ఉదయ్‌ కోటక్‌ కుమారుడితో ‘ఇజం’ హీరోయిన్‌ నిశ్చితార్థం

జై కోటక్‌, అదితి ఆర్య ఒక్కటి కాబోతున్నారు. వీరికి నిశ్చితార్థం అయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Published : 26 May 2023 19:06 IST

దిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్‌ కోటక్‌ (Uday Kotak) కుమారుడు జై కోటక్‌ (Jay Kotak), నటి అదితి ఆర్య (Aditi Arya) ఒక్కటి కాబోతున్నారు. వీరికి గతేడాదే నిశ్చితార్థం అయినా.. ఇరు కుటుంబాలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాయి. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జై కోటక్‌ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. తనకు కాబోయే భార్య యేల్‌ యూనివర్సిటీ నుంచి విజయవంతంగా ఎంబీఏ పట్టా పొందిందంటూ ట్వీట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

జై కోటక్‌తో అదితి ఆర్య నిశ్చితార్థానికి సంబంధించి గతేడాదే ఊహాగానాలు వచ్చాయి. వీరు ఇరువురూ పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ వద్ద ఉన్న చిత్రాలు బయటకు రావడం ఇందుకు నేపథ్యం. అయితే, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇన్నాళ్లూ బయట పెట్టలేదు. తాజాగా అదితి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసకున్న సందర్భంగా జై కోటక్‌ చేసిన ట్వీట్‌తో నిశ్చితార్థం విషయంలో స్పష్టత వచ్చింది. ఈ ట్వీట్‌పై ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్‌ గొయెంకా సహా పలువురు స్పందించారు. త్వరలో ఈ జంట ఒక్కటవ్వాలని ఆకాంక్షించారు.

జై కోటక్‌ కొలంబియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన డిజిటల్‌ ఫస్ట్‌ మొబైల్‌ బ్యాంక్‌ కోటక్‌ 811కి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇక దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసకున్న అదితి ఆర్య.. గతలో ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్‌ అనే ప్రొఫెషనల్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌లో రీసెర్చి అనలిస్ట్‌గా పనిచేశారు. 2015లో ఫెమినా మిస్‌ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. తెలుగులో పూరీ జగన్నాథ్‌, కల్యాణ్‌ రామ్‌ కాంబోలో వచ్చిన ‘ఇజం’లో నటించారు. అలాగే, రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన ‘83’ సహా పలు హిందీ చిత్రాల్లోనూ నటించారు. తాజాగా అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని