Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్‌.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!

స్టాక్‌ మార్కెట్‌లో విజయవంతంగా కొనసాగేందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) పలు సందర్భాల్లో చెప్పిన విజయ సూత్రాలను ఓసారి చూద్దాం.

Published : 15 Aug 2022 01:25 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రారంభంలో రూ.5వేలతో వ్యాపారం మొదలుపెట్టిన ఆయన.. ప్రస్తుతం రూ.40వేల కోట్ల సంపదను సమకూర్చుకున్నారు. అందుకే స్టాక్‌ మార్కెట్లో మదుపుచేసే వారికి, కలల్ని నిజం చేసుకోవాలనుకునే వారికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌లో ముందుకు పయనించేందుకు పలు సందర్భాల్లో ఆయన చెప్పిన విజయ సూత్రాలను ఓసారి చూద్దాం.

  • విజయవంతమైన మదుపరిగా ఎదగాలంటే మొదట కొన్ని తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకోవాలి.
  • మార్కెట్లే సుప్రీం అని నమ్మనంతకాలం.. మీరు తప్పు చేశారు అనే విషయాన్ని ఒప్పుకోలేరు. ఇలా మీ తప్పును ఒప్పుకోకపోతే.. మీరు ఎన్నటికీ నేర్చుకోలేరు. స్టాక్‌ మార్కెట్లో విజయవంతం కావాలంటే తప్పుల నుంచి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. కానీ, అందుకు తనది మాత్రమే (స్వీయ) బాధ్యత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • కంపెనీల ప్రమోటర్లను నేను ఎన్నడూ నిందించను. నాకు నేను మాత్రమే నిందించుకుంటాను. ప్రమోటర్‌ ఆయన కోణంలో ఆయన ఆలోచిస్తారు. అనుకున్న స్థాయిలో ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనే విషయాన్ని మనమే గుర్తించాలి.
  • విజయానికి షార్ట్‌కర్ట్‌లు లేవు. విజయవంతమైన మదుపరిగా మారాలంటే ఎప్పటికప్పుడు మార్కెట్‌పైన పూర్తి అవగాహనతో ఉండాలి.
  • ఇలా భారీ లాభాలను పొందే క్రమంలో పేదలకు ఆపన్నహస్తం అందించాలని ఝున్‌ఝున్‌వాలా భావిస్తుండేవారు. ఇందుకోసం ఓ ట్రస్టుని కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఇలా చేస్తే ఏదో మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనతో మాత్రం అలా చేయవద్దంటారు ఈ దిగ్గజ స్టాక్‌ బ్రోకర్‌.
  • స్టాక్‌మార్కెట్‌పై ఝున్‌ఝున్‌వాలాకు ఉన్న అవగాహన, పెట్టుబడులపై అపరిమిత పరిజ్ఞానం ఆయన వాటాదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

ఝున్‌ఝున్‌వాలా చెప్పిన మరికొన్ని సూక్తులు..

  1. స్థిరమైన మనస్తత్వం లేకుండా మీరు విజయం సాధించలేరు
  2. మార్కెట్లు మహిళల వంటివి. ఎల్లప్పుడూ గంభీరంగా, మిస్టరీగా, ఊహించని విధంగా, చంచలంగానూ ఉంటాయి.
  3. పోరాట స్ఫూర్తిని అలవరచుకోండి. చెడును కూడా మంచిగా భావించండి.
  4. నష్టాలకు ముందుగానే సిద్ధమై ఉండండి. ఇన్వెస్టర్ల జీవితాల్లో నష్టాలనేవి భాగం.
  5. ఎల్లప్పుడు అలలకు ఎదురీదండి. ఇతరులు అమ్ముతున్నప్పుడు కొనండి. అదే సమయంలో ఇతరులు కొంటున్నప్పుడు షేర్లు అమ్మేయండి.
  6. అవకాశాలు టెక్నాలజీ రూపంలోనో, మార్కెటింగ్‌, బ్రాండ్లు, క్యాపిటల్‌ రూపంలోనో వస్తుంటాయి. అటువంటి వాటిని వెంటనే గుర్తించే స్థానంలో ఉండాలి.
  7. ప్రపంచాన్ని నీ కోణంలో చూడడం కంటే వాస్తవంగా ఎలా ఉందో అలానే చూడు.
  8. నష్టాలను ఎదుర్కొని.. తప్పుల నుంచి నేర్చుకోండి.
  9. అనవసరపు అంచనాలతో పెట్టుబడి పెట్టకండి. పేరొందిన కంపెనీల జోలికి ఎన్నడూ వెళ్లకండి.
  10. ఈపీఎస్‌ను (Earnings per share) అంచనా వేయడం శాస్త్రీయతతో కూడుకున్నది. అందులో ‘ఆర్ట్‌’ పాత్ర స్వల్పమే. అదే పీఈఆర్‌ (Price to Earnings Ratio) విషయానికొస్తే పూర్తిగా నైపుణ్యంతో కూడుకున్నది. ఇది వంట, శృంగారం వంటిది. వీటిని ఎవరూ బోధించరు, మనమే నేర్చుకోవాలి. విజయవంతమైన పెట్టుబడుల్లో పీఈఆర్‌లను అర్థం చేసుకోవడం, అంచనా వేయడమే అత్యంత కీలకమైన అంశం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని