Bill Gates: గూగుల్‌, అమెజాన్‌ వంటి వాటికి ఆ టెక్నాలజీతో చెక్‌: బిల్‌ గేట్స్‌

పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌లు వినియోగంలోకి వస్తే.. యూజర్లు సెర్చ్‌ ఇంజిన్‌లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ల గురించి మర్చిపోతారని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (Bill Gates) అభిప్రాయపడ్డారు.

Published : 23 May 2023 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత సాంకేతిక యుగంలో యూజర్‌ అవసరాలకు తగినట్లుగా కృత్రిమ మేధ (AI)ను రూపొందించిన సంస్థలకు మంచి ఆదరణ ఉంటుందని మైక్రోసాఫ్ట్ (Microsoft) వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ (Bill Gates) అన్నారు. ఏఐ డిజిటల్‌ ఏజెంట్‌, పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌ వంటి వాటికి యూజర్ల నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఏదైనా కంపెనీ అలాంటి సాంకేతికతను పరిచయం చేస్తే యూజర్లు గూగుల్, అమెజాన్‌ వంటి వాటిని ఉపయోగించడం ఆపేస్తారని అభిప్రాయపడ్డారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్‌ నిర్వహించిన ఏఐ ఫార్వార్డ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌ రేస్‌లో ఎవరైతే ముందుంటారో వారినే యూజర్లు ఎక్కువగా ఆదరిస్తారు. అలాంటి సాంకేతికత యూజర్లకు అందుబాటులోకి వస్తే.. ఇకపై గూగుల్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్‌ లేదా అమెజాన్‌ వంటి ఉత్పత్తులను విక్రయించే వెబ్‌సైట్‌లను యూజర్లు పూర్తిగా మర్చిపోతారు. యూజర్‌ అవసరాలను పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌లు ముందుగానే గుర్తించి, దానికి తగినట్లుగా ఫలితాలను వెల్లడిస్తాయి. దాంతోపాటు యూజర్‌ చదవలేని వాటిని ఏఐ చదివి వినిపిచడంతోపాటు, యూజర్‌ రోజువారీ ఇచ్చే కమాండ్‌లను అర్థం చేసుకుని సేవలను అందిస్తుంది. ప్రస్తుతం కంపెనీలు జీపీటీ తరహా సాంకేతికతపైనే దృష్టి సారించాయి. వాటిని మరింతగా అభివృద్ధి చేసి పర్సనల్‌ ఏఐ అసిస్టెంట్‌ల స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని బిల్‌ గేట్స్‌ అభిప్రాయపడ్డారు. 

లింక్డ్‌ఇన్‌ సహ-వ్యవస్థాపకుడు రైడ్‌ హోఫ్‌మన్‌ రూపొందించిన చేసిన ఇన్‌ఫ్లెక్షన్‌ ఏఐ వ్యక్తిగతంగా తనను ఎంతగానో ఆకట్టుకుందని బిల్‌ గేట్స్‌ చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ సంస్థ అలాంటి ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయలేకపోవడం తనను కొంత నిరాశకు గురిచేసిందన్నారు. ఇటీవలే చాట్‌జీపీటీ-4 మోడల్‌ను మైక్రోసాఫ్ట్‌ సంస్థ బింగ్ చాట్‌ (Bing Chat) రూపంలో యూజర్లకు పరిచయం చేసింది. దాంతోపాటు బింగ్‌ ఇమేజ్‌ క్రియేటర్‌ (Bing Image Creator), బింగ్‌ ఎడ్జ్‌ యాక్షన్స్‌ (Bing Edge Actions), బింగ్ కంపోజ్‌ (Bing Compose), బింగ్‌ యాక్షన్స్‌ (Bing Actions) పేరుతో కొత్త ఫీచర్లను క్రియేట్ చేసింది. వీటితో యూజర్లు బింగ్‌ ఏఐ సాయంతో తమకు నచ్చిన విధంగా ఇమేజ్‌లను క్రియేట్‌ చేసుకోవడంతో పాటు, లెటర్లు కంపోజ్‌ చేసుకోవచ్చని తెలిపింది. వెబ్‌ విహారంలో ఇవి యూజర్‌కు కోపైలట్‌లాగా సహాయకారిగా ఉంటాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని