Cryptocurrency: ఎఫ్‌టీఎక్స్‌-బైనాన్స్‌ డీల్ రద్దు.. రెండేళ్ల కనిష్ఠానికి క్రిప్టోలు!

ఇప్పటికే తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్న క్రిప్టోమార్కెట్‌పై ఎఫ్‌టీఎక్స్‌-బైనాన్స్‌ డీల్‌ రద్దు తీవ్ర ప్రభావం చూపింది. ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ దాదాపు రెండేళ్ల కనిష్ఠానికి చేరాయి.

Updated : 10 Nov 2022 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పరిమాణం పరంగా అతిపెద్ద క్రిప్టోఎక్స్ఛేంజ్‌ బైనాన్స్‌ తమ ప్రత్యర్థి సంస్థ ఎఫ్‌టీఎక్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. క్రిప్టో చరిత్రలోనే దీన్ని ఒక కీలక పరిణామంగా నిపుణులు పేర్కొన్నారు. ఇది జరిగిన 24 గంటల్లోపే బైనాన్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఎఫ్‌టీఎక్స్‌లో సమస్యలు నియంత్రించలేని స్థాయికి వెళ్లిపోయాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. 

ఇప్పటికే భారీగా పతనమైన క్రిప్టోమార్కెట్‌ ఈ పరిణామంతో మరింత కుంగింది. ప్రధాన క్రిప్టోకరెన్సీలన్నీ రెండేళ్ల కనిష్ఠానికి చేరాయి. అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పరిగణిస్తున్న బిట్‌కాయిన్‌ బుధవారం 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకొని 16,800 ఎగువన ట్రేడవుతోంది. ఏడాది క్రితం ఈ కాయిన్‌ 69,000 డాలర్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇప్పటి వరకు బిట్‌కాయిన్‌ 75 శాతం కుంగింది. ఎఫ్‌టీఎక్స్‌ ప్రధాన వాటాదారుగా ఉన్న సొలానా ఒక్క బుధవారం రోజే 50 శాతానికి పైగా నష్టపోయింది. 2021లో నమోదైన గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఈ కాయిన్‌ 93 శాతం విలువ కోల్పోయింది.

ఎఫ్‌టీఎక్స్‌ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే క్రిప్టోమార్కెట్‌ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లు కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు క్రిప్టోల సెంటిమెంటును దెబ్బతీయడమే దీనికి కారణం. నేడు వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలూ క్రిప్టో మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గురువారం మధ్యాహ్నం 1:16 గంటల సమయంలో బిట్‌కాయిన్‌ 16732 డాలర్లు, ఇథేరియం 1,188 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని