Bill Gates: మోదీతో మాట్లాడాక.. మరింత ఆశతో ఉన్నా: బిల్‌గేట్స్‌

ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత.. పలు రంగాల్లో భారత్‌ సాధిస్తోన్న పురోగతిపై మరింత ఆశావహ దృక్పథంతో ఉన్నానని ప్రముఖ టెక్‌ దిగ్గజం బిల్‌గేట్స్‌ (Bill Gates) అన్నారు. భారత్‌ ఈ పురోగతి ఇలాగే కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 04 Mar 2023 13:57 IST

దిల్లీ: టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. అన్ని రంగాల్లో దేశం పురోగతి చెందుతోందని, సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి అద్భుతాలు సాధించగలమో చెప్పేందుకు ఈ దేశమే నిదర్శనమని కొనియాడారు. దిల్లీ పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. ఆ భేటీ గురించి గేట్స్‌ తన అధికారిక బ్లాగ్‌ ‘గేట్స్‌ నోట్స్‌’లో రాసుకొస్తూ.. భారత్‌ (India)పై పొగడ్తల వర్షం కురిపించారు.

‘‘ప్రపంచమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో.. భారత్‌ (India) లాంటి ఓ సృజనాత్మక, డైనమిక్‌ దేశాన్ని సందర్శించడం ఎంతగానో స్ఫూర్తి కలిగిస్తోంది. భారత్‌.. ఎంతో సమర్థమైన, భద్రమైన, అందుబాటు ధరల్లో ఉండే అనేక వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసింది. ఆ వ్యాక్సిన్లు కరోనా సమయంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడటమే గాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాధుల వ్యాప్తిని కూడా నివారించాయి. ఈ వ్యాక్సిన్లను భారత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర దేశాలకు అందించి స్నేహబంధాన్ని చాటుకుంది. కొవిన్‌ యాప్‌.. ప్రపంచానికి ఓ మోడల్‌ అవుతుందని ప్రధాని మోదీ విశ్వసించారు. దాన్ని నేనూ అంగీకరిస్తున్నా’’ అని గేట్స్‌ (Bill Gates) కొనియాడారు.

ఈ సందర్భంగా భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ టెక్నాలజీ గురించి బిల్‌గేట్స్‌ ప్రస్తావించారు. సాంకేతికతతో ప్రభుత్వం పనితీరు మెరుగవుతుందని చెప్పేందుకు గతిశక్తి ఉత్తమ ఉదాహరణ అని అన్నారు. ఇక, జీ-20 (G-20) సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించడంపై స్పందిస్తూ.. ‘‘దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచం ఎలా ప్రయోజనం పొందొచ్చే చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం’’ అని ప్రశంసించారు.

‘‘ప్రధానితో మాట్లాడిన తర్వాత.. ఆరోగ్యం, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్‌ (India) సాధిస్తోన్న పురోగతి గురించి గతంలో కంటే మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నా. మనం సృజనాత్మకత రంగంలో పెట్టుబడులు పెడితే ఏం సాధించగలమో భారత్‌ నిరూపిస్తోంది. ఈ పురోగతి ఇలాగే కొనసాగాలని, భారత్‌ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నా’’ అంటూ గేట్స్‌ (Bill Gates) తన బ్లాగ్‌ను ముగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని