IPL 2022: ‘బుక్‌ మై షో’లో ఐపీఎల్‌ టికెట్లు.. విక్రయాలు షురూ

IPL 2022: ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వేదిక బుక్‌ మై షో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంపాదించింది.

Updated : 25 Mar 2022 19:34 IST

ముంబయి: ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వేదిక బుక్‌ మై షో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 15వ సీజన్‌కు సంబంధించిన టికెట్ల విక్రయ హక్కులను సంపాదించింది. టికెటింగ్‌ రైట్స్‌తో పాటు అన్ని స్టేడియంలలో గేట్‌ ఎంట్రీ, స్పెక్టేటర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులను కూడా అందించనుంది. ఈ మేరకు ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో 10 జట్లు తలపడనున్నాయి. మొత్తం 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబయి, నవీ ముంబయి, పుణెలో నాలుగు మైదానాలను బీసీసీఐ ఎంపిక చేసింది. ముంబయిలోని వాంఖడే, బ్రాబౌర్న్‌ మైదానాల్ల్లో 20 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో 15, పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.

వాంఖడేలో తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం ఇస్తున్నామని బుక్ మై షో తెలిపింది. ఒక్కో టికెట్‌ ధర రూ.800 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. రెండు నెలల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు 25 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు బీసీసీఐ బుధవారమే వెల్లడించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని