వాటిలో జేపీ మోర్గాన్‌ చేజ్‌, బ్యాంక్ ఆఫ్‌ అమెరికా, సిటీ గ్రూప్‌, వెల్స్‌ ఫార్గో, మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మన్‌ శాక్స్‌, బీఎన్‌వై మెలన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, పీఎన్‌సీ బ్యాంక్‌, ట్రుయిస్ట్‌, యూఎస్‌ బ్యాంక్‌ ఉన్నాయి. ఇవన్నీ ఒకే వేదిక మీదరకు రావడం.. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో సూచిస్తోందని సంయుక్త ప్రకటనలో ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు