Blue Aadhaar card: బ్లూ ఆధార్‌ కార్డు గురించి తెలుసా?ఎవరికిస్తారు?

యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఆధార్‌ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. వీటిలో బాల ఆధార్‌ (Baal Aadhaar) కార్డుగా వ్యవహరిస్తున్నారు.....

Updated : 30 Apr 2022 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ఆధార్‌ కార్డు (Aadhaar card)  ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు.. ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్‌ (Aadhaar card) ఉండాల్సిందే. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)’ ఆధార్‌ కార్డును జారీ చేస్తోంది. 

సాధారణంగా ఆధార్‌ కార్డులు తెలుపురంగులో ఉండడం మనమంతా గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్‌ కార్డుల (Blue Aadhaar card)ను జారీ చేస్తోంది. వీటిని ‘బాల ఆధార్‌ (Baal Aadhaar)’ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 సంవత్సరాలలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరి నుంచి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్‌ వివరాలు (biometric information) సేకరించకుండానే కార్డు అందజేస్తారు. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారాన్ని అందజేస్తే సరిపోతుంది. వీరి కార్డుని తల్లిదండ్రుల ఆధార్‌ సంఖ్య (Aadhaar card)తో అనుసంధానిస్తారు. 

బాల ఆధార్‌ కార్డు (Baal Aadhaar) కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్‌ కార్డుని అప్‌డేట్‌ చేసుకోవాలి.

నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్‌ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. 

బాల ఆధార్‌ నమోదు ప్రక్రియ..

* ఆధార్‌ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్‌ కార్డు (Aadhaar card), అడ్రస్‌ ప్రూఫ్‌, పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని వెళ్లాలి.

* ఆధార్‌ నమోదు ఫారంను తీసుకొని నింపాలి. అందులో తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలను కూడా అందజేయాలి.

* తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్‌నే పిల్లల ఆధార్‌ కార్డుకూ అనుసంధానిస్తారు. కాబట్టి కచ్చితంగా మొబైల్‌ నెంబరును కూడా ఫారంలో నింపాలి.

* వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌ సమాచారం (biometric information) అవసరం లేదు. కేవలం పిల్లల ఫొటోను మాత్రమే తీసుకుంటారు.

* తర్వాత మీరిచ్చిన పత్రాలను ధ్రువీకరిస్తారు. వెంటనే మొబైల్‌ నెంబరుకు నమోదు ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.

* అక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ని తీసుకోవడం మర్చిపోవద్దు.

* 60 రోజుల్లోగా మీ పిల్లల పేరుపై నీలం రంగులో ఉండే బాల ఆధార్‌ (Baal Aadhaar) కార్డుని జారీ చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని