Bikaji Foods IPO: బికజీ ఫుడ్స్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.285-300

బికజీ ఫుడ్స్‌ ఐపీఓ నవంబరు 3న ప్రారంభమై 7న ముగియనుంది. ఈ కంపెనీ తయారు చేస్తోన్న బికనెరీ భుజాకు జీఐ ట్యాగ్‌ ఉండడం విశేషం.

Published : 31 Oct 2022 15:59 IST

దిల్లీ: ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ బికజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓ ధరల శ్రేణిని రూ.285-300గా నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో గరిష్ఠ ధర వద్ద మొత్తం రూ.881 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ నవంబరు 3న ప్రారంభమై 7న ముగియనున్న విషయం తెలిసిందే. జేఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఇన్‌టెన్సివ్‌ ఫిస్కల్‌ సర్వీసెస్, కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఈ ఇష్యూలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద మాత్రమే షేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రమోటర్లు శివ్‌ రతన్‌ అగర్వాల్‌, దీపక్‌ అగర్వాల్‌ చెరో 25 లక్షల చొప్పున షేర్లను విక్రయించనున్నారు. ఇందులో వాటాదారులుగా ఉన్న మరికొన్ని సంస్థలు కూడా తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రముఖ బికనెరీ భుజాను ఈ కంపెనీయే తయారు చేస్తోంది. ఏటా 29,380 టన్నుల భుజాను విక్రయిస్తోంది. రసగుల్లా, సోన్‌ పాపడీ, గులాబ్‌ జామూన్‌ ఉత్పత్తిలోనూ ఇది అగ్రగామిగా కొనసాగుతోంది. 2010లో బికనెరీ భుజాకు జీఐ ట్యాగ్‌ ఇవ్వడం విశేషం. బికనేర్‌లో కుటీర పరిశ్రమలపై ఆధారపడ్డ అనేక మందికి ఇది ఉపాధి కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని