Bima Sugam: డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ.. బీమా రంగంలో ‘సుగమ్‌’

బీమా పాలసీ, కంపెనీని ఎంచుకునే విషయంలో సుగమ్‌ ద్వారా అనేక ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వాటిలో మెరుగైన వాటిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Published : 30 Oct 2022 19:28 IST

దిల్లీ: ‘బీమా సుగమ్‌’ పేరిట తీసుకురానున్న ఆన్‌లైన్‌ వేదిక భారత్‌లో బీమారంగ స్వరూపాన్ని సమూలంగా మార్చివేయనుందని ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI)’ తెలిపింది. దేశంలో బీమా విస్తరణకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు అవాంతరాలు లేని సేవలు అందుతాయని తెలిపింది.

డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ తరహాలోనే.. బీమా రంగంలో సుగమ్‌ సరికొత్త శకానికి నాంది పలుకుతుందని ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేవాశీష్‌ పాండా అన్నారు. 2016లో ప్రారంభమైన యూపీఐ తక్కువ కాలంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గతనెలలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.11 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అదే తరహాలో బీమా రంగంలో సుగమ్‌ సైతం విజయాన్ని అందుకుంటుందని పాండా తెలిపారు. బీమా పాలసీల కొనుగోలు, అమ్మకాలు సహా ఇతర సేవలకు ఉమ్మడి వేదికగా సుగమ్‌ నిలవనుందని పేర్కొన్నారు. క్లెయిం సెటిల్‌మెంట్లు కూడా దీని ద్వారానే జరుగుతాయన్నారు. వ్యక్తిగత ఏజెంట్లు, వెబ్‌ అగ్రిగేటర్లు సహా ఇతర బీమా మధ్యవర్తులందరికీ సుగమ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పాలసీదారులు సైతం నేరుగా దీన్ని యాక్సెస్‌ చేసుకోవచ్చని వివరించారు. లేదంటే మధ్యవర్తులను సంప్రదించైనా సేవల్ని పొందొచ్చని తెలిపారు.

పాలసీ, కంపెనీని ఎంచుకునే విషయంలో సుగమ్‌ ద్వారా అనేక ఎంపికలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పాండా తెలిపారు. వాటిలో మెరుగైన వాటిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఫలితంగా వివిధ కంపెనీలు, వివిధ పాలసీల మధ్య పోలికకు వినియోగదారుడికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సుగమ్‌ ఓ షాపింగ్‌ మాల్ తరహాలో పనిచేస్తుందని వివరించారు. కేవైసీ విషయానికి వస్తే ఒక్క ఆధార్‌ నెంబర్‌ ఉంటే సరిపోతుందని తెలిపారు. వివరాలన్నీ దానికవే వచ్చేస్తాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని