Bima Sugam: బీమా సుగమ్‌తో ప్రయోజనమెంత?

భారత్‌లో బీమా రంగాన్ని డిజిటలీకరణ వైపు వడివడిగా అడుగులు వేయించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా బీమా రంగ విస్తరణకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ‘బీమా సుగమ్‌’ పేరిట ఆన్‌లైన్‌ వేదిక రంగ ప్రవేశం చేయనుంది.

Updated : 10 Nov 2022 08:41 IST

భారత్‌లో బీమా రంగాన్ని డిజిటలీకరణ వైపు వడివడిగా అడుగులు వేయించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా బీమా రంగ విస్తరణకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ‘బీమా సుగమ్‌’ పేరిట ఆన్‌లైన్‌ వేదిక రంగ ప్రవేశం చేయనుంది. ఈ వేదిక బీమా రంగంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఒక దేశ ఆర్థిక ప్రగతికి బీమా రంగ పురోగతి సైతం ఓ కీలకాంశం అని 1964లోనే ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. కొవిడ్‌ సంక్షోభంలో చేదు అనుభవాలు, భయపెడుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లోనూ బీమా రంగంలో భారత్‌ పురోగమిస్తోంది. దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా దేశంలో బీమా రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలీకరణ బాట పట్టించేందుకు కేంద్రం సంకల్పించింది. అందులో భాగంగా ఆన్‌లైన్‌ వేదిక ‘బీమా సుగమ్‌’ను తీసుకొస్తున్నట్లు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది. బీమా పాలసీల కొనుగోలు, విక్రయాలు సహా అన్ని సేవలకూ ఉమ్మడి వేదికగా సుగమ్‌ నిలవనుంది. క్లెయిముల పరిష్కారాలు సైతం దీని ద్వారానే జరుగుతాయని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేవాశిష్‌ పాండా చెబుతున్నారు. వ్యక్తిగత ఏజెంట్లు, వెబ్‌ అగ్రిగేటర్లు సహా బీమా మధ్యవర్తులందరికీ సుగమ్‌ పోర్టల్‌ అందుబాటులో ఉంటుంది. వచ్చేఏడాది జనవరి ఒకటి నుంచి దాన్ని వినియోగంలోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

నేరుగా పాలసీ!

పాలసీదారులు సుగమ్‌ పోర్టల్‌లోకి వెళ్ళి నేరుగా పాలసీ తీసుకోవచ్చు. వాహన, వ్యక్తిగత, వైద్య, ప్రమాద... ఇలా అన్ని రకాల బీమాలకు సంబంధించి వివిధ కంపెనీల పాలసీలు అందులో అందుబాటులో ఉంటాయి. అవగాహన ఉంటే నేరుగా కావాల్సిన పాలసీని ఎంచుకోవచ్చు. లేదంటే మధ్యవర్తులను సంప్రదించి, సేవలు పొందవచ్చు. నేరుగా పాలసీని ఎంచుకోగలమని అనుకునేవారికి సుగమ్‌ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. దేశంలోని దాదాపు 70 ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో లక్షల సంఖ్యలో ఏజెంట్లు, అగ్రిగేటర్లు, టెలికాలర్లు పని చేస్తున్నారు. వారి ఉపాధి దెబ్బతినకుండా బీమా సుగమ్‌ను విజయవంతం చేయడం పెద్ద సవాలే. ఏటా ఆరున్నర శాతానికి పైగా వృద్ధి రేటుతో జీవిత బీమా రంగం దూసుకెళ్తోంది. ఇలాగే పురోగమిస్తే ఈ ఏడాది చివరకు దేశంలో జీవిత బీమా ప్రీమియాలు రూ.8.25 లక్షల కోట్లను దాటుతాయని అంచనా. బీమా రంగ వ్యాపారంలో ఇప్పటికీ 70శాతానికి పైగా వాటా జీవిత బీమాదే. సాధారణ బీమా (జనరల్‌ ఇన్సూరెన్స్‌/నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌) మరింత పుంజుకోవాల్సిన అవసరాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఇప్పుడున్న వృద్ధిని ఇదే వేగంతో కొనసాగిస్తే 2030కల్లా భారత్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద బీమా వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. అంతటి విస్తృతి ఉన్న బీమా రంగంపై వినియోగదారులకు మరింత మెరుగైన అవగాహన కల్పించడానికి బీమా సుగమ్‌ ఓ మంచి వేదిక కావాలన్నది నిపుణుల సూచన.

డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ అద్భుతమైన విజయం సాధించినట్లుగానే బీమా రంగంలో సుగమ్‌ సరికొత్త శకానికి నాంది పలుకుతుందని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేవాశిష్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ స్థాయిలో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనడం ఆషామాషీ విషయమేమీ కాదు. యూపీఐ ద్వారా గత నెలలో దేశంలో 700 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.12.11 లక్షల కోట్లు. ఇన్ని కోట్ల లావాదేవీల్లోనూ వైఫల్యాలు మూడు శాతంలోపే నమోదయ్యాయి. అవీ సాంకేతికంగా వెనకబడిన ప్రభుత్వ రంగ బ్యాంకులవే ఎక్కువ. లావాదేవీ విఫలమైనా ఒకటి, రెండు రోజుల్లో వినియోగదారుడు తన సొమ్మును తిరిగి పొందగలిగే వెసులుబాటు ఉంది. ఇవన్నీ యూపీఐ విజయానికి ప్రధాన కారణాలు. కానీ బీమా రంగం ఇప్పటికీ వినియోగదారుకు పూర్తిగా అర్థంకాని బ్రహ్మ పదార్థమే.

సమస్యలెన్నో...

ఒక పాలసీ తీసుకుంటే దానికి సంబంధించిన ప్రతి వివరం పాలసీదారుకు తెలియడం చాలా అవసరం. కానీ పాలసీల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏజెంట్లు అతిశయోక్తులు చెప్పడం ఈ రంగంలో ఎప్పటి నుంచో ఉంది. పాలసీ సమగ్ర వివరాలు పోర్టల్‌లో, ఉత్పత్తుల ప్రచారంలో ఉన్నా అవి సామాన్యుడికి అర్థంకావు. అందుకే పాలసీని క్లెయిము చేసుకునేటప్పుడు రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. మరింత సమగ్ర విచారణ అవసరమైన సందర్భాల్లో తప్ప బీమా క్లెయిము నెల రోజుల్లో పూర్తి కావాలన్నది ఐఆర్‌డీఏఐ చెప్పే మాట. కొవిడ్‌ కాలం నాటి క్లెయిములు ఇంకా పరిష్కారం కాలేదంటే... వ్యవస్థలోని లోపాలను అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా మాత్రమే కాదు ప్రమాద, జీవిత బీమాలోనూ పాలసీ క్లెయిముకు వచ్చేసరికి ఎన్నో చిక్కుముళ్లు తలెత్తుతున్నాయి. ఇవన్నీ దాటి బీమా రంగంలో పూర్తి పారదర్శకత తేవడానికి ఉపయోగపడితేనే సుగమ్‌ పోర్టల్‌కు సార్థకత చేకూరుతుంది.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని