బుక్ బిల్డింగ్ vs రివ‌ర్స్ బుక్ బిల్డింగ్

మ‌దుప‌ర్లు తొలి ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) ద్వారా షేర్ల‌ కొనుగోలుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో వినిపించే ప‌దం బుక్ బిల్డింగ్ విధానం . బైబ్యాక్ స‌మ‌యంలో వినిపించే ప‌దం రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ ప‌ద్ధ‌తి....

Updated : 02 Jan 2021 19:08 IST

మ‌దుప‌ర్లు తొలి ప‌బ్లిక్ ఆఫ‌ర్ (ఐపీఓ) ద్వారా షేర్ల‌ కొనుగోలుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో వినిపించే ప‌దం బుక్ బిల్డింగ్ విధానం . బైబ్యాక్ స‌మ‌యంలో వినిపించే ప‌దం రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ ప‌ద్ధ‌తి. ఈ క‌థ‌నంలో బుక్ బిల్డింగ్ ప‌ద్ధ‌తి, రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ విధానం అంటే ఏంటి ? దీన్ని ఎందుకు ? ఎప్పుడు ? ఎలా ? అమ‌లుచేస్తార‌నే విష‌యాల‌ను వివ‌రంగా తెలుసుకుందాం. ఐపీఓ ల్లో షేరు ధ‌ర‌ను స్థిర ధ‌ర (ఫిక్సిడ్ ఫ్రైస్) లేదా ధ‌ర‌ శ్రేణి (ప్రైస్ రేంజ్) విధానం ద్వారా నిర్ణ‌యిస్తుంటారు. ధ‌ర శ్రేణి ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో బుక్ బిల్డింగ్ విధానం అమ‌లు చేసి షేరు ధ‌ర ను నిర్ణ‌యిస్తారు. ఇది సంస్థ నుంచి మ‌దుప‌ర్లు షేర్లను కొనుగోలు చేసే ప్ర‌క్రియ‌. దీనికి రివ‌ర్స్ లో జ‌రిగే ప్ర‌క్రియ‌ బైబ్యాక్ .

కంపెనీ ప్ర‌మోట‌ర్లు త‌మ వాటాదార్ల నుంచి షేర్ల‌ను తిరిగి కొనుగోలుచేసే ప్ర‌క్రియ‌ను బైబ్యాక్ అంటారు. బైబ్యాక్ లో స్థిరధ‌ర‌ పాటు ప‌రిమితి ప్ర‌కారం బిడ్లు దాఖ‌లు చేయాల‌ని ప్ర‌మోట‌ర్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంటారు. స్థిరధ‌ర లేని సంద‌ర్భాల్లో రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ విధానంలో షేరు ధ‌ర‌ను నిర్ణ‌యిస్తుంటారు. స్థిరధ‌ర (ఫిక్సిడ్ ప్రైస్) విధానంలో ఆఫ‌ర్ డాక్యుమెంటులో క‌నీస పెట్టుబ‌డి, క‌నీస షేర్ల సంఖ్య త‌దిత‌ర‌ వివ‌రాల‌ను ప్ర‌చురిస్తుంది. ఉదాహర‌ణ‌కు కంపెనీ షేరు ధ‌ర రూ.100, క‌నీస షేర్ల సంఖ్య‌ (లాట్) 100 గా నిర్ణ‌యించింద‌నుకుందాం. ఆస‌క్తి క‌లిగిన మ‌దుప‌ర్లు ఆఫ‌ర్ లో తెలిపిన విధంగా బిడ్ చేయాల్సి ఉంటుంది. బుక్ బిల్డింగ్ - బుక్ బిల్డింగ్ ప‌ద్ధ‌తిలో షేరు ధ‌రకు కొంత (రేంజ్) శ్రేణి ఉంటుంది. ఆ శ్రేణిలో ఉండే ధ‌ర‌ను మ‌దుప‌ర్లు ఎంపిక చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక షేరుకు ధ‌ర శ్రేణి రూ. 100-105 గా నిర్ణ‌యించారు. అప్పుడు మ‌దుప‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసేట‌పుడు ధ‌ర ఆ రేంజిలో ఉండేలా చూసుకోవాలి. వ‌చ్చిన డిమాండు ప్ర‌కారం ధ‌ర‌ను నిర్ణ‌యిస్తారు. ద‌ర‌ఖాస్తు చేసిన మ‌దుప‌ర్లకు నిబంధ‌న‌ల‌ ప్ర‌కారం షేర్లుకేటాయిస్తారు. షేరు ధ‌ర శ్రేణిలో త‌క్కువ ధ‌ర‌ను ఫ్లోర్ ధ‌ర అని, ఎక్కువ ధ‌ర‌ను క్యాప్ ధ‌ర అని అంటారు. బుక్ బిల్డింగ్ ప‌ద్ధ‌తిలో జ‌రిగే ఐపీఓను ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. మ‌దుప‌రి ఫ్లోర్ ధ‌ర, క్యాప్ ధ‌ర మ‌ధ్య‌ ప‌రిధిలో కాకుండా వేరే ధ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేస్తే అత‌ని ద‌ర‌ఖాస్తు తిర‌స్క‌రిస్తారు. ఆ ఇష్యూ లో షేరు ఎంత ధ‌రకు ఖ‌రార‌వుతుందో దాన్ని క‌టాఫ్‌ ధ‌ర అంటారు. మ‌దుప‌ర్లు క‌టాఫ్ ధ‌ర‌ను ఎంచుకోవ‌డం ద్వారా చివ‌ర‌గా నిర్ణ‌యించే ధ‌ర‌కు కొనుగోలు చేసేందుకు అంగీక‌రిస్తునట్ల‌వుతుంది. రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ - బుక్ బిల్డింగ్ విధానానికి వ్య‌తిరేక దిశ‌లో జ‌రిగే దాన్ని రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ అంటారు. ఇది బైబ్యాక్ స‌మ‌యంలో జ‌రుగుతుంటుంది. ప్ర‌మోట‌ర్లు బైబ్యాక్ ద్వారా వాటాను పొందేందుకు రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ విధానంలో షేర్లు కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా బైబ్యాక్ లో స్థిరధ‌ర విధానంలో కూడా జ‌రుగుతుంది. టెండ‌ర్ ఆఫ‌ర్ లో సంస్థ కొనుగోలు చేయాల‌నుకుంటున్న షేర్లు, ధ‌ర సంబంధిత వివ‌రాల‌ను ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంటుంది.

ఉదాహ‌ర‌ణ:
డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ గ‌త ఏడాది చేసిన బైబ్యాక్ ను తీసుకుంటే, సంస్థ గ‌తేడాది విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం షేరు ధ‌ర గ‌రిష్టంగా రూ. 3500 కు మించ‌కుండా బిడ్ లు దాఖ‌లు చేయాల‌ని మ‌దుప‌ర్లను కోరింది. షేర్లు క‌లిగిన మ‌దుప‌ర్లు ఇచ్చిన గ‌డువులో షేరు ప‌రిమిత ధ‌ర రూ. 3500 లోపు ద‌ర‌ఖాస్తు చేస్తే సంస్థ వారి వ‌ద్ద నుంచి షేర్ల‌ను కొనుగోలు చేస్తుంది. ఆ ఇష్యూలో పోస్ట్ ఆఫ‌ర్ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం మ‌దుప‌ర్ల నుంచి వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో క‌నిష్ట ధ‌ర రూ. 2934.80, గ‌రిష్ట ధ‌ర‌ రూ. 3200 దాఖ‌ల‌య్యింది. ఇక్క‌డ ఒక్కోషేరు స‌రాస‌రి ధ‌ర 3090.92 గా న‌మోదైంది. ఈ ఉదాహ‌ర‌ణ‌లో జ‌రిగిన ప్ర‌క్రియ‌ రివ‌ర్స్ బుక్ బిల్డింగ్ విధానం.

స్థిరధ‌ర విధానంలో జ‌రిగే బైబ్యాక్ కు ఉదాహ‌ర‌ణ:
జ‌జెన్బుర్క్ ఫార్మా విడుద‌ల చేసిన బైబ్యాక్ ప్ర‌క‌ట‌నలో సంస్థ కొనుగోలు చేయాల‌నుకుంటున్న ధ‌ర ఒక షేరుకు రూ.576, షేర్ల సంఖ్య‌ 2,08,333 గా ప్ర‌క‌టించింది. ఆస‌క్తి క‌లిగిన మ‌దుప‌ర్లు ఆ ఆఫ‌ర్ లో తెలిపిన విధంగా బిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉదాహ‌ర‌ణ‌లో సంస్థ పేర్కొన్న ధ‌ర‌కు కొనుగోలు ప్ర‌క్రియ‌ జ‌రుగుతుంది.

గ‌మ‌నిక: పైన పేర్కొన్న ఉదాహ‌ర‌ణ‌లు అవ‌గాహ‌న‌కు మాత్ర‌మే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని