Insurance: త్వరలో అందుబాటులోకి బీమా సుగమ్‌ పోర్టల్‌.. ప్రయోజనాలివే!

భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (Irdai)..‘బీమా సుగమ్‌’ పేరుతో ఒక ప్రత్యేక ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Updated : 20 Oct 2022 14:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (Irdai)..‘బీమా సుగమ్‌’ పేరుతో ఒక ప్రత్యేక ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దీని ద్వారా జీవిత, జీవితేతర బీమా పాలసీలు అందించే అన్ని సంస్థలనూ ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ పోర్టల్‌ 2023 జనవరి 1 నుంచి అందుబాటలోకి వస్తుందని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

బీమా సుగమ్‌ అంటే?

బీమా పాలసీ కొనుగోలు, ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ చేసుకోవడం (పోర్టబిలిటీ), బీమా ఏజెంట్లను మార్చుకోవడం, క్లెయింల పరిష్కారం వంటి అన్ని బీమా అవసరాలకు ‘బీమా సుగమ్‌’ ఒక వేదిక (వన్‌ స్టాప్‌ డెస్టినేషన్‌) కానుంది. కొనుగోలుదారులు ఈ వేదిక ద్వారా జీవిత, ఆరోగ్య, మోటరు బీమా పాలసీలను, బీమా సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వెబ్‌ అగ్రిగేటర్లు (కవర్ ఫాక్స్, పాలసీ బజార్‌ లాంటివి), బ్రోకర్లు (బజాజ్‌ క్యాపిటల్‌, ప్రోబస్‌ ఇన్సెరెన్స్‌ బ్రోకర్‌ వంటివి), బ్యాంకులు, బీమా ఏజెంట్లు మధ్యవర్తులుగా ఉంటూ అందించే సేవలను బీమా సుగమ్‌ వేదికగా ఈ-ఇన్సురెన్స్‌ ఖాతా (E-IA)తో పాలసీదారులు పొందవచ్చు. 

ప్రయోజనాలు..

పోల్చి చూసుకోవచ్చు: ఈ ఫ్లాట్‌ఫారం కొనుగోలుదారులకు పాలసీ ఎంపికలో విస్తృత సమాచారాన్ని అందిస్తుంది. పాలసీదారులు వివిధ కంపెనీలు అందించే (జీవిత, సాధారణ) పాలసీలను పోల్చి చూసుకుని అన్ని విధాలుగా అనువైన పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా బీమా సంస్థలు తీసుకొచ్చే పలు వినూత్న పాలసీలు తర్వగా ఆమోదం పొందే వీలుంది. 

పోర్టబిలిటీ: ఇప్పటికే పాలసీ తీసుకున్న పాలసీదారులు, తమ ప్రస్తుత బీమా సంస్థ/ ఏజెంట్లతో కవరేజీ, ప్రీమియం విషయంలో గానీ, మరే ఇతర విషయాల్లో గానీ సవాళ్లను ఎదుర్కుంటున్నట్లయితే.. ఈ వేదిక ద్వారా పాలసీని సులభంగా పోర్ట్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ యాక్సెస్, పునరుద్ధరణ: బీమా సంస్థలు తమ నిర్వహణ ఖర్చును తగ్గించుకునేందుకు.. డిజిటల్‌ పాలసీలను జారీ చేస్తున్నాయి. ఇందుకు ఐఆర్‌డీఏఐ అనుమితినిచ్చింది. ఈ డిజిటల్‌ పాలసీలను బీమా సుగమ్‌ ప్లాట్‌ఫారం ద్వారా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే, పాలసీ వివరాలు, పునరుద్ధరణ తేదీలను కూడా తెలియజేస్తుంది.

కమీషన్‌ ఉండదు: మధ్యవర్తుల ద్వారా పాలసీని కొనుగోలు చేస్తే.. వారికి బీమా సంస్థలు కొంత కమీషన్‌ చెల్లించాలి. ఈ కమీషన్‌ కూడా పాలసీదారులు చెల్లించే ప్రీమియంలో జత చేసి వసూలు చేస్తారు. ఈ ప్లాట్‌పారం ద్వారా కొనుగోలు చేస్తే మధ్యవర్తులు ఉండరు. కమీషన్‌ చెల్లించాల్సిన పనిలేదు. కాబట్టి సరైన ప్రీమియంతో పాలసీని ఎంచుకోవచ్చు. 

ఎలా పనిచేస్తుంది? 

‘బీమా సుగమ్‌’ ప్లాట్‌ఫారం.. సెంట్రలైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో వస్తుంది. అందువల్ల మీ అన్ని పాలసీలనూ సులభంగా నిర్వహించే వీలు కల్పిస్తుంది. పాలసీలను ఆన్‌లైన్‌లో సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీని కోసం ట్రేడింగ్‌, పెట్టుబడుల మాదిరిగా డీమ్యాట్‌ ఖాతా అవసరం ఉండదు. ఆధార్‌ ధ్రువీకరణ ద్వారా అనుమతిస్తే సరిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని