
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ, తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయంటే?
దిల్లీ: నీతి ఆయోగ్ ‘మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ)’ ప్రకారం దేశంలో బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ అత్యంత పేద రాష్ట్రాలుగా నిలిచాయి. బిహార్‌లో 51.91 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఝార్ఖండ్‌లో 41.16 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 37.79 శాతం, మధ్యప్రదేశ్ 36.65 శాతం, మేఘాలయ 32.67 శాతం మంది ప్రజలు పేదరికంలో ఉన్నట్లు ఎంపీఐ సూచీ తెలిపింది. ఇక తక్కువ పేదిరకం ఉన్న రాష్ట్రాల్లో కేరళ(0.71%), గోవా(3.76%), సిక్కి(3.82%), తమిళనాడు(4.89%), పంజాబ్(5.59%) ఉన్నాయి. ఈ జాబితాలో 12.31% మంది పేదలతో ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో నిలవగా.. 13.74% మంది పేదలతో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది.
ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్(ఓపీహెచ్‌ఐ), యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(యూఎన్‌డీపీ) సంయుక్తంగా రూపొందించిన పద్థతినే ఎంపీఐ మదింపునకు ఉపయోగించినట్లు నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం ఉందని తెలిపింది. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలను సూచించే.. పోషకాహారం, శిశు మరణాలు, పూర్వ ప్రసూతి సంరక్షణ, పాఠశాల విద్య, పాఠశాల హాజరు, వంటకు వాడే ఇంధనం, తాగునీరు, విద్యుత్తు, ఆవాసం, ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపీఐని లెక్కించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.
పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాలకు ఎంపీఐ ప్రయోజనకరంగా ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. విధానాల రూపకల్పనకు ఇవి ఆధారసహిత గణాంకాలను అందజేస్తాయన్నారు. 2015-16 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)ను ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
► Read latest Business News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.