CryptoCurrency: క్రిప్టోలకు భారత్‌లో అనువైన వాతావరణం లేదు: బైనాన్స్ సీఈఓ

Cryptocurrency: క్రిప్టోలావాదేవీలపై భారత ప్రభుత్వం 30 శాతం పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ వర్చువల్‌ కరెన్సీ బదిలీలపై 1 శాతం టీడీఎస్‌ కూడా వర్తింపజేస్తోంది. అయితే, ఇలాంటి పన్ను విధానం క్రిప్టో వ్యాపారానికి అనువైనది కాదని బైనాన్స్‌ సీఈఓ అన్నారు.

Published : 18 Nov 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిప్టోకరెన్సీపై భారత్‌ అనుసరిస్తున్న అప్రమత్తతతో కూడిన విధానాలు కొన్ని అంతర్జాతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలకు రుచించడం లేదు. అంతర్జాతీయంగా విస్తరించాలనుకుంటున్న ఆయా సంస్థలు భారత్‌లో ఉన్న పన్ను విధానాలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. తాజాగా ప్రముఖ క్రిప్టో సంస్థ బైనాన్స్‌ సీఈఓ చాంగ్‌పెంగ్‌ ఝావో (సీజెడ్‌).. క్రిప్టో లావాదేవీలపై భారత్‌ విధిస్తున్న పన్నులు క్రిప్టో ఎక్స్ఛేంజీల కార్యకలాపాలకు అనువుగా లేవని తెలిపారు. టెక్‌క్రంచ్‌ గురువారం నిర్వహించిన క్రిప్టో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

క్రిప్టోకరెన్సీలతో ఉన్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన భారత్‌ క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను విధించింది. డిజిటల్‌ కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయం, ఆస్తుల బదిలీపై ఈ 30శాతం పన్ను ఉంటుందని స్పష్టం చేసింది. డిజిటల్‌ కరెన్సీతో జరిగే ఆస్తుల బదిలీపై ఒక శాతం టీడీఎస్‌ విధించింది. అంతేకాకుండా ఈ ఆదాయంపై పన్ను మినహాయింపు కూడా ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యల వల్లే ఇటీవలి క్రిప్టో పతనం నుంచి భారత మదుపర్లు సురక్షితంగా బయటపడగలిగారని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, దీన్నీ జీర్ణించుకోలేకపోతున్న అంతర్జాతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలు మాత్రం భారత్‌పై విమర్శలు చేస్తున్నాయి.

‘‘భారత్‌లో క్రిప్టో వ్యాపార కార్యకలాపాలకు అనువైన వాతావరణం లేదు. ఒక్కో లావాదేవీపై ఒక శాతం పన్ను విధిస్తే.. పెద్దగా లావాదేవీలు జరగవు. ఒక యూజర్‌ రోజుకి 50 లావాదేవీలు చేస్తే.. అతను ఆర్జించిన ఆదాయంలో 70 శాతం కోల్పోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు పెద్దగా లావాదేవీలు ఉండవు. ఇలా నిలదొక్కుకోలేని వ్యాపార వాతావరణం ఉన్న దేశాల్లోకి మేం వెళ్లబోం’’ అని ఝావో భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, భారత్‌లో మాత్రం తమ వ్యాపారం లాభదాయకంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 4,29,000 బైనాన్స్‌ డౌన్‌లోడ్లు ఉన్నాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని