Bill Gates: మైక్రోసాఫ్ట్‌ విజయం వెనుక భారత్‌.. కొనియాడిన బిల్‌గేట్స్‌

Bill Gates: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత్‌తో తనకున్న అనుబంధం గురించి మరోసారి గుర్తుకుతెచ్చుకున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.

Published : 15 Jun 2024 14:31 IST

Bill Gates | ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రతీ సందర్భంలోనూ చెబుతుంటారు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates). తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ (Nikhil Kamath) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌ విజయం వెనక భారతీయుల కృషి ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కొన్ని ఇతర అంశాలపైనా వీరు చర్చించుకున్నారు. 

నిఖిల్ కామత్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ సిరీస్‌ను ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్‌ మొదటి గెస్ట్‌గా వచ్చిన బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఇక్కడినుంచే నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను మైక్రోసాఫ్ట్‌లో నియమించుకున్నాం. వారిని సియాటెల్‌ తీసుకెళ్లాం. తర్వాత వారు మళ్లీ భారత్‌కు ఇచ్చి డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను నెలకొల్పారు. ప్రస్తుతం ఇవి నాలుగు ప్రదేశాల్లో ఉన్నాయి. ఇందులో 25వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ విజయంలో భాగమైన చాలామంది అద్భుతమైన వ్యక్తులు భారత్‌ నుంచి వచ్చినవారే’’ అని బిట్‌గేట్స్‌ అన్నారు.

ఒక వ్యక్తి ఎన్ని సిమ్‌ కార్డ్‌లు కొనుగోలు చేయొచ్చు..?

‘‘ఇలా వచ్చినవారిలో నేడు అగ్రస్థానంలో ఉన్న సత్య నాదెళ్ల (Satya Nadella) ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నా డిజిటల్‌ కెరియర్‌ ప్రారంభంలో భారత్‌తో ఉన్న అనుబంధం ఇప్పుడు కీలకంగా మారింది’’ అని గేట్స్‌ అన్నారు. అయితే ఇప్పటికీ భారత్‌ పేదరికాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగం గురించి మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల ఉద్యోగంపై ఏఐ ప్రభావం ఉంటుందని వస్తున్న వాదనలను గేట్స్‌ తోసిపుచ్చారు. కీలకమైన రంగాల్లో ఏఐ తోడు నిలవడమే కాకుండా, ఉత్పాదకతను పెంచడంలో సాయపడుతుందని ఏఐ గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని