Cryptocurrencies: కనిష్ఠాలకు క్రిప్టోకరెన్సీలు.. భారీగా పతనమైన బిట్‌కాయిన్‌

బిట్‌కాయిన్‌ సహా ప్రధాన క్రిప్టోకరెన్సీల విలువలు భారీగా పనతమయ్యాయి....

Updated : 14 Jun 2022 12:37 IST

న్యూయార్క్‌: బిట్‌కాయిన్‌ సహా ప్రధాన క్రిప్టోకరెన్సీల విలువలు భారీగా పతనమయ్యాయి. దీంతో రూ.వేలాది కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ప్రముఖ క్రిప్టోకరెన్సీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన సెల్సియస్‌ నెట్‌వర్క్‌.. ఉపసంహరణ, ఖాతాల మధ్య బదిలీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే తాజా పతనానికి ముఖ్య కారణం.

బిట్‌కాయిన్‌ మంగళవారం ఉదయం 11:31 గంటల సమయంలో 10 శాతం మేర కుంగి 22,765 డాలర్ల వద్ద చలిస్తోంది. 2021 ఆగస్టులో 68,789 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరిన బిట్‌కాయిన్‌ అక్కడి నుంచి ప్రస్తుతం 66 శాతానికి పైగా పతనమైంది. రెండో అత్యంత విలువైన క్రిప్టోరెన్సీగా చలామణి అవుతున్న ఇథేరియం విలువ 8 శాతానికి పైగా దిగజారి 1,225 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ద్రవ్యోల్బణ భయాలు, ఫెడరల్‌ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు, ఆర్థిక మాంద్యం సూచనల నేపథ్యంలో టెక్‌ స్టాక్స్‌, డిజిటల్‌ కరెన్సీ వంటి రిస్క్‌తో కూడిన మార్గాల నుంచి మదుపర్లు నిష్క్రమిస్తున్నారు.

ప్రముఖ క్రిప్టోకరెన్సీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన సెల్సియస్‌ నెట్‌వర్క్‌ ఉపసంహరణ బదిలీలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. సెల్సియస్‌కు దాదాపు 1.7 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. 10 బిలియన్‌ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. అయితే, తిరిగి ఎప్పుడు లావాదేవీలను అనుమతిస్తారో ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ కస్టమర్ల నుంచి డిపాజిట్లను స్వీకరించి 19 శాతం వరకు రాబడినిస్తోంది. తిరిగి ఆ డిపాజిట్లను క్రిప్టోలో మదుపునకు రుణంగా అందజేస్తోంది. అయితే, సాధారణ మార్కెట్లతో పోలిస్తే రాబడి గణనీయంగా ఇస్తున్న నేపథ్యంలో సెల్సియస్‌పై నిఘా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని