Bonds: డబ్బుకు హామీ.. ఢోకాలేని వడ్డీ.. కావాలా?

కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్టభయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు....

Updated : 22 Apr 2022 11:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కచ్చితమైన రాబడితో పాటు దీర్ఘకాలంలో నష్టభయం తక్కువగా ఉండే పెట్టుబడి సాధనం బాండ్లు. వీటిని జారీ చేసే సంస్థలు మదుపర్ల దగ్గరి నుంచి నిధులు సమీకరించి ఒక నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించిన వడ్డీరేటు ప్రకారం తిరిగి పెట్టుబడిని చెల్లిస్తాయి. ఈ వడ్డీనే కూపన్‌ అని వ్యవహరిస్తుంటారు.

బాండ్లు, స్టాక్స్‌ మధ్య ప్రధాన వ్యత్యాసం విషయానికి వస్తే.. కంపెనీలో స్టాక్‌హోల్డర్లకు ఈక్విటీ వాటా ఉంటుంది. అదే బాండు హోల్డర్లకు కంపెనీలో క్రెడిటార్‌ వాటా దక్కుతుంది. భారత్‌లో ప్రభుత్వంతో పాటు పలు కంపెనీలు బాండ్లను జారీ చేస్తున్నాయి. వివిధ రకాల బాండ్ల గురించి చూద్దాం..

ప్రభుత్వ బాండ్లు: రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రభుత్వ బాండ్లుగా వ్యవహరిస్తారు. వీటి కాలపరిమితి 5 నుంచి 40 ఏళ్లు. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే బాండ్లను ‘స్టేట్‌ డెవలప్‌మెంట్‌ రుణాలు’ అని కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వ బాండ్లలో చిన్న మదుపరులూ మదుపు చేసేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ వేదిక ద్వారా వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. చాలావరకు ప్రభుత్వ బాండ్లలో వడ్డీరేటు స్థిరంగా ఉంటుంది. కొన్నింటిలో మాత్రం మారుతూ ఉంటుంది.

కార్పొరేట్‌ బాండ్లు: నిధుల సమీకరణ కోసం కంపెనీలు మదుపర్ల నుంచి డబ్బులు సేకరిస్తుంటాయి. వీటికి ఓ కచ్చితమైన వడ్డీరేటును హామీ ఇస్తాయి. వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టు స్థాపనకు కంపెనీలు బాండ్లను జారీ చేస్తుంటాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం కంటే ఈ మార్గం కంపెనీలకు లాభదాయకంగా ఉంటుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత బాండ్ల ముఖ విలువను వడ్డీతో సహా కంపెనీలు చెల్లిస్తాయి. ఒక నిర్దిష్ట కాలంలో కచ్చితమైన రాబడి కోరుకునేవారు వీటిలో మదుపు చేస్తుంటారు.

కన్వర్టబుల్‌ బాండ్లు: వీటిలో డెట్‌, ఈక్విటీ.. రెండు ఫీచర్లు ఉంటాయి. వీటిలో మదుపు చేసిన వారికి ఓ నిర్దిష్ట కాలపరిమితి తర్వాత ముందుగా నిర్ణయించిన ప్రకారం కొన్ని షేర్లను కేటాయిస్తారు. షేర్‌ హోల్డర్లకు లభించే అన్ని ప్రయోజనాలనూ అందిస్తారు. ఫలితంగా బాండ్లతో పాటు ఈక్విటీ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.

జీరో-కూపన్‌ బాండ్లు: పేరు సూచించినట్లుగా ఈ రకమైన బాండ్లలో మదుపు చేయడం వల్ల ఎలాంటి వడ్డీ అందించరు. దీనినే ‘ప్యూర్‌ డిస్కౌంట్‌ బాండు’ అని కూడా అంటారు. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత మన పెట్టుబడి పైన కొంత మొత్తాన్ని అధికంగా చెల్లిస్తారు.

ద్రవ్యోల్బణ ఆధారిత బాండ్లు: ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా రాబడి కావాలనుకునేవారికి ఈ బాండ్లు సరైనవి. వీటిని సాధారణంగా ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మనం పెట్టిన మూలధనంతో పాటు వడ్డీరేటులోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి.

ఆర్‌బీఐ బాండ్లు: వీటిని ‘ఫ్లోటింగ్‌ రేట్ సేవింగ్‌ బాండ్స్‌’ అని కూడా అంటారు. వీటిని ఆర్‌బీఐ జారీ చేస్తుంది. కాలపరిమితి ఏడేళ్లు. ఆరునెలలకోసారి వడ్డీరేటు మారుతూ ఉంటుంది. మారిన ప్రతిసారీ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆర్థిక వ్యవస్థలో వడ్డీరేట్లకు అనుగుణంగా ఈ బాండ్ల వడ్డీరేట్లు మారుతూ ఉంటాయి. అధిక వ‌డ్డీ రేటు ఇచ్చిన‌ప్పటికీ ప‌న్ను ఆదా చేసుకునే అవ‌కాశం ఉండ‌దు.

ప్రభుత్వ పసిడి బాండ్లు: బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత విషయంలో సందేహం ఉంటుంది. భద్రపర్చుకోవడం ఒక సమస్య. పరిష్కారంగా వచ్చినవే సార్వభౌమ పసిడి బాండ్లు. బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి సులభంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ డబ్బుతో బంగారంలో పెట్టుబడికి అవకాశం ఉండటం, పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5శాతం వడ్డీ లెక్కన, ఆరు నెలలకోసారి చెల్లించడంలాంటి ప్రయోజనాలతో చాలామంది తమ పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం వీటిని ఎంచుకుంటున్నారు. దీంట్లో లభించే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది.

ఎలా పెట్టుబడి పెట్టాలి: ప్రైమరీ లేదా సెకండరీ మార్కెట్ల ద్వారా బాండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. పెద్ద కంపెనీల పబ్లిక్‌ ఇష్యూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం ద్వారా ప్రైమరీ మార్కెట్‌లో పాల్గొనవచ్చు. ప్రత్యామ్నాయంగా ఎక్స్ఛేంజీల్లో కూడా బాండ్లు ట్రేడవుతుంటాయి. అయితే, కాలపరిమితి ముగిసే వరకు వీటిని నగదు రూపంలోకి మార్చుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రతికూలతలూ ఉన్నాయి..

*  ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీకి పన్ను వర్తించినట్లుగానే.. బాండ్ల పైన వచ్చిన ఆదాయానికీ వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

*  ఒకసారి బాండ్లలో మదుపు చేసిన తర్వాత అందులో నుంచి పెట్టుబడి వెనక్కి తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే, కొన్ని రకాల బాండ్లను హామీగా ఉంచి, రుణం తీసుకునే వీలుంది. 

*  వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు.. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో తక్కువ వడ్డీ వస్తుంది. కానీ, బాండ్‌ మార్కెట్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బాండ్లలో పెట్టిన పెట్టుబడి మొత్తమూ తగ్గుతూ వస్తుంది. ఇది కాస్త ప్రతికూల అంశమే.

అత్యంత సురక్షితమైన పథకాలను ఎంచుకోవాలని భావించేవారికి.. బాండ్లు సరైన మార్గం. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లలో ప్రభుత్వమే మీ డబ్బుకు హామీగా ఉంటుంది. కాబట్టి, అసలుకూ, వడ్డీకీ ఏ మాత్రం ఢోకా ఉండదు. కాకపోతే.. బ్యాంకుల్లో వచ్చే వడ్డీతో పోలిస్తే.. రాబడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అధికంగానూ ఉంటుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించేందుకు వీలుగా బాండ్లను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని