Automobile: బీఎండబ్ల్యూ ఎక్స్‌4 సిల్వర్‌ షాడో..ఆడి ఏ8 కొత్తగా.. ఇతర ఆటో అప్‌డేట్స్‌!

బీఎండబ్ల్యూ ఎక్స్‌4 మోడల్‌లో సిల్వర్‌ షాడో ఎడిషన్‌ కారును సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది....

Published : 18 Apr 2022 19:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్స్‌4 మోడల్‌లో ‘సిల్వర్‌ షాడో ఎడిషన్‌’ను బీఎండబ్ల్యూ సోమవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. చెన్నైలోని తయారీ కేంద్రం నుంచి వస్తున్న ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో వస్తోంది. పెట్రోల్‌ వేరియంట్‌లో 252 హెచ్‌పీ శక్తిని విడుదల చేసే 2-లీటర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6.6 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.71.9 లక్షలు (ఎక్స్‌షోరూం). డీజిల్‌ వెర్షన్‌లో 3-లీటర్‌ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇది 5.8 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదని సంస్థ పేర్కొంది. దీని ధర రూ.73.9 లక్షలు (ఎక్స్‌షోరూం). వెబ్‌సైట్‌ ద్వారా సోమవారం నుంచి ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు. 


ఆడి ఏ8 మరింత కొత్తగా..

ఆడి తమ సెడాన్‌ విభాగంలోని ఏ8 మోడల్‌ కొత్త వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సంస్థ నుంచి ఇది రెండో విడుదల. ఈ సంవత్సరం విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మరికొన్ని వారాల్లో ఈ కారు మార్కెట్లలోకి రానున్నట్లు ఆడి తెలిపింది. అలాగే త్వరలో బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీన్ని పూర్తిగా విదేశాల్లో తయారు చేసి దిగుమతి చేసుకోనున్నారు. దీంట్లో 3-లీటర్ల పెంట్రోల్‌ ఇంజిన్‌ అమర్చనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో ఆడి నుంచి క్యూ7 ఎస్‌యూవీ విడుదలైన విషయం తెలిసిందే.


సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వ్యాపారంలోకి అశోక్‌ లేల్యాండ్‌

కండ్‌ హ్యాండ్‌ వాణిజ్య వాహనాల వ్యాపారంలోకి అశోకా లేల్యాండ్‌ ప్రవేశిస్తోంది. ఈ మేరకు ‘మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వినియోగించిన వాణిజ్య వాహనాల క్రయవిక్రయాలను ‘ఫిజిటల్ (ఫిజికల్ + డిజిటల్‌)‌’ వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ రంగంలోకి ప్రవేశించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న తమ 700 పార్కింగ్‌ కేంద్రాల్లోని సదుపాయాలను వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వ్యాపారం దేశంలో భారీ ఎత్తున పుంజుకుంటోంది.


నేటి నుంచి మారుతీ మరింత ప్రియం

మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ, ముడి సరకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలోనే ధరల్ని పెంచినట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా పెరుగుతున్న ముడి సరకుల వ్యయాల వల్ల తమ వాహనాల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఫలితంగా కొంత భారాన్ని వినియోగదారుపై మోపక తప్పడం లేదని వివరించింది. మోడల్‌ను బట్టి ధరలు గరిష్ఠంగా 1.3 శాతం వరకు పెరిగినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని