Stock Market: బేర్‌ స్వైర విహారం.. ఎరుపు రంగు పులుముకున్న మార్కెట్లు!

అవకాశం కోసం కాచుక్కూర్చున్నట్లుగా బేర్‌ మార్కెట్లపై సోమవారం పంజా విసిరింది. ఎరుపు రంగు పులుముకొని స్వైరవిహారం చేసింది. గతకొన్ని రోజులుగా నష్టాలు చవిచూస్తున్న మదుపర్లపై ఏమాత్రం కనికరం లేకుండా వారి సంపదను దోచుకుంది....

Updated : 24 Jan 2022 16:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవకాశం కోసం కాచుక్కూర్చున్నట్లుగా బేర్‌ మార్కెట్లపై సోమవారం పంజా విసిరింది. ఎరుపు రంగు పులుముకొని స్వైరవిహారం చేసింది. గతకొన్ని రోజులుగా నష్టాలు చవిచూస్తున్న మదుపర్లపై ఏమాత్రం కనికరం లేకుండా వారి సంపదను దోచుకుంది! దీంతో వరుసగా ఐదో సెషన్‌లోనూ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. జనవరి 17 నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 3,900 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల విలువ ఆరు రోజుల్లో దాదాపు రూ.20 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 59,023.97 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. అమ్మకాలు ఏ దశలోనూ తగ్గకపోవడంతో అంతకంతకూ దిగజారుతూ పోయింది. ఓ దశలో 2,000 పాయింట్లకు పైగా పతనమై 56,984.01 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరింది. చివరకు 1545.67 పాయింట్లు కోల్పోయి 57,491.51 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 59,023.97 - 56,984.01 మధ్య కదలాడింది. నిఫ్టీ 17,575.15 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. రోజులో 17,599.40 - 16,997.85 మధ్య కదలాడింది. చివరకు 503.60 పాయింట్ల నష్టంతో 17,113.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.61 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఏ ఒక్క షేరూ లాభపడలేదు. బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, విప్రో, టెక్ మహీంద్రా, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. 

సూచీల పతనానికి కారణాలివే...

* అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు..

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో సూచీలు భారీగా పతనమయ్యాయి. గతవారం దాదాపు ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలు చవిచూశాయి. మరోవైపు వడ్డీరేట్లు పెంపు నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించిన ఫెడ్‌.. రేపటి నుంచి వరుసగా రెండు రోజుల పాటు భేటీ కానుంది. ఒమిక్రాన్‌తో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి బ్రేకులు పడ్డప్పటికీ.. రేట్ల పెంపు విషయంలో మార్పుపై ఫెడ్‌ వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్‌ స్టాక్‌లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. 

* కొత్త షేర్ల పతనం..

గత ఏడాది ఐపీఓల హవాను అందిపుచ్చుకోవడం కోసం అనేక టెక్‌ ఆధారిత కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి. చాలా కంపెనీలు ఆ జోరులో భారీగానే లాభపడ్డాయి. కానీ, వాటన్నింటిలో ఇప్పుడు లాభాల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో అప్పుడు అదరగొట్టిన షేర్లన్నీ ఇప్పుడు దిద్దుబాటు దిశలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో జొమాటో, నైకా వంటి రాణించిన షేర్లు గరిష్ఠాల నుంచి 21 శాతం కుంగాయి. ఇక పేటీఎం, కార్‌ట్రేడ్‌, పీబీ ఫిన్‌టెక్‌, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ వంటి షేర్లయితే ఇష్యూ ధర నుంచి ఏకంగా 50 శాతం వరకు నష్టపోయాయి.  

* కొవిడ్‌ ఉద్ధృతి..

దేశంలో కరోనా విజృంభణ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు మహమ్మారి కట్టడికి విధించిన ఆంక్షల్ని మరికొంతకాలం పొడిగించాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి.  

* ఒత్తిడిలో కంపెనీల మార్జిన్లు..

ఇప్పటి వరకు వెలువడిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఓ కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. పెరుగుతున్న ముడిసరకుల ధరల వల్ల సంస్థల ఆదాయాలు దెబ్బతిన్నాయన్న విషయం స్పష్టమైంది. ముడి చమురు ధరలు పెరగడం, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సరఫరా గొలుసులో ఇబ్బందులు కొనసాగనుండడంతో మరికొంత కాలం ఈ ఒత్తిడి కొనసాగొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.  

* రష్యా-ఉక్రెయిన్‌ వివాదం..

రష్యా-ఉక్రెయిన్‌ (Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం రోజురోజుకీ ముదురుతోంది. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్‌ సరిహద్దులకు తరలించేందుకు బాల్టిక్‌ దేశాలకు అగ్రరాజ్యం ఇటీవల అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధమేఘాలు కమ్ముకొంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తమ దౌత్య సిబ్బందిని అమెరికా తగ్గించింది.

* ప్రీ-బడ్జెట్‌ దిద్దుబాటు..

సాధారణంగా బడ్జెట్‌పై అంచనాలతో జనవరి తొలి అర్ధభాగంలో సూచీలు పైకి ఎగబాకుతాయి. బడ్జెట్‌ దగ్గరకొస్తున్న కొద్దీ కేటాయింపులపై వివిధ వర్గాల నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా సూచీలు చలిస్తుంటాయి. ఈసారి మహమ్మారి మూడో దశ విజృంభిస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. రెండో దశ తర్వాత వేగంగా కోలుకున్న ఆర్థిక కార్యకలాపాలకు ఒమిక్రాన్‌ బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో కొత్త పద్దును ఎలా రూపొదించనున్నారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా సూచీల పతనానికి కారణమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని